⚡ BREAKING

తోతాపురి మామిడి రైతులను ఆదుకోవాలి.. కేంద్రానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి!

తోతాపురి మామిడి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం సహాయం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు సీఎం లేఖ రాశారు.

CM Chandra Babu Naidu
CM Chandra Babu Naidu

రూ.281 కోట్ల ఆర్థిక సహాయం కోరుతూ కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు లేఖ..

ధరలు పడిపోవడంతో తోతాపురి రైతుల కష్టాలు.. కేంద్రానికి సీఎం లేఖ..

అమరావతి: తోతాపురి మామిడి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం సహాయం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు సీఎం లేఖ రాశారు.

మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీం (PDPS) అమలు చేయాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా మామిడి పల్ప్ ఎగుమతులు నిలిచిపోవడం, పరిశ్రమలు కొనుగోళ్లు తగ్గించడంతో తోతాపురి మామిడి ధరలు భారీగా పడిపోయాయని లేఖలో వివరించారు.

మామిడి రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.281 కోట్ల ఆర్థిక సహాయం అందించాలని సీఎం కోరారు. ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మామిడి ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉందని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3.99 లక్షల హెక్టార్లలో మామిడి సాగు జరుగుతుండగా, దాదాపు 52.65 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తోందని పేర్కొన్నారు.

ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోని చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాల్లో తోతాపురి రకం మామిడి విస్తృతంగా సాగవుతోందని తెలిపారు. ఈ ప్రాంతాల్లో దాదాపు 91,011 హెక్టార్లలో తోతాపురి సాగు జరుగుతోందని, దీని ద్వారా 8.65 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తూ లక్షలాది రైతు కుటుంబాలకు జీవనాధారంగా ఉందని చెప్పారు.

అయితే ఈ ఏడాది మామిడి రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని సీఎం పేర్కొన్నారు. సాగు ఖర్చులు పెరగడం, మార్కెట్ ధరలు పడిపోవడం, ఎగుమతులు నిలిచిపోవడం వల్ల రైతులు ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారని వివరించారు.

ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించిందని చంద్రబాబు తెలిపారు. 7.03 లక్షల మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడి కొనుగోళ్లకు మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఈ పథకంలో భాగంగా రైతులకు కిలో మామిడికి అదనంగా రూ.4 చొప్పున చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఈ కొనుగోళ్లు జూన్ నుంచి ఆగస్టు వరకు కొనసాగనున్నాయని చెప్పారు.

రైతులకు ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా PDPS కింద సహకారం అందించి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీంను అమలు చేయాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. తోతాపురి మామిడి రైతుల సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం పేర్కొంది.

Tags

Be the first to react

Latest