జస్టిస్ రఘునందన్ రావుకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
రాజ్యాంగ విలువలు, న్యాయపాలన పరిరక్షణలో జస్టిస్ రఘునందన్ రావు అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ కొనియాడారు.
25 వేల కేసుల పరిష్కారం.. న్యాయవ్యవస్థలో ప్రత్యేక ముద్ర వేసిన జస్టిస్ రఘునందన్ రావు..
ప్రజల హక్కుల పరిరక్షణే న్యాయస్థానాల ధర్మం: జస్టిస్ రఘునందన్ రావు..
అమరావతి: రాజ్యాంగ విలువలు, న్యాయపాలన పరిరక్షణలో జస్టిస్ రఘునందన్ రావు అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్ రఘునందన్ రావు పదవీ విరమణ సందర్భంగా సోమవారం హైకోర్టు మొదటి కోర్టు హాల్లో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ మాట్లాడుతూ.. జస్టిస్ రఘునందన్ రావు న్యాయపరమైన నిష్పాక్షికత, రాజ్యాంగంపై ఉన్న అచంచల నిబద్ధత, న్యాయవ్యవస్థ అభివృద్ధికి చేసిన కృషిని ప్రశంసించారు.
న్యాయవాదిగా విశేష అనుభవం పొందిన అనంతరం న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ రఘునందన్ రావు రాజ్యాంగ స్ఫూర్తిని, న్యాయపాలనను అత్యున్నత ప్రమాణాలతో కాపాడారని ఆమె పేర్కొన్నారు. రాజ్యాంగ అంశాలు, క్లిష్టమైన సివిల్ వివాదాలు, పన్నుల కేసులు, ప్రజాప్రయోజన వ్యాజ్యాల్లో ఆయన ఇచ్చిన తీర్పులు న్యాయవ్యవస్థకు మార్గదర్శకంగా నిలిచాయని అన్నారు.
తన పదవీకాలంలో సుమారు 25 వేల కేసులను సమర్థవంతంగా పరిష్కరించడం ద్వారా న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలపరిచారని జస్టిస్ లిసా గిల్ తెలిపారు. న్యాయపరమైన బాధ్యతలతో పాటు పరిపాలనా వ్యవహారాల్లోనూ ఆయన చూపిన నాయకత్వం ప్రశంసనీయమన్నారు.
హైకోర్టు మౌలిక వసతుల అభివృద్ధి, సమాచార సాంకేతిక వినియోగం, న్యాయ ప్రక్రియల డిజిటలైజేషన్, న్యాయసేవలను ప్రజలకు చేరువ చేయడంలో జస్టిస్ రఘునందన్ రావు చేసిన సేవలను ఆమె గుర్తు చేశారు. వివిధ పరిపాలనా కమిటీల్లో ఆయన పోషించిన పాత్ర ఆంధ్రప్రదేశ్ న్యాయవ్యవస్థ అభివృద్ధికి బలమైన పునాదులు వేసిందన్నారు.
వీడ్కోలు సందర్భంగా జస్టిస్ రఘునందన్ రావు మాట్లాడుతూ న్యాయమూర్తిగా చేసిన రాజ్యాంగ ప్రమాణానికి తన పదవీకాలమంతా కట్టుబడి పనిచేశానని తెలిపారు. న్యాయమూర్తిగా గడిపిన ఆరున్నర సంవత్సరాలు తన జీవితంలో ఎంతో విలువైన అనుభవాలను అందించాయని పేర్కొన్నారు.
న్యాయస్థానమే తమ చివరి ఆశ్రయంగా భావించే సాధారణ ప్రజల సమస్యలను దగ్గరగా అర్థం చేసుకునే అవకాశం తనకు లభించిందన్నారు. తమ హక్కుల కోసం పోరాడే ప్రజలకు హైకోర్టు ఒక ముఖ్యమైన భరోసా అని, ప్రతి పౌరుడి రాజ్యాంగ హక్కులను కాపాడటం న్యాయవ్యవస్థ అత్యున్నత బాధ్యత అని స్పష్టం చేశారు.
న్యాయమూర్తుల గౌరవం వారి పదవుల్లో కాకుండా.. న్యాయం కోసం వచ్చిన ప్రతి వ్యక్తికి ఎంత నిబద్ధతతో న్యాయం చేశారన్న దానిపైనే ఆధారపడి ఉంటుందని అన్నారు.
ఉమ్మడి హైకోర్టు విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సాధించిన పురోగతిని ఆయన ప్రస్తావించారు. న్యాయస్థానాల మౌలిక సదుపాయాల అభివృద్ధి, కొత్త హైకోర్టు భవనం, కేసుల పరిష్కారంలో వచ్చిన పురోగతిని వివరించారు. దేశంలోని అత్యుత్తమ హైకోర్టుల సరసన ఆంధ్రప్రదేశ్ హైకోర్టును నిలబెట్టేందుకు భవిష్యత్ తరాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తన ప్రసంగంలో దలైలామా సందేశాన్ని ప్రస్తావిస్తూ.. ఈ భూమిపై మనం అతిథులమని, ఇతరులకు ఉపయోగపడే మంచి పనులు చేయడమే జీవితానికి నిజమైన అర్థమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సేవ చేసే అవకాశం తనకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ సొలిసిటర్ జనరల్ చల్లా ధనుంజయ్, అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు, న్యాయాధికారులు, రిజిస్ట్రార్లు, న్యాయశాఖ అధికారులు పాల్గొని జస్టిస్ రఘునందన్ రావుకు వీడ్కోలు శుభాకాంక్షలు తెలిపారు.