రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలలో బోధన ప్రమాణాలను మెరుగుపరచే దిశగా చేపట్టిన చర్యల్లో భాగంగా ఇకపై ఉపాధ్యాయులకు బోధనేతర బాధ్యతలు ఇవ్వబోమని విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టంచేశారు. విద్యా నాణ్యతను పెంచేందుకు ఉపాధ్యాయులు పూర్తిగా లెర్నింగ్ అవుట్ కమ్స్‌పై దృష్టి సారించాలని ఆయన సూచించారు. అమరావతిలోని ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేష్‌ను ఎపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు చెన్నుపాటి మంజుల, మాజీ ప్రధాన కార్యదర్శి పాండురంగ వరప్రసాద్ కలిసి పలు సమస్యలను వివరించారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులపై ఉన్న అదనపు భారం గత కొన్ని సంవత్సరాలుగా ఎదురవుతున్న నిర్మాణాత్మక లోపాలు సర్వీసు రూల్స్ సమస్యలు అన్నీ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ గత 17 నెలల్లో ఫ్యాప్టో ద్వారా మొత్తం 423 ఉపాధ్యాయ సమస్యలు తనకు చేరాయని వాటిలో 200 సమస్యలను ఇప్పటికే పరిష్కరించినట్లు వెల్లడించారు. 81 సమస్యలు పరిష్కరించడం సాధ్యం కాదని, 72 విజ్ఞాపనలు పాలసీ మేటర్ల కిందకే వస్తాయని మరో 71 సమస్యలు కోర్టుల పరిధిలో ఉన్నందున వాటిపై ప్రభుత్వం జోక్యం చేసుకోవడం కష్టం అని వివరించారు.
ఉపాధ్యాయులపై ఉన్న అధిక ఒత్తిడిని తగ్గించడానికి ఈ విద్యాసంవత్సరంలో మెగా పిటిఎం మినహా మరే ఇతర విద్యేతర పనులు ఇవ్వబోమని మరోసారి స్పష్టంచేశారు. డీఈఓలు, ఎంఇఓలు కూడా కేవలం లెర్నింగ్ అవుట్ కమ్స్‌పై మాత్రమే దృష్టి పెట్టాలని, వారికి సర్వీసు రూల్స్‌కు సంబంధించిన అదనపు బాధ్యతలు ఇవ్వకుండా ఉండాలని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా కడప మోడల్ స్మార్ట్ కిచెన్లను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని కూడా తెలిపారు.
ఈ సమావేశంలో ఎపిటిఎఫ్ నాయకులు పలు ముఖ్యమైన సమస్యలను ముందుకు తెచ్చారు. 2011కి ముందు ఉద్యోగంలో చేరిన ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఇన్ సర్వీసు ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్ నిర్వహించి, కటాఫ్ మార్కులను 45 శాతానికి తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. పాత పెన్షన్ విధానాన్ని 2003కి ముందు ఉద్యోగంలో చేరిన ఉపాధ్యాయులకు అమలుచేయాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మెమో 57ను అమలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగుమీడియాన్ని సమాంతర మాధ్యమంగా కొనసాగించాలని సూచించారు. ప్రతి మండలంలో కనీసం ఒక తెలుగుమీడియం పాఠశాల ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం అమల్లో ఉన్న 9 రకాల పాఠశాలల విధానాన్ని పునఃసమీక్షించి, 1 నుంచి 5 తరగతులను ఉన్నత పాఠశాలలనుంచి విడదీయాలని, ఉమ్మడి సర్వీసు రూల్స్ సమస్యను పరిష్కరించాలని కూడా వారు కోరారు.
స్కూల్ అసిస్టెంట్లను ఎంఇఓలుగా నియమించే విధానాన్ని వెంటనే నిలిపివేయాలని, ఎంఇఓలుగా ప్రధానోపాధ్యాయులను మాత్రమే నియమించాలని సూచించారు. క్లస్టర్లలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులను విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న పాఠశాలల్లో నియమించాలని ఐటిడిఎలలో పండిట్ పోస్టులను అప్‌గ్రేడ్ చేయాలని కేజీబీవీల్లో ఉపాధ్యాయులకు టైమ్ స్కేల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు సర్వీసు రూల్స్ రూపొందించి ప్రభుత్వ మరియు జిల్లాపరిషత్ ఉపాధ్యాయుల సమానంగా విధివిధానాలు అమలు చేయాలని కోరారు.
పరీక్షల సమయం దగ్గరపడుతున్నందున 2025 బదిలీల్లో ఖాళీ అయ్యే సబ్జెక్ట్ టీచర్ పోస్టుల స్థానంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రతి మూడు నెలలకు ఒకసారి ఉపాధ్యాయ సంఘాలతో మీటింగులు నిర్వహించాలని వారికి విజ్ఞప్తి చేశారు. అసెస్‌మెంట్ పుస్తకాల మార్కులను అప్‌లోడ్ చేయడం భారంగా మారిందని, దీనిపై పునఃసమీక్ష అవసరమని ఎపిటిఎఫ్ ప్రతినిధులు పేర్కొన్నారు. యాప్‌ల అప్‌లోడింగ్ భారాన్ని తగ్గించాలని, ప్లస్–2 పాఠశాలల్లో జూనియర్ లెక్చరర్, పీఈటీ పోస్టులను భర్తీ చేయాలని వారు కోరారు. 78 ఏళ్ల చరిత్ర ఉన్న ఎపిటిఎఫ్‌కు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో సభ్యత్వం ఇవ్వాలని కూడా కోరారు.
ఉపాధ్యాయ సంఘాలు చేసిన ప్రతీ విజ్ఞప్తిపైనా సాధ్యాసాధ్యాలను పరిశీలించి, త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు ఉపాధ్యాయులతో కలిసి పని చేస్తామని ఆయన స్పష్టం చేశారు