ప్రపంచంలోనే అతి పొడవైన రైలు ప్రయాణంగా పరిగణించబడే ఈ ప్రత్యేక రైలు మాస్కో నుండి ఉత్తర కొరియాలోని ప్యాంగ్యాంగ్ వరకు ప్రయాణిస్తుంది. మొత్తం ప్రయాణ సమయం దాదాపు ఎనిమిది రోజులు. ప్రయాణ దూరం సుమారు 10,000 కిలోమీటర్లకు పైగా ఉంటుంది. ఈ అత్యంత అరుదైన ప్రయాణానికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రత్యేక గుర్తింపునూ ఇచ్చింది.
ఈ ప్రయాణం కేవలం పొడవైనదిగానే కాదు, అత్యంత సాహసకరమైన మార్గం కూడా. మంచుతో కప్పుకున్న పర్వతాలు, వెడల్పాటి మైదానాలు, అడవులు, చిన్న గ్రామాలు—ఇవి అన్నీ రైల్వే మార్గంలో కనిపించే ప్రత్యేక దృశ్యాలు. రష్యా నుంచి బయలుదేరిన ఈ రైలు ప్రపంచంలో అత్యంత మూసబడిన దేశంగా పేరుగాంచిన ఉత్తర కొరియా ప్రాంతాల్లోకి ప్రవేశించటం ఈ ప్రయాణాన్ని ఇంకా ఆసక్తికరంగా మారుస్తుంది.
ఈ ప్రయాణంలో ప్రధాన భాగం ట్రాన్స్–సైబీరియన్ రైల్వేపై జరుగుతుంది. ఇది ప్రపంచంలోనే పొడవైన రైల్వే మార్గాలలో ఒకటి. మాస్కో నుండి వ్లాడివొస్టక్ వరకు ఈ లైన్ సాగుతుంది. అక్కడికి చేరిన తర్వాత ప్రత్యేక ఉత్తర కొరియా బోగీని మరో రైలునకు జత చేస్తారు. కోవిడ్–19 తర్వాత నిలిచిపోయిన ఈ సర్వీస్, রష్యా–ఉత్తర కొరియా సంబంధాలు మెరుగుపడడంతో మళ్లీ ప్రారంభమైంది.
ఎనిమిది రోజుల ప్రయాణంలో ప్రయాణికులు ఎదుర్కొన్న అనుభవాలు ఒకరకంగా అడ్వెంచర్‌లాంటివి. కొన్ని సందర్భాల్లో బోగీల్లో హీట్ సిస్టమ్ పనిచేయకపోవడం, ఆహారం పరంగా తక్కువ సౌకర్యాలు ఉండటం వంటి సమస్యలు ఎదురయ్యాయి. బోగీలో ఎక్కువగా మరిగించే కేత్లీ మాత్రమే అందుబాటులో ఉండటంతో టీ, కాఫీ, నూడుల్స్ వంటి తేలికపాటి ఆహారమే ప్రధానంగా అందేవి.
ఈ రైలు చివరకు చేరే ఉత్తర కొరియా ప్రపంచంలో అత్యంత రహస్యంగా మరియు కఠిన నియంత్రణలో నడిచే దేశాల్లో ఒకటి. ప్రజల జీవితాలు ప్రభుత్వం నియంత్రణలో నడుస్తాయి, విదేశీ సమాచారంపై తీవ్ర ఆంక్షలు ఉంటాయి. ఈ నేపథ్యంలో మాస్కో–ప్యాంగ్యాంగ్ రైలు ప్రయాణం కేవలం అతి పొడవైన ప్రయాణమే కాకుండా, ఉద్వేగం, రహస్యత, సాహసం కలగలిపిన ఒక ప్రత్యేక అనుభవంగా నిలుస్తుంది.