కొత్త సంవత్సరం 2026ను స్వాగతించేందుకు ఆసక్తి, ఆశలు కూడా పెరుగుతున్నాయి. ఉద్యోగ మార్కెట్ మార్పులు, టెక్నాలజీ ప్రభావం, ఏఐ వృద్ధి, గ్లోబల్ ఆర్థిక పరిణామాలు వంటి అంశాలు ఈసారి కెరీర్ అవకాశాలపై స్పష్టమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. గత రెండు సంవత్సరాలుగా లేఆఫ్స్, రీ స్ట్రక్చర్, ప్రాజెక్టుల నిలిపివేత వంటి అంశాలు టెక్ ఉద్యోగులను కాస్త ఆందోళనకు గురి చేసినా, 2026లో కొన్ని రంగాల్లో విస్తృత ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందని నిపుణుల అంచనాలు చెబుతున్నాయి.
మొదటిగా అత్యధిక డిమాండ్ పెరుగుతున్న విభాగం UX డిజైన్. స్టార్టప్ కంపెనీల నుండి అంతర్జాతీయ టెక్ దిగ్గజాల వరకు ప్రతి సంస్థకు నైపుణ్యం కలిగిన UX డిజైనర్లు అవసరం అవుతున్నారు. ఆన్‌లైన్ షాపింగ్, మొబైల్ బ్యాంకింగ్, డిజిటల్ పేమెంట్స్, ఏఐ ఆధారిత యాప్‌లు, స్మార్ట్ పరికరాలు వంటి వాటి వాడకం పెరుగుతున్న కొద్దీ వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడంలో UX డిజైన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ రంగంలో కొత్తగా చేరే వారికి వార్షిక వేతనాలు 6 లక్షల నుంచి 12 లక్షల వరకూ లభించవచ్చు.
రెండవ స్థానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ రంగాలు కొనసాగుతాయి. బ్యాంకింగ్, వైద్య రంగం, రిటైల్, డిజైన్, గేమింగ్, రోబోటిక్స్ వంటి అనేక రంగాల్లో ఏఐ వినియోగం పెరుగుతుండటంతో మంచి అవకాశాలు ఉన్నాయి. ప్రారంభ వేతనాలు 8 లక్షల నుంచి 20 లక్షల వరకూ ఉండవచ్చు. ఈ ఉద్యోగాలు దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా భారీగా లభిస్తున్నాయి.
అదేవిధంగా డేటా సైన్స్, డేటా అనలిస్ట్ ఉద్యోగాలు కూడా అత్యధిక డిమాండ్ గల రంగాలు. వ్యాపార నిర్ణయాలు తీసుకోవడంలో డేటా కీలకంగా మారినందున ప్రతి కంపెనీకి నిపుణుల అవసరం ఉంటుంది. ఈ రంగంలో ప్రారంభ జీతాలు ఏడాదికి 6 లక్షల నుంచి 15 లక్షల వరకూ లభించే అవకాశాలు ఉన్నాయి.
డిజిటల్ మార్కెటింగ్, కంటెంట్ ప్లానింగ్ కూడా 2026లో మంచి వృద్ధి సాధించే రంగాలుగా భావిస్తున్నారు. ఆన్‌లైన్ వ్యాపారం పెరుగుతున్న నేపథ్యంలో డిజిటల్ మార్కెటింగ్ రంగం అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఈ రంగంలో ప్రవేశించే వారికి 4 నుంచి 12 లక్షల వరకూ వార్షిక వేతనాలు ఉండవచ్చు. ప్రొడక్ట్ డిజైన్ కూడా ఈ ఏడాది మంచి అవకాశాలతో ముందుకు రావచ్చు.
మోషన్ గ్రాఫిక్స్, యానిమేషన్, గేమింగ్ రంగాలు కూడా యువతకు మంచి అవకాశాలు అందిస్తున్నాయి. ఓటిటి కంటెంట్, సోషల్ మీడియా, వీడియో ప్రకటనల మార్కెట్ వేగంగా పెరుగుతుండటంతో ఈ రంగాల్లో 5 నుంచి 15 లక్షల వరకూ ప్రారంభ వేతనాలు పొందవచ్చు.
ఇవన్నీ కాకుండా సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్, మేనేజ్‌మెంట్ రంగాలు, రోబోటిక్స్, ఆటోమేషన్ వంటి విభాగాలు కూడా 2026లో మంచి కెరీర్ అవకాశాలు అందించే అవకాశం ఉంది. కొత్త సంవత్సరం కెరీర్‌ను ప్లాన్ చేసుకునే యువతకు ఇవి ఆసక్తికర మార్గదర్శకాలుగా భావించవచ్చు.