మెక్సికోలో శుక్రవారం అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించి దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేగింది. రిక్టర్ స్కేలుపై 6.5 తీవ్రతతో నమోదైన ఈ భూ ప్రకంపనలు మెక్సికో సిటీతో పాటు శాన్ మార్కోస్, అకపుల్కో వంటి ప్రధాన నగరాలను వణికించాయి. భూకంపం ధాటికి భారీ భవనాలు ఊగిపోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఉన్నపళంగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసి వీధుల్లోకి చేరారు. పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోగా, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.
భూకంపం కారణంగా ఇప్పటి వరకు ఇద్దరు మృతి చెందగా, మరో 12 మంది గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. నివాస సముదాయాలు కూలిపోవడం, భవనాలకు పగుళ్లు రావడం వల్ల ఆస్తి నష్టం భారీగా ఉందని అంచనా వేస్తున్నారు. మొత్తం 50కిపైగా ఇళ్లకు, భవనాలకు పగుళ్లు ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా పాత భవనాలు, తక్కువ ఎత్తు నివాస గృహాలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. అకపుల్కో వంటి పర్యాటక ప్రాంతాల్లోనూ భూకంప ప్రభావం తీవ్రంగా కనిపించింది.
స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7:30 గంటల సమయంలో మెక్సికో సిటీని భూకంపం ఒక్కసారిగా వణికించింది. ఈ సమయంలో మెక్సికో ప్రెసిడెంట్ క్లాడియా షెయిన్‌బామ్ మీడియా సమావేశంలో పాల్గొంటుండగా భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ప్రెసిడెంట్‌ను సురక్షితంగా బయటకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భూకంప కేంద్రాన్ని శాన్ మార్కోస్ నగరానికి 14 కిలోమీటర్ల దూరంలో గుర్తించినట్లు మెక్సికో నేషనల్ సిస్మోలాజికల్ సర్వీస్ అధికారులు తెలిపారు.
భూకంపం అనంతరం మెక్సికో ప్రభుత్వం యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రావాలని హెచ్చరికలు జారీ చేశారు. మొబైల్ ఫోన్లకు భూకంప హెచ్చరిక అలర్ట్‌లు పంపి ప్రజలను జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. ప్రాణనష్టం మరింత పెరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రెసిడెంట్ క్లాడియా షెయిన్‌బామ్ వెల్లడించారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది.