వైసీపీ మాజీ సర్పంచ్ భూకబ్జాపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు.. చంపేస్తామంటూ ఆక్రమణదారుల బెదిరింపులు!
శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం తప్పేటవారిపాలెం గ్రామానికి చెందిన కే. ఐజయ్య నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు అర్జీ ఇచ్చి అభ్యర్థిస్తూ.. తమ గ్రామ పొలంలోని సర్వే నెంబర్ 256 లో తనకు పాస్ బుక్ ప్రకారం 9 ఎకరాల 75 సెంట్ల భూమి కలదు.
- సీలింగ్ భూమిపై దౌర్జన్యం.. చంపేస్తామంటూ ఆక్రమణదారుల బెదిరింపులు..
- ఇనమడుగులో వైసీపీ నాయకుల బరితెగింపు.. ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమ కట్టడాలు..
శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం తప్పేటవారిపాలెం గ్రామానికి చెందిన కే. ఐజయ్య నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు అర్జీ ఇచ్చి అభ్యర్థిస్తూ.. తమ గ్రామ పొలంలోని సర్వే నెంబర్ 256 లో తనకు పాస్ బుక్ ప్రకారం 9 ఎకరాల 75 సెంట్ల భూమి కలదు. దస్తావేజు ప్రకారం (మొత్తం 13 ఎకరాల 75 సెంట్లలో) తన అన్న కే. జయరాజుల మధ్య భాగపరిష్కారం జరిగింది. జయరాజుకు 6 ఎకరాల 87½ సెంట్లు, తనకు మిగిలిన భాగం దక్కాయి. అయితే, అన్న జయరాజు గతంలో స్థానిక వైసీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ అయిన పరికిశెట్టి వెంగముని వద్ద రూ. 25,000 అప్పు తీసుకోవడం వల్ల, అందుకు ప్రతిగా 5 ఎకరాల భూమిని వెంగముని పేరిట రాసిచ్చారు.
కానీ, సదరు మాజీ సర్పంచ్ వెంగముని, అతని తమ్ముడు శేష చలపతి, కవితలు కలిసి, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ రాజకీయ అండదండలతో తనకు చెందిన మిగిలిన 3 ఎకరాల 75 సెంట్ల భూమిని కూడా అక్రమంగా కబ్జా చేశారు. ఈ విషయమై 'స్పందన'లో జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసి, రెండుసార్లు చలానా కట్టినా ఫలితం లేకపోయింది. గ్రామ సచివాలయ సిబ్బందితో పాటు అప్పటి గ్రామ సర్వేయర్ భారతి, వీఆర్వో పవన్, ఆర్ఐ పవన్, మండల సర్వేయర్ శివనాయక్, డివిజన్ సర్వేయర్ మురళీకృష్ణలు కబ్జాదారులతో కుమ్మక్కయ్యారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని నేతలు నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, విజయవాడ పార్లమెంట్ అధ్యక్షురాలు గద్దె అనూరాధలకు అర్జీ అభ్యర్ధించారు.
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దుత్తలూరుకు చెందిన వెంటేశ్వరరెడ్డి గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తమ గ్రామంలో సర్వే నెంబర్ 1211 లో తరకు వారసత్వంగా వచ్చిన 30 సెంట్ల భూమి ఉంది. ఈ భూమి ప్రస్తుతం తన అనుభవంలో ఉంది. అయితే గత 2013 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కొందరు స్థానిక వైసీపీ నాయకుల ఒత్తిళ్లకు లొంగి, సదరు భూమిని శీలం నాగేశ్వరరావు అనే వ్యక్తి పేరుపై ఆన్లైన్లో తప్పుడు నమోదు చేశారు. ఈ విషయమై రెవిన్యూ అధికారులను ఆశ్రయించగా.. అప్పటి తహసీల్దార్, ఆర్డీవో జాయింట్ కలెక్టర్ గారు రికార్డులను పరిశీలించారు.
ఇది సివిల్ వివాదంగా గుర్తించి, ఇరువర్గాలూ సివిల్ కోర్టుకు వెళ్ళి తేల్చుకోవాల్సిందిగా ఆదేశించారు. కోర్టు పరిధిలో ఉన్న ఈ సివిల్ వివాదాన్ని అడ్డం పెట్టుకుని ఎదుటి వర్గానికి చెందిన శీలం వెంకటేశ్వర్లు, శీలం గోపాల్, శీలం సుబ్బారావు అనే ముగ్గురు వ్యక్తులు జిల్లా ఎస్పీ గారి ద్వారా ఒత్తిడి తెచ్చి పోలీసులను రంగంలోకి దించారు. స్థానిక సి.ఐ , ఎస్.ఐ గార్లు తనపై ఎఫ్ఐఆర్ ఉందంటూ పదే పదే నోటీసులు ఇస్తూ, పోలీస్ స్టేషన్కు రావాలంటూ మానసిక భయాందోళనలకు గురిచేస్తున్నారు. గత ప్రభుత్వంలో కూడా తనపై అక్రమ కేసులు పెట్టి వేధించారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.
వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట మండలం నడింపల్లె గ్రామానికి చెందిన చందల సుబ్రమణ్యం గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తమ గ్రామ పొలంలోని సర్వే నెంబర్ 1867 (చెరువు పొరంబోకు), సర్వే నెంబర్ 1868 (దండుబాట) భూములు ఉన్నాయి. ఈ రెండింటి మధ్య ఉన్న ప్రభుత్వ స్థలాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త టి. సాయి కుమార్ అనే వ్యక్తి నకిలీ డి-ఫారం సృష్టించి ఆక్రమించాడు. అక్కడ ఒక డాబా ఇళ్లు నిర్మించడమే కాకుండా, పక్కనే ఉన్న ఆర్ అండ్ బి స్థలంలో కూడా అక్రమంగా రూములు నిర్మించాడు. గ్రామస్తులందరికీ బహుళ ప్రయోజనకారిగా ఉన్న నీటి కుంటను సైతం మట్టితో పూడ్చివేసి, ఇతర రాష్ట్రాల లారీలకు బాడుగకు ఇస్తూ వాహనాల స్టాండ్గా మార్చేశాడు. అక్కడ రోజువారీ వందలాది లారీలు నిలపడం వల్ల గ్రామస్తులు ఆ దారిలో నడవలేకపోతున్నారు.
గత ఐదేళ్లుగా సదరు వ్యక్తి అక్కడ అనేక అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడు. ఫిబ్రవరి 15, 2025న తహశీల్దార్ గారు తొలగింపునకు రాగా, ఆక్రమణదారుడు నకిలీ డి-ఫారం చూపించి అడ్డుకున్నాడు. అనంతరం ఆక్రమణదారుడు హైకోర్టును ఆశ్రయించగా... రెవెన్యూ రికార్డులను పరిశీలించిన గౌరవ హైకోర్టు, సదరు డి-ఫారం తప్పుడుదని తేల్చి రిట్ పిటిషన్ను కొట్టివేసింది. చట్టప్రకారం అక్రమ కట్టడాలను తొలగించాలని రెవెన్యూ వారిని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఒంటిమిట్ట తహశీల్దార్ గారు 29.09.2025న ఆక్రమణలను తొలగించాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, తహశీల్దార్ ఉత్తర్వులు ఇచ్చి కూడా అమలు చేయడంలో కాలయాపన చేయడంతో, ఆక్రమణదారుడు దీనిని ఆసరాగా చేసుకుని మళ్లీ కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. కావున వారిపై చర్యలు తీసుకోని వెంటనే అక్రమ కట్టడాలను తొలగించాలని కోరాడు.
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మండలం ఇనమడుగు గ్రామానికి చెందిన మోమిడి మురళీకృష్ణ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. ఇనమడుగు సెంటర్ నుంచి ఊటుకూరు వెళ్లే దారిలో ఇరువైపులా డ్రైనేజీ కాలువలు నిర్మించారు. ఆ డ్రైనేజీ పక్కన ఉన్న ప్రభుత్వ 'శివాయి జమ' భూమిలో గతంలో కొందరు నివసిస్తుండేవారు. ప్రభుత్వం వారికి ప్రత్యామ్నాయంగా 'గుమ్మల దిబ్బ' వద్ద పట్టా స్థలాలు ఇచ్చి, సదరు ఇనమడుగు సెంటర్ లోని స్థలాన్ని ఖాళీ చేయించింది. అయితే, ఆ ఖాళీ స్థలాన్ని ప్రస్తుతం కొందరు వైసీపీ నాయకులు ఆక్రమించి అక్రమంగా కట్టడాలు నిర్మిస్తున్నారు.
ఈ అక్రమ కట్టడాలపై ఇప్పటివరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని గ్రీవెన్స్ సెల్లో 5 సార్లు అర్జీలు ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో ఆర్ అండ్ బి ఏఈ చంద్ర గారు స్పందించి, ఆక్రమణలను తొలగిస్తామని సమయం కోరినప్పటికీ నెలలు గడుస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరల కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అధికారులు విచారణ జరపగా, అది ప్రభుత్వ 'శివాయి భూమి' అని, ఆక్రమణ నిజమేనని తేలింది. ఆక్రమణదారులైన మల్లవరపు ప్రసాద్, మల్లవరపు చిరంజీవిలు తాము వైసీపీ పార్టీ అండతోనే ఈ కట్టడాలు కట్టినట్లు, ప్రస్తుతం ఆరోగ్యం బాగోలేదని త్వరలోనే తొలగిస్తామని అధికారుల ఎదుట ఒప్పుకున్నారు. అయితే వీరికి అధికారులు ఇంకా ఎంతకాలం సమయం ఇస్తారని, తక్షణమే ఆ అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని కోరాడు.
అనంతపురం జిల్లా పుట్లూరు మండలం తక్కళ్ళపల్లి గ్రామానికి చెందిన తలారి నాగన్న, నాగరాజు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..శనగలగూడూరు గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 41A, 41Bలలో ఉన్న వ్యవసాయ భూమిని 1974 సంవత్సరంలో ప్రభుత్వ అధికారులు తమకి సీలింగ్ భూమి కింద కేటాయించారు. అప్పటి నుండి తాము ఆ భూమిని సాగు చేసుకుంటున్నాం. కాగా, గాండ్లపాడు గ్రామానికి చెందిన బి. బాలలక్ష్మమ్మ, బి. లీలావతి, బి. శకుంతల, బి. రూపి తదితరులు కలిసి తమ భూములను దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారు. అంతేకాకుండా అధికారులను తప్పుదోవ పట్టించి సదరు భూములను ఆన్లైన్ రికార్డుల్లోకి ఎక్కించుకుని, రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. తాము సాగు చేసుకుంటున్న భూమిని వదిలిపెట్టాలని నిలదీస్తే... "మిమ్మల్ని చంపేస్తాం, ఈ లోకంలో లేకుండా చేస్తాం, మేము ఎవరికీ భయపడము" అంటూ సదరు ఆక్రమణదారులు ప్రాణభయానికి గురిచేస్తున్నారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.
ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం చెవుటూరు గ్రామానికి చెందిన గొల్లపూడి శ్రీనివాసరావు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తమ గ్రామంలో సర్వే నెంబర్ 339 నందు 1957 నాటి రిజిస్టర్డ్ పార్టిషన్ దస్తావేజు (నెం. 1694/1957) ప్రకారం తమ కుటుంబానికి పూర్వార్జితంగా మొత్తం 9.45 సెంట్ల భూమి సంక్రమించింది. ఇందులో గొల్లపూడి చిన బసవయ్యకు 4.45 సెంట్లు, తన తండ్రి గొల్లపూడి వెంకటేశ్వరరావుకు 5.00 సెంట్ల భూమి దక్కాయి. అయితే, కొందరు వ్యక్తులు తప్పుడు సమాచారంతో ఈ భూమికి పాస్ పుస్తకాలు పొంది, అక్రమంగా విక్రయించడమే కాకుండా, భూమి స్వభావాన్ని మార్చేందుకు కూడా మంజూరు చేయించుకున్నారు. దీనిపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి న్యాయం జరగలేదు. కావున వారిపై చర్యలు తీసుకోని తనకు చెందాల్సిన 5.00 సెంట్ల భూమిని ఆన్లైన్ రికార్డుల్లో నమోదు చేసి న్యాయం చేయాలని కోరారు.
వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట మండలం నడింపల్లి గ్రామానికి చెందిన మురళీ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..సర్వే నెంబర్ 1878 లోని భూమి ఎన్నో ఏళ్లుగా ఉమ్మడిగా గ్రామస్తులందరికీ ఉపయోగపడుతోంది. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో పశువులు తిరగడానికి, కాపరులకు, గ్రామంలోని యువకులకు క్రీడా స్థలంగా ఈ ప్రదేశం ఎంతో ఉపయోగకరంగా ఉంది. గతంలో అంటే 1986వ సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఇదే సర్వే నెంబర్ నందు గ్రామానికి చెందిన 56 మంది నిరుపేదలకు 0.03 సెంట్ల చొప్పున ఇళ్ల స్థల పట్టాలను కూడా ప్రభుత్వం పంపిణీ చేసింది. అయితే, కొందరు అక్రమార్కులు రెవిన్యూ అధికారుల అండతో ఆనాటి ఇళ్ల స్థలాల పట్టాలకు సంబంధించిన అసలు ఫైలును మాయం చేశారు. ఆ స్థానంలో చట్టవిరుద్ధంగా నకిలీ పాస్ పుస్తకాలను సృష్టించి, రికార్డులు పుట్టించి ఆన్లైన్ లో కూడా నమోదు చేయించుకున్నారు. ఆ దొంగ పత్రాల ఆధారంగా ఇటీవల కాలంలో కొందరు అక్రమార్కులు ఆ భూమిలోకి చొరబడి ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కావున వారిపై చర్యలు తీసుకోని ప్రభుత్వ భూమిని కాపాడలని కోరాడు.
తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలం చిక్కాల గ్రామానికి చెందిన రంతు శ్రీనివాసరావు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తమ గ్రామంలో సర్వే నెంబర్ 369/1 నందు పూర్వీకుల నుండి సంక్రమించిన పిత్రార్జిత వ్యవసాయ భూమి మొత్తం 6.18 సెంట్లు కలదు. అందులో తండ్రి తోబుట్టువైన దండుబోయిన గంగారత్నానికి వివాహ సమయంలో పసుపు-కుంకుమ కింద ఒక ఎకరం భూమిని ఇచ్చారు. మిగిలిన 5.18 సెంట్లు భూమిని తల్లిదండ్రులు, నలుగురు తోబుట్టువులుసమానంగా పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల ఆలనాపాలనా, వైద్య ఖర్చులు చూసుకునే వారికి వారి వాటాను ఇచ్చేలా కుటుంబంలో ఒప్పందం జరిగింది. ఎప్పటిలాగే తన పిత్రార్జిత భూమిలో వ్యవసాయం చేసుకుంటుండగా, సుమారు రెండు నెలల క్రితం రంగారెడ్డి జిల్లా (హైదరాబాద్) వాస్తవ్యుడైన నారిన శ్రీనివాసరావు అనే వ్యక్తి కొందరు అనుచరులతో కలిసి సదరు భూమి వద్దకు వచ్చారు.
ఈ భూమి తనదంటూ, సర్వే చేయించుకోవడానికి వచ్చానని చెబుతూ తనను భూమి ఖాళీ చేయాల్సిందిగా బెదిరించారు. అంతేకాకుండా 20-11-2014 తేదీన జరిగినట్లు ఉన్న ఒక క్రయ దస్తావేజు నకలును చూపించి, అందులో 2.18 సెంట్ల భూమిని తాను కొనుగోలు చేసినట్లు చెప్పాడు. తమ ప్రమేయం లేకుండా, అసలు యజమానులకు తెలియకుండా ఈ భూమిని మీకు ఎవరు అమ్మారని ప్రశ్నించగా, వచ్చిన వ్యక్తులు సమాధానం చెప్పకుండా వెనుతిరిగి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నిడదవోలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి సదరు దస్తావేజు నకలును తీసుకొని పరిశీలించగా, అది పూర్తిగా ఫోర్జరీ, తప్పుడు పత్రాలతో జరిగిన దొంగ రిజిస్ట్రేషన్ అని తేలింది. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.
శ్రీకాకుళం జిల్లా పొందూరుకు చెందిన మారం బాలకృష్ణ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తండ్రి గారైన మారం రామమూర్తి (లేట్) ఒక స్వాతంత్ర్య సమరయోధుడు. ఆయన దేశ సేవను గుర్తిస్తూ గత 1963వ సంవత్సరంలో ప్రభుత్వం ఆయనకి 5 ఎకరాల వ్యవసాయ భూమిని పట్టాగా మంజూరు చేసింది. ఈ భూమి పాత సర్వే నెంబర్ 246/2 (ఖాతా నెంబర్: 104) లో ఉండేది. అయితే సదరు భూమిని రీ-సర్వే పేరుతో 361/1 గా సర్వే నెంబర్ మార్చి, అక్రమంగా వేరే రైతుల పేరిట ఆన్లైన్ లో నమోదు చేశారు. తమ తండ్రి గారు ఆ భూమిని ఎవరికీ అమ్మకపోయినా, అమ్మేసినట్లు తప్పుడు పత్రాలు సృష్టించారు. విచారణలో భాగంగా అధికారులు తనను వివరణ అడగగా.. సదరు ఒరిజినల్ పట్టా పత్రాలు గతంలో జరిగిన ప్రమాదంలో కాలిపోయాయని, అయితే ఆ భూమి తమదే అనడానికి అన్ని రకాల రికార్డులు, ఆధారాలు ఉన్నాయని అధికారులకు స్పష్టం చేశారు. కానీ అధికారులు మాత్రం పట్టా కాపీ లేదనే సాకుతో అది తప్పుడు అర్జీ అని కొట్టిపారేస్తున్నారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.
శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నంకు చెందిన చెన్నకృష్ణ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తమ గ్రామంలో ఉన్న శ్రీ బసవేశ్వరస్వామి దేవస్థానమునకు సర్వే నెంబర్లు 144, 1297, 1322, 1399, 1408, 32, 1308 పరిధిలో దాదాపు 13.72 సెంట్ల స్థలము ఉంది. రెవెన్యూ రికార్డులలో (అడంగల్/ఆర్వోఆర్) కూడా ఈ భూములు దేవస్థానానికి చెందినవిగానే నమోదై ఉన్నాయి. దేవస్థానానికి చెందిన ఈ భూములపై తమకు హక్కు ఉందంటూ కొంతమంది స్థానిక రైతులు కోర్టు నోటీసులు పంపడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది. ఈ విషయమై వాస్తవాలు తెలుసుకునేందుకుసత్యసాయి జిల్లా దేవాదాయ శాఖ, రెవెన్యూ అధికారులను ఎన్నిసార్లు సంప్రదించినా, వారిలో ఎలాంటి చలనం లేదు. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఈ భూములు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి? ప్రస్తుతం ఎవరి పేరున నమోదై ఉన్నాయి? అనే పూర్తి వివరాలను రికార్డుపూర్వకంగా తమకు తెలియజేయాలని కోరాడు.
పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం జాలాది గ్రామానికి చెందిన యాకోబు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తాను అత్యంత పేదరికంలో మట్టి గోడలు, రేకుల ఇండ్ల మధ్య నివాసముంటున్నానని, తనకు ఎలాంటి సొంత ఆస్తి లేదు. అయితే, ఇటీవల గ్రామ సచివాలయ సిబ్బందిని సంప్రదించగా, ప్రభుత్వ రికార్డుల ప్రకారం తన ఆధార్ నెంబరుకు 33 ఎకరాల 40 సెంట్ల భూమి ఉన్నట్లు చూపిస్తోందని చెప్పడంతో షాక్కు గురయ్యాను. ఈ సాంకేతిక పొరపాటు (భూమి రికార్డులకు ఆధార్ తప్పుగా లింక్ అవ్వడం) కారణంగా తనకు రావలసిన వృద్ధాప్య పెన్షన్ నిలిచిపోయిందని, ఇతర సంక్షేమ పథకాలకు కూడా తీవ్ర ఆటంకంగా మారింది. కావున తమయందు దయవుంచి తనకు ఎలాంటి సంబంధం లేని ఆ 33 ఎకరాల భూమి రికార్డులను, ఎల్పీఎమ్ లింకులను తన ఆధార్ నెంబర్ నుండి తక్షణమే తొలగించాలని కోరాడు.
మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం రాజంపల్లి గ్రామానికి చెందిన రామారావు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. సర్వే నెంబర్ 591/1 (3.06 సెంట్లు), 579/2 (3.12 సెంట్లు), 594/3 (2.06 సెంట్లు) పరిధిలోని ప్రభుత్వ భూములలో 1998వ సంవత్సరంలో పశువుల తాగునీటి కోసం ఒక కుంటను నిర్మించారు. పూర్తిగా ప్రభుత్వానికి చెందిన ఈ భూములను అదే గ్రామానికి చెందిన చిలకా ఇస్రాయిల్ అనే వ్యక్తి కొంతమంది రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై ఆక్రమించుకున్నారు. సదరు నిందితుడు చర్చి పాస్టర్గా వ్యవహరిస్తూ, మతమార్పిడి నిబంధనల ప్రకారం బిసి-సి వర్గానికి చెందినవాడైనప్పటికీ, అధికారికంగా ఎస్సీ (SC-మాదిగ) సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా చలామణి అవుతున్నారు. ఈ నకిలీ కుల ధృవీకరణను అడ్డం పెట్టుకుని ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందడమే కాకుండా, ఎస్సీ కోటా కింద ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు కూడా నిజా నిజాలు పరిశీలించకుండా ప్రభుత్వ భూములను అతనికి అన్యాక్రాంతం చేస్తున్నారు. కావున వారిపై చర్యలు తీసుకోని ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని కోరాడు.
వీటితో పాటు పలువురు పింఛన్, రేషన్, ఇళ్ల నిర్మాణాల సమస్యలపై అర్జీలు ఇచ్చి పరిష్కరించాలని కోరగా.. మరికొందరు ఉద్యోగాల కోసం రెస్యూమ్ లు ఇచ్చారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం ఆర్ధికతోడ్పాటు కల్పించాలని మరికొందరు అభ్యర్థనలు అందించారు.