నవంబర్ 1 నుంచి అయోధ్య దర్శన వేళలు మార్పు!
Ayodhya Ram Temple: అయోధ్య శ్రీరామ జన్మభూమి మందిరంలో శీతాకాలం దృష్ట్యా నవంబర్ 1 నుంచి దర్శనం, ఆరతుల సమయాల్లో మార్పులు చేసినట్లు రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. నూతన నిబంధనల ప్రకారం ఆలయ ద్వారాలు ఉదయం 4 గంటలకు తెరిచి, రాత్రి 10 గంటలకే మూసివేస్తారు. ఉదయం 4:30 గంటలకు మంగళ హారతి, 6:30 గంటలకు శృంగార హారతి, రాత్రి 9:30 గంటలకు శయన హారతి నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12:30 నుంచి 1:30 వరకు గంట పాటు ఆలయాన్ని మూసివేసి రామ్‌లల్లాకు విశ్రాంతి కల్పిస్తారు. భక్తులు ఈ మార్పులను గమనించి తమ ప్రయాణాన్ని సిద్ధం చేసుకోవాలని ట్రస్ట్ కోరింది.
రాత్రి 9:30 గంటలకే శయన హారతి.. రాత్రి 10 గంటలకు మూతపడనున్న గర్భాలయ తలుపులు!
చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పూజా సమయాల్లో మార్పులు చేసిన రామజన్మభూమి ట్రస్ట్!
సాయంత్రం 7 గంటలకు సంధ్యా హారతి.. భక్తుల రద్దీని నియంత్రించేలా నూతన షెడ్యూల్!
Ayodya: ఉత్తర భారతంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ రామ్‌లల్లా నిత్య కైంకర్యాలు, ఆరతులు మరియు భక్తుల దర్శన వేళలను సవరించింది. ప్రస్తుతమున్న సమయాల్లో మార్పులు చేస్తూ రూపొందించిన నూతన టైమ్‌టేబుల్ నవంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. ప్రస్తుతం ఉదయం 3:45 గంటలకే ఆలయ ద్వారాలు తెరుస్తుండగా, కొత్త నిబంధనల ప్రకారం ఉదయం 4:00 గంటలకు తెరుస్తారు. అదేవిధంగా రాత్రి 10:30 గంటల బదులుగా రాత్రి 10:00 గంటలకే ఆలయ తలుపులను మూసివేయనున్నారు.
సవరించిన ఆరతుల వివరాలు
నూతన షెడ్యూల్ ప్రకారం బాలరాముడికి జరిగే ప్రధాన ఆరతుల సమయాలు మారాయి:
మంగళ హారతి: ఉదయం 4:00 గంటల నుంచి ఉదయం 4:30 గంటలకు మార్చబడింది.
శృంగార హారతి: ఉదయం 6:00 గంటల నుంచి ఉదయం 6:30 గంటలకు మార్పు చేశారు.
భోగ్/మధ్యాహ్న హారతి: మధ్యాహ్నం 12:00 గంటలకు సమర్పిస్తారు.
సంధ్యా హారతి: సాయంత్రం 7:00 గంటలకు జరుగుతుంది.
శయన హారతి: రాత్రి 10:00 గంటల బదులు రాత్రి 9:30 గంటలకే నిర్వహించి, రాత్రి 10:00 గంటలకు తలుపులు మూసివేస్తారు.
మధ్యాహ్న విశ్రాంతి సమయం పెంపు
ఇప్పటివరకు మధ్యాహ్న వేళ రామ్‌లల్లాకు కేవలం 25 నిమిషాల పాటు (మధ్యాహ్నం 12:30 నుంచి 12:55 వరకు) మాత్రమే విరామం ఇచ్చేవారు. అయితే చలికాలం ప్రభావంతో బాలరాముడి విశ్రాంతి కాలాన్ని గంట సేపటికి పెంచారు. నవంబర్ 1 నుంచి మధ్యాహ్నం 12:30 నుంచి 1:30 వరకు గర్భాలయ ద్వారాలు మూసివేస్తారు. ఆ సమయంలో భక్తులకు దర్శనాలు నిలిచిపోతాయి.
భక్తులకు విజ్ఞప్తి – ప్రణాళికాబద్ధమైన దర్శనం
దేశవిదేశాల నుంచి నిత్యం లక్షలాది మంది భక్తులు అయోధ్యకు తరలివస్తున్నందున, భక్తులు ఈ మారిన సమయాలకు అనుగుణంగా తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని రామజన్మభూమి ట్రస్ట్ సూచించింది. ఆర్తి పాస్‌లు లేదా సుగమ్ దర్శన్ స్లాట్లు బుక్ చేసుకున్న భక్తులు నిర్దేశిత సమయానికి 45 నుంచి 60 నిమిషాల ముందే భద్రతా తనిఖీ కేంద్రాల వద్దకు చేరుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.
Tags
Be the first to react