తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆధార్ కేంద్రాల ఆపరేటర్లను రాత్రి వేళల్లో వచ్చే అనుమానాస్పద ఈమెయిల్ సందేశాలు కుదిపేస్తున్నాయి. అర్ధరాత్రి తర్వాత వారి లాగిన్ ఐడీలను ఉపయోగించి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పలు సార్లు లాగిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆపరేటర్లు చెబుతున్నారు. ఒక్క రాత్రిలోనే 20 నుంచి 100 వరకు ఈమెయిల్ నోటిఫికేషన్లు రావడం వారిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ పరిస్థితులు నిజామాబాద్, హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, మెదక్, నాగర్ కర్నూల్ వంటి జిల్లాల్లో చోటు చేసుకుంటున్నాయి. మరికొందరి అకౌంట్లలో విజయవంతమైన లాగిన్ ప్రయత్నాలు నమోదవడంతో హ్యాకింగ్ భయాలు మరింత పెరుగుతున్నాయి.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆధార్ కార్డులు బ్యాంక్ ఖాతాల నుంచి సబ్సిడీ సదుపాయాల దాకా అనుసంధానం చేయబడ్డాయి. ఈ నేపథ్యంలో ఆధార్ ఆపరేటర్ల ఐడీలు హ్యాక్ అవుతాయనే అనుమానంతో వారు భయాందోళనలో ఉన్నారు. “మా లాగిన్ ఐడీలను వేరే రాష్ట్రాల వారు ఉపయోగించి ఫేక్ ఆధార్ కార్డులు జారీ చేస్తే మేమే బాధ్యత వహించాల్సి వస్తుంది” అని కొందరు ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదులు లేదా నేరగాళ్లు ఫేక్ ఐడీలతో ఆధార్ పొందే అవకాశం కూడా ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ అలా జరిగితే తమపై కేసులు నమోదయ్యే ప్రమాదముందని వారు చెబుతున్నారు.
హైదరాబాద్‌లోని ముఖేశ్ అనే ఆపరేటర్ లాగిన్‌ను కేవలం ఆరు రోజుల వ్యవధిలో 200 సార్లు ఓపెన్ చేయడానికి ప్రయత్నాలు జరిగినట్లు మెయిల్స్ వచ్చాయి. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని శ్రీకాంత్‌కు ప్రతి రోజు 30కి పైగా సందేశాలు వస్తుండగా, జోగులాంబ గద్వాల జిల్లాలోని మల్దకల్ మండలానికి చెందిన సిద్దుకు ఒక్క రాత్రిలోనే 31 సందేశాలు వచ్చాయని తెలిపారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల ఆపరేటర్ జాగం శ్రీనివాసుకు రెండు వారాలుగా ఈ తరహా మెయిల్స్ వస్తున్నాయని సమాచారం. ఈ ఘటనలు యాదృచ్ఛికమా లేక సైబర్ నేరాల భాగమా అన్నది తెలియడం లేదు.
ఆపరేటర్లు యుఐడీఏఐ అధికారులకు, మీసేవ కమిషనర్‌కి పలు మార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి పరిష్కారం కనిపించలేదని వారు ఆరోపిస్తున్నారు. “ఇది కేవలం టెక్నికల్ ఎర్రర్ కాదు, సైబర్ భద్రతా లోపం కావచ్చని అనుమానం” అని కొందరు చెబుతున్నారు. ఆధార్ సెంటర్ల భద్రతను కాపాడేందుకు యుఐడీఏఐ తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇంతవరకు చర్యలు లేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆపరేటర్లలో ఆందోళన పెరిగిపోతోంది.