ఆంధ్రప్రదేశ్‌లో స్క్రబ్ టైఫస్ కేసులు వేగంగా పెరుగుతూ టెన్షన్ పెంచుతున్నాయి. మొదట విజయనగరంలో ప్రారంభమైన ఈ వ్యాధి ఇప్పుడు రాష్ట్రంలోని పలు జిల్లాలకు విస్తరించింది. చిత్తూరు, కాకినాడ, విశాఖపట్నం, విజయనగరంలో ఇప్పటికే అనేక కేసులు బయటపడగా, గత రెండు నెలల్లో విశాఖలోనే 43 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులు కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో కనిపించడం ప్రజలు, ఆరోగ్యశాఖను మరింత అప్రమత్తం చేసింది.
పల్నాడు జిల్లాలో ఇంటర్ విద్యార్థిని జ్యోతి ఇటీవల ప్రాణాలు కోల్పోగా, గుంటూరు GGHలో చికిత్స పొందుతున్న ధనమ్మ అనే వృద్ధ మహిళ స్క్రబ్ టైఫస్‌తో మృతిచెందింది. విజయనగరంలో కూడా మరో మహిళ మరణించడం పరిస్థితిని మరింత ఆందోళనకరంగా మార్చింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఒకేసారి మరణాలు నమోదవుతుండటంతో వైద్య విభాగం అత్యవసర చర్యలు చేపడుతోంది.
కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు మండలంలో ఇద్దరు మహిళలకు స్క్రబ్ టైఫస్ పాజిటివ్ తేలింది. గుడ్లవల్లేరు, పామర్రు ప్రాంతాల్లో జ్వరంతో బాధపడుతున్న ఇద్దరి నమూనాలను పరీక్షించగా వ్యాధి నిర్ధారించారు. ఇదే సమయంలో ఏలూరు మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో కూడా ఇద్దరికి పాజిటివ్ రావడంతో ఆ జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య నాలుగుకి చేరింది. కేసులు పెరుగుతుండటంతో డాక్టర్లు ప్రజలకు జాగ్రత్తలు తప్పనిసరి అని హెచ్చరిస్తున్నారు.
స్క్రబ్ టైఫస్ నల్లిని పోలిన చిన్న కీటకం కుట్టడం ద్వారా వస్తుంది. కుట్టిన చోట దద్దుర్లు, నల్లటి మచ్చ, జ్వరం, వాంతులు, తలనొప్పి, ఒంటినొప్పులు, పొడి దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు చోటుచేసుకుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆరోగ్యశాఖ సూచిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తోంది.
ప్రస్తుతం ఫీవర్ సీజన్ కావడంతో ప్రజలు అతి భయపడాల్సిన అవసరం లేకపోయినా, అజాగ్రత్త మాత్రం ప్రమాదకరం అని వైద్యులు చెబుతున్నారు. కీటకాలు పెరిగే ఈ కాలంలో పిల్లలు, వృద్ధులు మరింత జాగ్రత్తలు పాటించాలని, పర్యావరణ పరిశుభ్రత, దోమల నివారణ చర్యలు తప్పనిసరిగా చేపట్టాలని సూచించారు. కేసులు పెరుగుతున్న దృష్ట్యా, ఆరోగ్యశాఖ నిరంతరంగా పరిస్థితిని పర్యవేక్షిస్తోంది.