యూట్యూబ్‌లో చిన్నగా మొదలైన ఒక ప్రయాణం ఎలా పెద్ద వివాదాలకు దారి తీస్తుందో చెప్పే తాజా ఉదాహరణ అన్వేష్ వ్యవహారం. ఒకప్పుడు కనీసం విదేశాలకు ప్రయాణం చేయడానికి కూడా సరిపడా డబ్బులు లేని స్థితిలో ఉన్న అన్వేష్, తన వీడియోలను నమ్మిన సబ్స్క్రైబర్ల సహకారంతో ట్రావెల్ యూట్యూబర్‌గా ఎదిగారు. మొదట్లో తన ప్రయాణాలు, అనుభవాలను సాదాసీదాగా చెప్పుకుంటూ ఎంతో మందికి ప్రేరణగా నిలిచారు. మధ్యతరగతి వాళ్లకూ ఇది సాధ్యమే అనే నమ్మకాన్ని చాలామందిలో కలిగించిన వ్యక్తిగా మంచి గుర్తింపు పొందారు.
కానీ కాలం మారింది, గుర్తింపు పెరిగింది, ఫాలోయింగ్ భారీగా పెరిగింది. ఇక్కడినుంచే అసలు సమస్య మొదలైంది. మన పరపతి పెరిగినప్పుడు మాటల్లో కూడా మార్పు వస్తుందని అంటారు. అన్వేష్ విషయంలో అది అహంకారం కంటే ‘అతి తెలివి’గా మారింది. యూట్యూబ్ ట్రావెలింగ్ విభాగంలో ఎక్కువ వ్యూస్ తెచ్చుకుంటున్న వారిని టార్గెట్ చేస్తూ, వారిని కించపరిచేలా మాట్లాడటం ద్వారా సమాజంలో నేను మాత్రమే మంచి చేస్తున్నాననే భావనను వ్యూవర్లలో కల్పించడానికి ప్రయత్నించారు.
సమాజ సేవ చేస్తున్నట్టు మాట్లాడుతూ, సబ్స్క్రైబర్ల నమ్మకాన్ని ఉపయోగించుకుని ఎదుటి వ్యక్తులను అవమానించే ధోరణి అన్వేష్‌లో కనిపించిందని పలు వీడియోల ద్వారా స్పష్టమైంది. ఈ క్రమంలోనే మొదటగా ఉమా తెలుగు ట్రావెలర్, రవి తెలుగు ట్రావెలర్, భయ్యా సన్నీ యాదవ్ లాంటి వారిని ఆయన టార్గెట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే.
వారి కుటుంబాల్లోని అమ్మానాన్నలు, భార్య, చెల్లెల్లు, తమ్ముళ్లు, అన్నలు, మరదళ్లు గురించి అసభ్యంగా మాట్లాడిన విషయాలు కూడా అందరికీ తెలిసినవే. వ్యక్తిగత విషయాలు ఇద్దరి మధ్య మాత్రమే ఉండాలి కానీ, అన్వేష్ సోషల్ మీడియాలో బూతులు ఉపయోగిస్తూ వారి కుటుంబాలను కించపరిచేలా మాట్లాడిన తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. అదేవిధంగా వారి కంటెంట్‌ను విమర్శించే పేరుతో తక్కువ చేసి మాట్లాడారని ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే ఇక్కడ అన్వేష్ ఒక విషయం గమనించారు. ఎదుటి వ్యక్తులపై మాట్లాడినప్పుడల్లా వ్యూస్ పెరుగుతున్నాయి, సబ్స్క్రిప్షన్లు కూడా వస్తున్నాయి. ఈ ఫార్ములానే తనకు పనిచేస్తోందని భావించి అదే దారిలో నేటికీ కొనసాగుతున్నారు.
యాక్టర్ శివాజీ అంశానికి సంబంధించిన వివాదంలో మాట్లాడడం ద్వారా అన్వేష్ భారీగా సబ్స్క్రైబర్లను కోల్పోయారు. నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చూపించే ఉదాహరణగా ఈ ఘటనను చెప్పుకోవచ్చు. భారతీయ సాంప్రదాయంలో ఎంతో గౌరవించబడే ద్రౌపది మాత, సీతమ్మ, శ్రీరాముడు వంటి దేవతలను కించపరిచేలా అన్వేష్ మాట్లాడారని విమర్శలు వచ్చాయి. వయసులో పెద్దవారు, ఆధ్యాత్మిక విషయాలు చెప్పే గరికపాటి నరసింహారావును కూడా వ్యంగ్యంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అయితే మనం గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే, వివాదాల వల్ల వ్యూస్ పెరుగుతున్నాయి, ఆర్థిక వనరు అన్వేష్‌కు లభిస్తోంది. దీనికి మనమే పుల్ స్టాప్ పెడితే ఇలాంటి వారికి అవకాశాలు తగ్గుతాయని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇదే నేపథ్యంలో యూట్యూబర్ యే జూడ్‌తో అన్వేష్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. తన గురించి, తన కుటుంబం గురించి అసభ్యంగా మాట్లాడుతున్నాడని యే జూడ్ తన వీడియోలో తెలిపారు. ఘాటుగా స్పందిస్తూ, అన్వేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఇటీవల పెట్టిన వీడియోను మరోసారి రీ-అప్‌లోడ్ చేశారు. ఈ వీడియోలో ఆయన మాటలు నేరుగా, స్పష్టంగా ఉండటంతో సోషల్ మీడియాలో విస్తృత స్పందన వచ్చింది.
తనపై వస్తున్న ఆరోపణలన్నింటినీ యే జూడ్ పూర్తిగా ఖండించారు. వ్యక్తిగతంగా తనను లక్ష్యంగా చేసుకుని అసత్య ప్రచారం జరుగుతోందని, ముఖ్యంగా తన కుటుంబాన్ని లాగుతూ మాట్లాడటాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. తన తండ్రి 32 సంవత్సరాల పాటు ప్రభుత్వ సేవలో ఉన్న ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అని, ఆ సుదీర్ఘ కాలంలో ఎలాంటి మచ్చ లేకుండా విధులు నిర్వహించారని గర్వంగా చెప్పారు.
బెట్టింగ్ యాప్‌ల ప్రచారం చేశారన్న ఆరోపణలపై కూడా ఆయన సవాల్ విసిరారు. తాను ఇప్పటివరకు ఏ బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేయలేదని, ఒక్క ఆధారం చూపినా బాధ్యత తీసుకుంటానని అన్నారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం చాలా ప్రమాదకరమని, సోషల్ మీడియాలో ఎవరి మీదైనా ముద్ర వేయడం చాలా సులభమైపోయిందని వ్యాఖ్యానించారు.
ఈ వివాదంలో అత్యంత సున్నితమైన అంశం దైవాలపై చేసిన వ్యాఖ్యలేనని యే జూడ్ స్పష్టం చేశారు. సీతమ్మ తల్లి, ద్రౌపది మాత, శ్రీరాముడు, ఆంజనేయ స్వామి వంటి దేవతల గురించి అవమానకరంగా మాట్లాడటం కోట్లాది మంది మనోభావాలను దెబ్బతీస్తుందని అన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని, చరిత్రను వక్రీకరించి మాట్లాడటం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నను లేవనెత్తారు. అదేవిధంగా బెదిరింపులు, బ్లాక్ మెయిల్ ప్రయత్నాలు జరిగినా తాను భయపడబోనని, ధర్మం కోసం నిలబడి పోరాడతానని స్పష్టం చేశారు.