తిరుపతిలో SSD టోకెన్లు రద్దు! ఎప్పటివరకంటే?
Tirumala Updates: తిరుమల శ్రీవారి భక్తులకు ఇచ్చే సర్వదర్శనం (SSD) టోకెన్ల జారీని బుధవారం నాడు టీటీడీ తాత్కాలికంగా రద్దు చేసింది. మంగళవారం టోకెన్లు పొందిన 12 వేల మంది భక్తులకు నేటి ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తున్నారు. గురువారం నుంచి శుక్రవారం దర్శనాల కోసం యథావిధిగా టోకెన్లు పంపిణీ చేస్తారు. వర్షాల ప్రభావంతో రద్దీ సాధారణంగా ఉందని, మూడున్నర గంటల్లోనే దర్శనం పూర్తవుతోందని అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు.
మంగళవారం సాయంత్రం 10 వేల మందికి ఎస్ఎస్డీ, 2 వేల మందికి దివ్యదర్శనం టోకెన్లు అందజేత!
టోకెన్లు పొందిన భక్తులను బుధవారం ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనానికి అనుమతి!
తుపాను వర్షాలు, స్థానిక ఎన్నికల ప్రభావంతో తిరుమలలో సాధారణంగా కొనసాగుతున్న భక్తుల రద్దీ!
Devotional: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనార్థం తిరుపతికి వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక సమాచారం అందించింది. తిరుపతి నగరంలోని శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ కేంద్రాల వద్ద గురువారం దర్శనం నిమిత్తం నేడు (బుధవారం) జారీ చేయాల్సిన ఉచిత సర్వదర్శనం (SSD) టోకెన్ల పంపిణీని అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. తిరుమలలో ప్రస్తుతం కొనసాగుతున్న దర్శనాల పరిస్థితులు, వర్షాల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.
మంగళవారం టోకెన్లు తీసుకున్న వారికే నేడు దర్శనం
మంగళవారం సాయంత్రం వేళ శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్‌లలో దాదాపు 10 వేల మందికి ఎస్ఎస్డీ టోకెన్లు జారీ చేశారు. అలాగే శ్రీవారి మెట్టు మార్గంలో నడిచివచ్చిన మరో 2 వేల మంది కాలినడక భక్తులకు దివ్యదర్శనం టోకెన్లు అందజేశారు. ఈ 12 వేల మంది భక్తులను నేడు (బుధవారం) ఉదయం 11:00 గంటల నుంచి రాత్రి 10:00 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తున్నారు. కొత్తగా నేడు ఎలాంటి టోకెన్లు జారీ చేయబోమని, టోకెన్లు లేని సాధారణ భక్తులు నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా సర్వదర్శనానికి వెళ్లవచ్చని స్పష్టం చేశారు.
గురువారం నుంచి యథావిధిగా టోకెన్లు
బుధవారం రద్దు చేసిన సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రక్రియను గురువారం ఉదయం నుంచి తిరిగి పునరుద్ధరించనున్నారు. శుక్రవారం నాడు శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు గురువారం వేకువజాము నుంచే తిరుపతిలోని కౌంటర్లలో ఎస్ఎస్డీ టోకెన్లు అందుబాటులో ఉంచుతారు. రాష్ట్రంలో కురుస్తున్న తుపాను వర్షాలు, స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా కొద్ది రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంటోంది. గతంలో గంటల వ్యవధిలోనే ఖాళీ అయ్యే టోకెన్లు, ప్రస్తుతం అర్ధరాత్రి వరకు సులభంగా లభిస్తున్నాయి.
మూడున్నర గంటల్లోనే శీఘ్ర దర్శనం
రద్దీ సాధారణ స్థాయిలో ఉండటం వల్ల సాధారణ భక్తులకు అత్యంత త్వరగా శ్రీవారి దర్శనం లభిస్తోంది. వైకుంఠం కంపార్ట్మెంట్లలో ప్రవేశించిన భక్తులు కేవలం మూడు నుంచి మూడున్నర గంటల వ్యవధిలోనే స్వామివారిని దర్శించుకుని బయటకు వస్తున్నారు. వర్షాల ప్రభావం దృష్ట్యా భక్తులు క్యూలైన్లలో ఎక్కువసేపు వేచి ఉండకుండా వేగంగా పంపించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.
అదనపు ఈవో ఉన్నత స్థాయి సమీక్ష – ప్రత్యేక జాగ్రత్తలు
రాష్ట్రంలో కొనసాగుతున్న వర్షాల నేపథ్యంలో తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి అధికారులతో సమీక్ష నిర్వహించారు. వర్షం కారణంగా క్యూలైన్లు షెడ్ల వెలుపలికి రాకుండా చూడాలని, కంపార్ట్మెంట్లు, క్యూలైన్లలో భక్తులు తడవకుండా టార్పాలిన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నిరంతరాయంగా వేడి అన్నప్రసాదాలు, పాలు పంపిణీ చేయాలని సూచించారు. వర్షపు నీటితో ఘాట్ రోడ్లలో జారే ప్రమాదం ఉన్నందున రెస్క్యూ టీమ్‌లు, అంబులెన్స్‌లు అప్రమత్తంగా ఉండాలని ఇంజనీరింగ్, విజిలెన్స్ విభాగాలను ఆదేశించారు.
Be the first to react
