ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. ఈ రోజు కూడా వందకు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఈ నేపథ్యంలోనే ఇండిగో సంస్థ ప్రయాణీకులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఓ కీలక ప్రకటన చేసింది. సాయంత్రం లోపు 1,500 విమానాలు నడుపుతామని ప్రకటించింది.
95 శాతం నెట్‌వర్క్ కనెక్టివిటీని పునరుద్ధరించామని చెప్పింది. 135 ఎయిర్‌పోర్టుల్లో తమ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని వెల్లడించింది. ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణీకులకు మళ్లీ క్షమాపణలు చెప్పింది.
ప్రయాణీకుల విశ్వాసాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు రావాల్సిన 70 ఇండిగో విమానాలు రద్దయ్యాయి.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన మరో 74 ఇండిగో విమానాలను ఎయిర్ లైన్స్ అధికారులు రద్దు చేశారు. మొత్తం 144 విమానాలను రద్దు చేసినట్టు ఎయిర్ లైన్స్ అధికారులు ప్రకటించారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టు ఇండిగో కౌంటర్ వద్ద ప్రయాణీకుల పడిగాపులు ఇంకా కొనసాగుతున్నాయి. టికెట్ క్యాన్సిల్ అయిన ప్రయాణీకులకు ఇండిగో ఎయిర్ లైన్స్ అమౌంట్ రిఫండ్ చేస్తోంది.
మరి కొంతమంది ప్రయాణీకులను ఇతర విమానాల్లో సర్దుబాటు చేస్తోంది. కాగా, ఇండిగో సంక్షోభం దృష్ట్యా ప్రయాణీకులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
స్పైస్ జెట్ 100 అదనపు విమానాలు నడుపుతోంది. ముంబై, ఢిల్లీ, పూణె, హైదరాబాద్‌కు ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. చెన్నై, బెంగళూరుతో పాటు విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, విశాఖకు ప్రత్యేక బస్సులు నడుస్తున్నాయి.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఇండిగో ప్రయాణీకులకు ఊరట నివ్వటం లేదు. విమాన సర్వీసులు రద్దవటం కారణంగా నష్టోయిన వారు తీవ్ర ఆగ్రహావేశాలకు గురవుతున్నారు.