తల్లి వైద్యానికి వెళ్లి వచ్చేలోపు ఆన్‌లైన్‌లో 4 ఎకరాల భూమి మాయం... నిరుపేద యువతిని సైబర్ క్రిమినల్‌గా... 22-A నిషేధిత జాబితా కష్టాలు!
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రజా వినతుల కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఏపీ లేబర్ బోర్డు చైర్మన్ వెంకట శివుడు యాదవ్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి అమరావతి ప్లాట్ల దౌర్జన్యాలు, ఆన్లైన్ రికార్డుల తారుమారు ద్వారా 4 ఎకరాల భూమి మాయమవ్వడం, వర్క్ ఫ్రమ్ హోమ్ మోసాలు మరియు నందలూరు ఎంపీడీఓ వేధింపులపై బాధితులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఫిర్యాదులు చేశారు. అర్జీలన్నింటినీ పరిశీలించి బాధితులకు తక్షణ న్యాయం చేస్తామని నేతలు హామీ ఇచ్చారు.
అమరావతి ప్లాట్ల వివాదం: ఆడబిడ్డలపై సోదరుడి దౌర్జన్యం.. న్యాయం చేయాలంటూ వేడుకోలు.
భూ కబ్జాలు, రెవెన్యూ అక్రమాలపై కూటమి సర్కార్ సీరియస్.. అధికారులకు నేతల హెచ్చరిక!
ఊరు వెళ్తే భూములు మాయం.. వీఆర్వో పదవి అడ్డం పెట్టుకొని దారుల ఆక్రమణ!
Praja Vedika: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ (TDP) కేంద్ర కార్యాలయంలో సోమవారం ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఏపీ లేబర్ బోర్డు చైర్మన్ వెంకట శివుడు యాదవ్ ఈ వినతులను స్వీకరించి, బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ గ్రీవెన్స్కు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో బాధితులు తరలివచ్చి భూ కబ్జాలు, కుటుంబ దౌర్జన్యాలు, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం మరియు సైబర్ మోసాలపై తమ గోడును వెళ్లబోసుకున్నారు.
అమరావతి రాజధాని పరిధిలోని ఉద్దండ్రాయునిపాలేనికి చెందిన వేజండ్ల సామ్రాజ్యం అనే మహిళ తన సోదరుడు బత్తుల నాగమల్లేశ్వరరావు, అతని కుమారులు ల్యాండ్ పూలింగ్ ప్లాట్ల పంపకాల్లో తలా 30 వేల రూపాయలు డిమాండ్ చేస్తూ తమపై అమానుషంగా దాడి చేశారని, ప్రస్తుతం తమకు ప్రాణభయం ఉందని వాపోయింది. మరో కేసులో అమలాపురానికి చెందిన బండారి దివ్య అనే నిరుపేద యువతి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం ఆశతో బ్యాంక్ అకౌంట్లు తెరిచి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నానని, ఇప్పుడు యూపీ, కోల్కతా పోలీసుల నుండి నోటీసులు వస్తూ తీవ్ర భయాందోళనకు గురవుతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది.
రెవెన్యూ శాఖలో ఆన్లైన్ రికార్డుల మాయాజాలం, అధికారుల అండతో జరుగుతున్న అక్రమాలపై పలువురు నేతలకు ఫిర్యాదు చేశారు. మార్కాపురం జిల్లాకు చెందిన కొత్తపల్లి మురళి తన తల్లి వైద్యం కోసం విజయవాడకు వెళ్లి వచ్చేలోపు ఆన్లైన్ వెబ్సైట్లో తనకున్న 4 ఎకరాల భూమిని వేరొకరి పేరు మీదకు మార్చేశారని కన్నీటిపర్యంతమయ్యాడు. నంద్యాల జిల్లాకు చెందిన రాజగౌడ్ తనకున్న 5 ఎకరాల సొంత భూమిని పట్టా పుస్తకాలు ఉన్నప్పటికీ రెవెన్యూ అధికారుల సహాయంతో కొందరు అక్రమంగా లీజుకు తీసుకుని బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేయగా, అన్నమయ్య జిల్లాకు చెందిన రమాదేవి తమ కుటుంబానికి చెందిన 2500 ఎకరాల జమీందారీ భూములను స్థానికులు కబ్జా చేశారని, దీనిపై పోరాడుతున్నందుకు ప్రాణభయం ఉందని పేర్కొంది.
ప్రభుత్వ విభాగాల్లో వేధింపులు, ఆక్రమణలపై కూడా బాధితులు అర్జీలు సమర్పించారు. కడప జిల్లాకు చెందిన గిరిజన యువకుడు సింగమనేని మహేష్.. నందలూరు ఎంపీడీఓ 'స్వచ్ఛరథం' వాహన మెయింటెనెన్స్ ఫండ్ రూ. 50,000 నొక్కేయడమే కాకుండా, కమీషన్ల గురించి ప్రశ్నించినందుకు తనను, తన తల్లిని కులం పేరుతో దూషించి ఆఫీసు నుండి నెట్టేశారని ఆరోపించాడు. తిరుపతి జిల్లాకు చెందిన లక్ష్మీ నర్సయ్య తన ఇంటి పక్కన ఉండే వీఆర్వో పెంచలయ్య దారిని ఆక్రమించి ఇల్లు కట్టడం వల్ల రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయని వాపోయాడు. బాపట్ల, పార్వతీపురం మన్యం జిల్లాల నుండి వచ్చిన పలువురు బాధితులు కూడా రీ-సర్వే తప్పులు, భూ ఆక్రమణలపై నేతలకు వినతులు అందించారు.
ఈ ప్రజా సమస్యలన్నింటినీ ఓపికగా విన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, లేబర్ బోర్డు చైర్మన్ వెంకట శివుడు యాదవ్ స్పందిస్తూ.. కూటమి ప్రభుత్వంలో బాధితులకు పూర్తి న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. ముఖ్యంగా భూ కబ్జాలు, ఆన్లైన్ రికార్డుల తారుమారు మరియు విధులను దుర్వినియోగం చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వీటితో పాటు ఉపాధి కోసం రెస్యూమ్లు, పెన్షన్, రేషన్, అనారోగ్య వైద్య సహాయం కోసం వచ్చిన అర్జీలను ఆయా ప్రభుత్వ శాఖలకు పంపి, త్వరితగతిన పరిష్కరించేలా చూస్తామని నేతలు హామీ ఇచ్చారు.