ఊహకి అందని ఉలవ పులుసు/కట్టు! శీతాకాలం లో మెత్తటి అన్నం, సంకటి ఇడ్లీలతో తింటే.. అడ్డె..డే.. ఏమి మధురం!
Ulava Pulusu Recipe: ఉలవలు (Horsegram) 'ఉష్ణ వీర్యం' కలిగి ఉండటం వల్ల చలికాలంలో కఫం, జలుబు వంటి సమస్యలను నివారించి శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచుతాయి. వీటిలో అధికంగా ఉండే పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లు, ఐరన్ మరియు డైటరీ ఫైబర్ రక్తంలో చక్కెర నియంత్రణకు, బరువు తగ్గడానికి మరియు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధించడానికి సహాయపడతాయి; చింతపండు, బెల్లం, మెంతుల కలయిక జీర్ణక్రియను మరింత మెరుగుపరుస్తుంది.
- ఘుమఘుమలాడే సంప్రదాయ 'ఉలవ పులుసు' తయారీ విధానం!
- 8 గంటలు నానబెట్టిన ఉలవలతో చిక్కని, రుచికరమైన ఉలవ కట్టు రెసిపీ!
- దాల్చినచెక్క, లవంగాలు, మెంతులు, పులుసు పొడితో అద్భుతమైన సువాసన!
Recepies: సంప్రదాయ తెలుగు వంటకాల్లో ఉలవ పులుసు (ఉలవ కట్టు) అత్యంత పోషక విలువలు కలిగిన ఆహారం. దీని తయారీ కోసం ముందుగా ఉలవలను తీసుకుని మూడుసార్లు శుభ్రంగా కడిగి, సుమారు 8 గంటల పాటు నీటిలో నానబెట్టాలి. నానిన ఉలవలను మళ్లీ మంచి నీటితో కడిగి, తగినన్ని నీళ్లు పోసి ప్రెషర్ కుక్కర్లో 6 నుంచి 8 విజిల్స్ వచ్చేవరకు మెత్తగా ఉడికించాలి. ఉడికిన తర్వాత ఆ ఉలవ కట్టు నీటిని పారబోయకుండా జాగ్రత్తగా వడకట్టి పక్కన పెట్టుకోవాలి.
ఉలవలు & టమాటా ముద్దను రుబ్బుకునే పద్ధతి
ఉడికించిన ఉలవలు పూర్తిగా చల్లారిన తర్వాత, వాటిని మిక్సీ జార్లో వేసి కొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తని పేస్ట్‌లా రుబ్బుకోవాలి (ఇష్టమైతే ఇందులో కొన్ని పచ్చి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి రుబ్బుకోవచ్చు). మరోవైపు నాలుగు టమాటాలను ముక్కలుగా కోసి, అందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి నీళ్లు పోయకుండా మెత్తగా గ్రైండ్ చేసి సిద్ధంగా ఉంచుకోవాలి.
సువాసన వెదజల్లే మసాలా తాలింపు
స్టవ్ మీద గిన్నె పెట్టి నూనె వేడయ్యాక ఒక చెంచా ఆవాలు, అర చెంచా మెంతులు వేయాలి. పులుసుకు అద్భుతమైన సువాసన రావడానికి కొద్దిగా దాల్చినచెక్క, నాలుగు లవంగ మొగ్గలు, ఒక చెంచా జీలకర్ర, ఎండుమిరపకాయ ముక్కలు వేసి వేయించాలి. ఆ తర్వాత కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు వేసి సగం వరకు మగ్గనివ్వాలి (ఉల్లి, వెల్లుల్లి ఇష్టం లేనివారు వీటిని వదిలేయవచ్చు).
టమాటా పేస్ట్, పులుసు పొడి & చింతపండు రసం కలయిక
ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత, ముందుగా రుబ్బి పెట్టుకున్న టమాటా ముద్దను వేసి పచ్చివాసన పోయేవరకు ఉడికించాలి. అనంతరం రుబ్బిన ఉలవల పేస్ట్, ఉలవలు ఉడికించిన నీరు, రుచికి సరిపడా ఉప్పు, పసుపు మరియు కొద్దిగా బెల్లం వేయాలి. ఇందులో ప్రత్యేకంగా తయారుచేసిన 'పులుసు పొడి'ని (గతంలో ప్రచురించిన పులుసు పొడి తయారు చేసుకునే విధానం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి పులుసు పొడి ) కొద్దిగా నీటిలో ఉండలు లేకుండా కలిపి పోయాలి (ఈ పొడిలోనే ఎండుమిర్చి ఉండటం వల్ల విడిగా కారం వేయాల్సిన అవసరం లేదు). చివరగా పలుచని చింతపండు రసం పోసి రుచి చూసి ఉప్పు, పులుపు సరిచేసుకోవాలి.
పులుసు మరిగించడం & వడ్డించే విధానం
చివరిగా కొన్ని పచ్చిమిర్చి, చేతితో నలిపిన కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి పులుసును సలసలా బాగా మరిగించాలి; ఈ పులుసు ఎంత ఎక్కువ సేపు మరిగితే అంత అద్భుతమైన రుచి, సువాసన వస్తాయి. వేడివేడి మెత్తని అన్నంలోకి ఈ ఉలవ పులుసు వేసుకుని తింటే ఎంతో మధురంగా ఉంటుంది. అంతేకాకుండా రాగి సంగటి, ఇడ్లీ, దోశ, ఉప్పుడు పిండిలోకి కూడా ఇది అద్భుతంగా ఉంటుంది; వండుకున్న రోజు కంటే మరుసటి రోజుకు దీని రుచి రెట్టింపు అవుతుంది.
Tags
Be the first to react