ఉత్తరాది కాలుష్యానికి భయపడి దక్షిణాదికి.. తక్కువ జీతమైనా "సై" అంటున్న ప్రొఫెసర్లు!
Pollution Crisis in North India: ఉత్తర భారతదేశంలో రోజురోజుకూ పెరుగుతున్న వాయు కాలుష్యం ప్రజల జీవనశైలిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ఢిల్లీ సహా ఉత్తరాది నగరాల్లో గాలి నాణ్యత ఆందోళనకరంగా మారుతున్న నేపథ్యంలో కొందరు ఉద్యోగులు, విద్యావేత్తలు తమ కుటుంబాల భవిష్యత్తుపై ఆలోచనలో పడుతున్నారు. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఉత్తర భారతంలోని విశ్వవిద్యాలయాల నుంచి దక్షిణ భారత విద్యాసంస్థలకు మారేందుకు కొందరు ప్రొఫెసర్లు సిద్ధమవుతున్నారనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. దక్షిణాది విశ్వవిద్యాలయాల్లో జీతాలు తక్కువగా ఉన్నప్పటికీ, మెరుగైన వాతావరణం కోసం అక్కడికి వెళ్లేందుకు కొందరు ఆసక్తి చూపుతున్నారని మాజీ ప్రొఫెసర్ సజ్జన్ సింగ్వి చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.
ఉత్తర భారతంలో కాలుష్యం ఎఫెక్ట్.. పిల్లల ఆరోగ్యం కోసం దక్షిణాదికి వలస వెళ్తున్న ప్రొఫెసర్లు..
ఉత్తర భారతంలో కాలుష్య భయం.. ఉద్యోగాలు వదిలి దక్షిణాదికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న విద్యావేత్తలు..
ఉత్తర భారతదేశంలో రోజురోజుకూ పెరుగుతున్న వాయు కాలుష్యం ప్రజల జీవనశైలిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ఢిల్లీ సహా ఉత్తరాది నగరాల్లో గాలి నాణ్యత ఆందోళనకరంగా మారుతున్న నేపథ్యంలో కొందరు ఉద్యోగులు, విద్యావేత్తలు తమ కుటుంబాల భవిష్యత్తుపై ఆలోచనలో పడుతున్నారు. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఉత్తర భారతంలోని విశ్వవిద్యాలయాల నుంచి దక్షిణ భారత విద్యాసంస్థలకు మారేందుకు కొందరు ప్రొఫెసర్లు సిద్ధమవుతున్నారనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. దక్షిణాది విశ్వవిద్యాలయాల్లో జీతాలు తక్కువగా ఉన్నప్పటికీ, మెరుగైన వాతావరణం కోసం అక్కడికి వెళ్లేందుకు కొందరు ఆసక్తి చూపుతున్నారని మాజీ ప్రొఫెసర్ సజ్జన్ సింగ్వి చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.
సజ్జన్ సింగ్వి ఇటీవల లింక్డ్ఇన్లో చేసిన ఓ పోస్టులో ఉత్తర భారతంలో మారుతున్న వలస ధోరణుల గురించి ప్రస్తావించారు. ముఖ్యంగా పిల్లలు ఉన్న విద్యావేత్తలు తమ కుటుంబాలను పెరుగుతున్న వాయు కాలుష్యం నుంచి కాపాడుకోవడానికి దక్షిణ భారతదేశంలోని విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఉత్తరాది విశ్వవిద్యాలయాలతో పోలిస్తే దక్షిణాదిలో కొన్ని సంస్థలు తక్కువ వేతనాలు అందిస్తున్నప్పటికీ, కుటుంబ ఆరోగ్యం, పిల్లల భవిష్యత్తు ముఖ్యమని భావించి ఉద్యోగ మార్పునకు సిద్ధమవుతున్నారని వివరించారు. ఈ పరిణామం భవిష్యత్తులో దేశంలో ఉద్యోగ వలసలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.
మరోవైపు, ఉత్తర భారతంలో వృద్ధులు అనుసరిస్తున్న కాలానుగుణ వలస విధానాన్ని కూడా సింగ్వి ప్రస్తావించారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు ప్రతి ఏడాది దీపావళి సమయంలో ఉత్తరాది ప్రాంతాలను విడిచిపెట్టి, అక్కడి చలి తీవ్రత తగ్గిన తర్వాత హోలీ పండుగకు తిరిగి వస్తుంటారని తెలిపారు. చలికాలంలో తీవ్రమైన వాతావరణ పరిస్థితులతో పాటు వాయు కాలుష్యం కూడా ఎక్కువగా ఉండటంతో వారు ఈ విధంగా ప్రయాణాలు చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారుతున్నాయని, కాలుష్యం కేవలం శీతాకాలానికే పరిమితం కావడం లేదని అభిప్రాయపడ్డారు. గాలి కాలుష్యంతో పాటు శబ్ద కాలుష్యం కూడా పెరుగుతున్న నేపథ్యంలో కొందరు వృద్ధులు తాత్కాలికంగా వెళ్లడం కాకుండా శాశ్వతంగా ఉత్తర భారతాన్ని విడిచి వెళ్లాల్సిన పరిస్థితి రావచ్చని ఆయన వ్యాఖ్యానించారు.
ఉత్తరాది నగరాల్లో పెరుగుతున్న జనసాంద్రత, వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యంపై కూడా సింగ్వి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు కార్పొరేట్ సంస్థలు తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కార్యక్రమాల ద్వారా ముందుకు రావాలని సూచించారు. ముఖ్యంగా ఉత్తర భారతంలోని ప్రధాన నగరాల్లో అధిక జనసాంద్రతను తగ్గించడం, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటం వంటి అంశాలపై సంస్థలు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఈ పోస్టుపై లింక్డ్ఇన్లో పలువురు నెటిజన్లు స్పందించారు. కొందరు సింగ్వి అభిప్రాయాలతో ఏకీభవిస్తూ, కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లడం సహజమైన నిర్ణయమేనని పేర్కొన్నారు. అయితే ఉత్తర భారతం నుంచి దక్షిణాదికి వెళ్లడం వ్యక్తిగతంగా కొందరికి ఉపశమనం కలిగించవచ్చని, కానీ కాలుష్య సమస్యకు అది శాశ్వత పరిష్కారం కాదని అభిప్రాయపడ్డారు. ప్రతి ఏడాది ఇదే పరిస్థితి ఎదురవుతున్నప్పుడు ప్రజలు ప్రాంతాలు మారడం కంటే కాలుష్యాన్ని నియంత్రించే చర్యలు చేపట్టడమే ముఖ్యమని సూచించారు.
మరో నెటిజన్ మాత్రం ఈ సమస్యకు సమీప భవిష్యత్తులో పరిష్కారం లభిస్తుందనే నమ్మకం లేదని వ్యాఖ్యానించారు. రాజకీయ నాయకుల్లో శాస్త్రీయ ఆలోచన, దీర్ఘకాలిక ప్రణాళికల లోపమే ఇటువంటి పరిస్థితులకు కారణమని అభిప్రాయపడ్డారు. ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వకుండా రాజకీయ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తే, పెరుగుతున్న కాలుష్యం వల్ల సామాన్య ప్రజలే మరింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
నిజానికి కాలుష్యం అనేది కేవలం పర్యావరణ సమస్య మాత్రమే కాదు. అది ప్రజల ఆరోగ్యం, ఉద్యోగాలు, కుటుంబ జీవితం, నివాస ప్రాంతాల ఎంపిక వంటి అనేక అంశాలను ప్రభావితం చేస్తోంది. పిల్లల భవిష్యత్తు కోసం ఉద్యోగాలను, వృద్ధులు ఆరోగ్యం కోసం నివాస ప్రాంతాలను మార్చుకోవాల్సి వస్తుందనే చర్చ రావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. అయితే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లడం వ్యక్తిగత సమస్యకు పరిష్కారం కావచ్చేమో కానీ, దేశవ్యాప్తంగా పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, కార్పొరేట్ సంస్థలు సమన్వయంతో దీర్ఘకాలిక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Tags
Be the first to react