తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 నుంచి 30 గంటల సమయం!
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. క్యూ లైన్ బాట గంగమ్మ ఆలయం వరకు చేరుకుంది.
శ్రీవారి దర్శనం కోసం భారీగా తరలివచ్చిన భక్తులు.. నిండిపోయిన కంపార్ట్మెంట్లు..
తిరుమల క్యూలైన్లు కిటకిట.. బాట గంగమ్మ గుడి వరకు చేరిన భక్తుల వరుస..
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. క్యూ లైన్ బాట గంగమ్మ ఆలయం వరకు చేరుకుంది.
ఆదివారం ఉదయం 8 గంటల తర్వాత సర్వదర్శనం కోసం వచ్చే భక్తులకు స్వామివారి దర్శనం పొందేందుకు సుమారు 24 నుంచి 30 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
రూ.300 ప్రత్యేక శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు కూడా రద్దీ కారణంగా 4 నుంచి 6 గంటల వరకు సమయం పడుతోంది. సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులు 5 నుంచి 7 గంటల వ్యవధిలో స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉందని సమాచారం.
ఇక నిన్న ఒక్కరోజే 85,582 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. తమ మొక్కులు తీర్చుకునేందుకు 44,155 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం కూడా భారీగా నమోదైంది. నిన్న భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.3.76 కోట్ల ఆదాయం వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తెలిపింది.
భక్తుల కోసం టీటీడీ అందిస్తున్న అన్నప్రసాద సేవలను పెద్ద సంఖ్యలో భక్తులు వినియోగించుకున్నారు. నిన్న 3.43 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించారు. అలాగే తిరుమలలోని వైద్య సదుపాయాల ద్వారా 3,583 మంది భక్తులు చికిత్స పొందారు.
భారీ రద్దీ ఉన్నప్పటికీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భక్తులు ఓపికతో క్యూ లైన్లలో ఉండి స్వామివారి దర్శనం చేసుకోవాలని సూచిస్తున్నారు.