ఆ ఎన్నారైల సమస్యకు పరిష్కారం చూపిన ముఖ్యమంత్రి.. హ్యాపీ హ్యాపీ!

Chandra Babu Naidu
Chandra Babu Naidu

అమరావతి: ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు సాగుతున్నారు. ప్రజల సంక్షేమమే పాలకుల నిజమైన విజయమని భావించే సీఎం.. వివిధ వర్గాల ప్రజలను నేరుగా కలిసి వారి అభిప్రాయాలు, సూచనలు తెలుసుకుంటున్నారు.

రాష్ట్ర అభివృద్ధిలో ఎన్నారైల పాత్ర కూడా కీలకమని భావిస్తూ ముఖ్యమంత్రి వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జూన్ 29న అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఎన్నారై టీడీపీ సెల్ కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్ ఆధ్వర్యంలో ఒమన్, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలెండ్ నుండి వచ్చిన పలువురు ఎన్నారైలు సీఎం చంద్రబాబును కలిశారు.

ఈ సమావేశంలో అమెరికా నుండి పాలేపు సురేష్, కెనడా నుండి హరి కృష్ణ రెడ్డి, ఒమన్ నుండి సత్య శ్రీధర్, బొంతు వెంకటేశ్వర్లు, అనిల్ నాగిడి, ఆస్ట్రేలియా నుండి వీర కోటేశ్వరరావు, న్యూజిలెండ్ నుండి శరణ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కెనడాలో తెలుగు సమాజం ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలకు హరి కృష్ణ రెడ్డి సీఎం చంద్రబాబును ఆహ్వానించారు. కెనడాలో తెలుగు వారు కలిసి జరుపుకునే పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాల గురించి  సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకొని ఇలాగే ఎన్నో వేడుకలు జరుపుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

అలాగే ఒమన్లో తెలుగు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలపై సీఎం ఎన్నారైలతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. ఇబ్బందుల్లో ఉన్న తెలుగు వారికి అవసరమైన సహాయం అందేలా చూడాలని ఎన్నారై టీడీపీ కోఆర్డినేటర్ చప్పిడి రాజ శేఖర్ కు సూచించారు.

రాష్ట్ర అభివృద్ధికి విదేశాల్లో ఉన్న తెలుగువారి సహకారం ఎంతో ముఖ్యమని సీఎం పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఎన్నారైల సమస్యలు, సూచనలను దృష్టిలో ఉంచుకొని అవసరమైన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు తెలిపారు అని ఎన్నారైలు వెల్లడించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఇంత సన్నిహితంగా మాట్లాడే అవకాశం రావడం తమ జీవితంలో మరచిపోలేని అనుభూతి అని ఎన్నారైలు ఆనందం వ్యక్తం చేశారు. తమ సమస్యలను స్వయంగా విన్నందుకు సీఎం గారికి హాజరైన ఎన్నారైలు కృతజ్ఞతలు తెలిపారు.

Tags

Be the first to react

Latest