ఖనిజ సంపదకు కొత్త దిశ.. మినరల్ మ్యాపింగ్కు సీఎం చంద్రబాబు ఆదేశాలు!

ఆంధ్రప్రదేశ్లో ఉన్న విలువైన ఖనిజ సంపదను గుర్తించి, దానికి సరైన విలువ జోడింపు ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గనుల శాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం కీలక సూచనలు చేశారు.

Chandra Babu Naidu
Chandra Babu Naidu

రేర్ ఎర్త్ మినరల్స్పై ఫోకస్.. విలువ జోడింపుతో ఆదాయం పెంచాలని సీఎం సూచన..

టెక్నాలజీతో ఇసుక తవ్వకాలపై నిఘా.. అక్రమాలకు చెక్ పెట్టాలని సీఎం ఆదేశం..

అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఉన్న విలువైన ఖనిజ సంపదను గుర్తించి, దానికి సరైన విలువ జోడింపు ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గనుల శాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం కీలక సూచనలు చేశారు.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఖనిజ నిల్వలను గుర్తించేందుకు మినరల్ మ్యాపింగ్ చేపట్టాలని సీఎం సూచించారు. క్రిటికల్ మినరల్స్, బల్క్ మినరల్స్, విలువైన లోహాలు లభించే ప్రాంతాలను గుర్తించి పూర్తి స్థాయి అధ్యయనం చేయాలని తెలిపారు.

ఖనిజాలను కేవలం వెలికితీయడం కాకుండా రాష్ట్రంలోనే ప్రాసెసింగ్ చేసి వాటికి విలువ జోడించే విధానాన్ని అభివృద్ధి చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఖనిజ సంపదకు సంబంధించిన మార్కెట్ క్యాపిటలైజేషన్ అవకాశాలపై నిపుణులతో కలిసి అధ్యయనం చేయాలని ఆదేశించారు.

బీచ్ శాండ్, రేర్ ఎర్త్ మినరల్స్, ఇనుము ఖనిజం, మాంగనీస్, అల్యూమినా వంటి ఖనిజాలకు విలువ జోడించడం ద్వారా రాష్ట్రానికి భారీ ఆదాయం వచ్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

దేశంలో కొన్ని రాష్ట్రాలు ఖనిజ ఆదాయం ఆధారంగా ఆర్థికంగా బలపడ్డాయని గుర్తు చేసిన సీఎం, ఆంధ్రప్రదేశ్లో కూడా ఖనిజ రంగాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

రేర్ ఎర్త్ మినరల్స్పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. ఏపీతో పాటు ఒడిశా, కేరళ ప్రాంతాల్లో లభించే అరుదైన ఖనిజాల కోసం ప్రత్యేక క్లస్టర్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. టైటానియం, ఇల్మెనైట్, మోనజైట్ వంటి విలువైన ఖనిజాల నిల్వలను గుర్తించాలని చెప్పారు.

ఎలక్ట్రానిక్స్, మాగ్నెట్స్, అణు ఇంధనం వంటి కీలక రంగాలకు అవసరమైన లోహాల తయారీలో రేర్ ఎర్త్ మినరల్స్ ఎంతో ముఖ్యమైనవని సీఎం తెలిపారు. రాష్ట్రంలోని జొన్నగిరి, చిత్తూరు జిల్లా చిగురుగుంట ప్రాంతాల్లో బంగారం నిల్వలపై కూడా మరింత అధ్యయనం చేయాలని గనుల శాఖకు సూచించారు.

రాష్ట్రంలోని 126 ప్రాంతాల్లో క్రిటికల్, బల్క్ ఖనిజాలు సహా పలు ఖనిజ నిల్వలను గుర్తించినట్లు అధికారులు సీఎంకు వివరించారు. మైనింగ్ కార్యకలాపాల ద్వారా ఆదాయంలో 18 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపారు.

దీనిపై సీఎం స్పందిస్తూ గనుల నిర్వహణను మరింత పటిష్టంగా చేయాలని సూచించారు. అక్రమాలకు తావు లేకుండా ఇసుక తవ్వకాలు, సరఫరాపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించారు.

ఇసుక రీచ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు శాటిలైట్ చిత్రాల ద్వారా పర్యవేక్షణ చేయాలని, వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ విధానం అమలు చేయాలని తెలిపారు.

ప్రజల అవసరాల కోసం ప్రభుత్వం సుమారు రూ.1000 కోట్ల ఆదాయాన్ని వదులుకుని ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తోందని సీఎం పేర్కొన్నారు. ప్రజలకు ఈ విధానం సక్రమంగా అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, సీఎస్ సాయి ప్రసాద్, గనులు, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tags

Be the first to react

Latest