ప్రధానమంత్రి ఉచిత స్కూటీ పథకం పేరుతో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రజలను అప్రమత్తం చేసింది. ఇటీవల కాలేజీ చదువుతున్న యువతులకు కేంద్రం పూర్తిగా ఉచితంగా స్కూటీలు అందిస్తోందన్న వాదనలు ఇంటింటా వ్యాప్తి చెందాయి. వాట్సాప్, ఫేస్‌బుక్, యూట్యూబ్ లాంటి వేదికల్లో అప్లికేషన్ లింకులు, ఆన్‌లైన్ ఫారాలు, రిజిస్ట్రేషన్ లింకులు విస్తృతంగా షేర్ అవుతుండటంతో చాలా మంది ఇది నిజమేనని భావించారు.
అయితే ఈ ప్రచారం అంతా ఒక లక్ష్యంతో చేసిన సైబర్ స్కామ్ మాత్రమేనని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పష్టంగా తేల్చింది.కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు విద్యార్థినుల కోసం ఉచిత స్కూటీల పంపిణీ పథకాన్ని ప్రకటించలేదని, ఇలాంటి పథకం పేరుతో సేకరించబడుతున్న వ్యక్తిగత వివరాలు ప్రజలకు ప్రమాదకరమని పీఐబీ హెచ్చరించింది.
ఈ లింకులు ప్రజలను నకిలీ వెబ్‌సైట్లకు మళ్లిస్తూ, అక్కడ వారికి ఆధార్ నంబర్, బ్యాంక్ వివరాలు, మొబైల్ ఓటీపీ వంటి అత్యంత రహస్య సమాచారాన్ని అడుగుతున్నారని అధికారులు అన్నారు. ఈ వివరాలు వెళ్లిన తర్వాత డబ్బులు లాగేయడం, ఖాతాలను హ్యాక్ చేయడం, కొత్త మోసాల్లో వివరాలను వినియోగించడం వంటి ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయని కేంద్రం సూచించింది.
రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ మోసాల నేపథ్యంలో, ప్రభుత్వ పేర్లు వాడుకుని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు అధికమవుతున్నాయి. నిజమైన పథకాలు, నకిలీ పథకాలను గుర్తించడం ప్రజలకు సవాలుగా మారింది. చదువుకున్న యువకులు, ఉద్యోగస్తులు, ఇంటి మహిళలు ఎవరూ ఈ మోసాల నుంచి పూర్తిగా బయట ఉండలేకపోతున్నారు. స్కూటీల పేరుతో ప్రస్తుతం జరుగుతున్న దుష్ప్రచారం కూడా అదే కోవకు చెందుతుందని పీఐబీ ఉదాహరణగా చూపింది.
ఈ తరహా సందేశాలు వచ్చినప్పుడు వాటిపై క్లిక్ చేయకపోవడం, తెలియని ఫారాల్లో సమాచారాన్ని నమోదు చేయకపోవడం, సంబంధిత మంత్రిత్వ శాఖల అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే చెక్ చేయడం చాలా అవసరమని కేంద్రం స్పష్టం చేసింది. ఏదైనా సందేహాస్పద లింక్ కనిపించినప్పుడు వెంటనే పీఐబీ ఫ్యాక్ట్ చెక్ వాట్సాప్ నంబర్ 8799711259కి పంపి నిజానిజాలు తెలుసుకోవచ్చని సంస్థ తెలిపింది. ఎక్స్ ప్లాట్‌ఫారం (ట్విట్టర్)లో @PIBFactCheck హాండిల్ ద్వారా కూడా సమాచారం పంపించవచ్చని సూచించింది.
సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్తను నమ్మి వ్యక్తిగత వివరాలను ఇవ్వడం ఎంత ప్రమాదకరమో ఇటీవలి ఘటనలు నిరూపించాయి. ప్రజల నమ్మకాన్ని ఆయుధంగా మార్చుకుని సైబర్ నేరగాళ్లు నిత్యం కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. అందుకే ప్రభుత్వ పథకాల పేరుతో వచ్చే ప్రచారాలను రెండు సార్లు జాగ్రత్తగా పరిశీలించడం అవసరమైతే అధికారులను సంప్రదించడం మాత్రమే భద్రమైన మార్గంగా ఉందని అధికారులు చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి ఉచిత స్కూటీ పథకం అంటూ ప్రస్తుతం ప్రచారంలోనున్న సమాచారమంతా పూర్తిగా తప్పుడు అని ఇలాంటి ఏ పథకం ప్రభుత్వానికి లేదని మరోసారి ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజల ఆర్థిక భద్రత కోసం సైబర్ మోసాల నుండి రక్షణ కోసం ఈ ప్రకటన ఎంతో కీలకమైంది.