ఎంతటివారైనా సరే.. ధ్వజస్తంభం దాటడానికి వీల్లేదు! ఆలయాల ఎంట్రీ పై హైకోర్టు సంచలన తీర్పు!
Madras High Court: తమిళనాడులోని ఆగమ సంప్రదాయాన్ని అనుసరించే ఆలయాల్లోకి అన్యమతస్తులు ధ్వజస్తంభం దాటి లోపలికి ప్రవేశించడానికి వీల్లేదని మద్రాసు హైకోర్టు మదురై బెంచ్ సంచలన తీర్పు వెలువరించింది. దైవ దర్శనం కావాలనుకునే హిందూయేతరులు సదరు దేవుడిపై విశ్వాసం, గౌరవం ఉన్నట్లు తప్పనిసరిగా అంగీకార పత్రం (డిక్లరేషన్) పై సంతకం చేయాలని ఆదేశించింది. ప్రజాప్రతినిధులు, మంత్రులు కూడా ఆగమ నిబంధనలకు అతీతులు కారని, అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిబంధనలను అమలు చేయాలని న్యాయమూర్తులు స్పష్టం చేశారు.
హిందూయేతరులు దైవంపై విశ్వాసం ప్రకటిస్తూ అంగీకార పత్రం (డిక్లరేషన్) ఇస్తేనే అనుమతి!
ప్రతి ఆలయంలో హెచ్చరిక బోర్డులు, అవసరమైన రిజిస్టర్లు ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశం!
మదురై మీనాక్షి అమ్మవారి ఆలయం, తిరుచెందూర్ క్షేత్రంలో ప్రజాప్రతినిధుల అతిక్రమణలపై ఆగ్రహం!
Tamilnadu: తమిళనాడులోని ఆగమ సంప్రదాయ ఆలయాల్లోకి హిందూయేతరుల ప్రవేశం, ఆలయ మర్యాదల ఉల్లంఘనలపై మదురైకి చెందిన కె. తంగం వెంకటేష్ మద్రాసు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలు చేశారు. తమిళనాడు ఆలయ ప్రవేశ చట్టం, నియమావళిని తుంగలో తొక్కుతున్న వారిపై విచారణ జరిపించి కఠినంగా అమలు చేయాలని ఆయన కోరారు. ఈ పిటిషన్ను విచారించిన జస్టిస్ జి.ఆర్. స్వామినాథన్ మరియు జస్టిస్ పి. మురుగన్లతో కూడిన మదురై ధర్మాసనం ఆలయాల పవిత్రతను కాపాడే దిశగా కీలక తీర్పును వెలువరించింది.
ధ్వజస్తంభం దాటడానికి వీల్లేదు – డిక్లరేషన్ తప్పనిసరి
ఆగమ సంప్రదాయాలను అనుసరించే దేవాలయాల్లో అన్యమతస్తులు ఎంతటి హోదాలో ఉన్నప్పటికీ ధ్వజస్తంభం దాటి ముందుకు వెళ్లడానికి వీల్లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇతర మతాల గుర్తులు ధరించి, ఆయా దేవతామూర్తుల పట్ల విశ్వాసాన్ని ప్రకటించని వ్యక్తులను కనీసం ఆలయ ప్రాంగణంలోకి కూడా అనుమతించరాదని పేర్కొంది. ఒకవేళ ఎవరైనా ఇతర మతస్థులు దర్శనం చేసుకోవాలనుకుంటే, ఆ దైవంపై తమకు అపారమైన నమ్మకం, గౌరవం ఉన్నాయని లిఖితపూర్వక అంగీకార పత్రం (డిక్లరేషన్) పై సంతకం చేయాలని తీర్పునిచ్చింది. ఈ మేరకు ప్రతి ఆలయంలో భక్తులకు స్పష్టంగా కనిపించేలా బోర్డులు ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖను ఆదేశించింది. అయితే అయ్యప్ప, షిర్డీ సాయిబాబా వంటి సర్వమత సమ్మిళిత క్షేత్రాలకు ఈ నిబంధన వర్తించదని స్పష్టం చేసింది.
ఎమ్మెల్యేలు, మంత్రుల తీరుపై తీవ్ర ఆగ్రహం
మదురై మీనాక్షి అమ్మవారి ఆలయంలోకి ఎన్నికల అనంతరం స్థానిక ఎమ్మెల్యే బద్రుద్దీన్ ప్రవేశించి, భక్తుల సదుపాయాల తనిఖీ నెపంతో కుంభాభిషేకం వేళ ఏకంగా ఆలయ గోపురాలపైకి ఎక్కడాన్ని న్యాయస్థానం తీవ్రంగా తప్పుపట్టింది. గతంలో సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని బహిరంగ ప్రకటనలు చేసిన వ్యక్తులు, ఆ సంప్రదాయాలకు ప్రతీకలైన ఆలయ గోపురాలు ఎక్కడం ద్వంద్వ నీతి కాదా అని కోర్టు ప్రశ్నించింది. అలాగే తిరుచెందూర్ సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలోకి క్రైస్తవ విశ్వాసాలు కలిగిన ఒక మంత్రి ఎలాంటి డిక్లరేషన్ ఇవ్వకుండానే ప్రవేశించడాన్ని ప్రస్తావిస్తూ.. ప్రజాప్రతినిధులు లేదా మంత్రులు అయితే ఆలయ మర్యాదలు, ఆగమాలకు అతీతులా అని ఘాటుగా నిలదీసింది.
చారిత్రక నిబంధనలు – ఇందిరా గాంధీ నుంచి విజయ్ దాకా
ఆలయ ఆగమ నియమాలు ఎంతటి శక్తివంతమైన వ్యక్తులకైనా సమానమేనని కథనం గుర్తుచేసింది. 1984లో అప్పటి అత్యంత శక్తివంతమైన భారత ప్రధాని ఇందిరా గాంధీ పార్శీ మతస్థుడిని వివాహం చేసుకున్న కారణంగా పూరీ జగన్నాథ ఆలయ అధికారులు ఆమెకు ప్రవేశం కల్పించకపోతే, ఆమె సైతం ఆ ఆగమ నిర్ణయానికి తలవంచారని పేర్కొంది. అలాగే ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ సైతం మదురై మీనాక్షి అమ్మవారిని దర్శించుకునే ముందు అధికారికంగా అంగీకార పత్రంపై సంతకం చేసి ఆలయ నిబంధనలను గౌరవించిన విషయాన్ని ప్రస్తావించింది.
రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గవద్దు
అధికార పార్టీల ప్రజాప్రతినిధులు ఆలయ నిబంధనలను అతిక్రమిస్తుంటే, అధికారానికి భయపడి ఆలయ సిబ్బంది ప్రేక్షకపాత్ర వహించాల్సిన అవసరం లేదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. శబరిమల ఆలయ సంప్రదాయాల ఉల్లంఘన విషయంలో గతంలో కేరళ లెఫ్ట్ ప్రభుత్వం రాజకీయంగా మూల్యం చెల్లించుకున్న ఉదంతాన్ని, తిరుమల డిక్లరేషన్ వివాదాలను ఈ సందర్భంగా రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. పాలకులు ఎవరైనా సరే సనాతన ధర్మ విశ్వాసాలను, ఆగమ శాస్త్ర హద్దులను గౌరవించాల్సిందేనని ఈ తీర్పు తేటతెల్లం చేసింది.
Tags
Be the first to react