ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పెట్టుబడిదారులకు అత్యంత అనుకూల గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తైవాన్ ప్రతినిధి బృందానికి స్పష్టం చేశారు. తైవాన్ కంపెనీలు వివిధ రంగాల్లో ఏపీలో పెట్టుబడులు పెట్టేలా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా భారత్‌లో తైపీ ఎకనామిక్ అండ్ కల్చర్ సెంటర్ ప్రతినిధి ముమిన్ చెన్ నేతృత్వంలోని బృందం సీఎం చంద్రబాబుతో భేటీ అయింది.
తైవాన్ పెట్టుబడిదారులకు ఏపీ అందించే అవకాశాలను వివరించిన సీఎం, నైపుణ్యంతో కూడిన మానవ వనరులు, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, పరిశ్రమల కారిడార్ల అభివృద్ధి వంటి అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలోని కుప్పం, ఓర్వకల్లు, శ్రీకాళహస్తి ప్రాంతాలను ఇండస్ట్రీయల్ హబ్‌లుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
తైవాన్ కంపెనీలు ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, బ్యాటరీ ఉత్పత్తి రంగాల్లో ఏపీతో భాగస్వామ్యం చేయాలని సీఎం ఆహ్వానించారు. అలీజియన్స్ గ్రూప్ రూ.400 కోట్ల పెట్టుబడితో కుప్పంలో ఇండో-తైవాన్ పారిశ్రామిక పార్క్ ఏర్పాటుకు ముందుకు వస్తోందని, పౌ చెన్ గ్రూప్ ఫుట్‌వేర్ యూనిట్‌ను కుప్పంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని తెలిపారు. ఓర్వకల్లులో క్రియేటివ్ సెన్సార్ ఇంక్ ఇమేజ్ సెన్సార్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపగా, ఇ-జౌల్ ఇండియా 2.2 బిలియన్ డాలర్ల పెట్టుబడితో 23 గిగావాట్ల సామర్థ్యంతో అడ్వాన్స్‌డ్ బ్యాటరీ ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధమైందని చెప్పారు.
ఈ ప్రాజెక్టులకు సంబంధించి సీఎం సమక్షంలో తైవాన్ కంపెనీలు, ఏపీ ఈడీబీతో ఒప్పందాలపై సంతకాలు చేశారు. తైవాన్ కంపెనీల పారిశ్రామిక పార్కులకు భూములు, రోడ్లు, మౌలిక వసతులు కేటాయించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం హామీ ఇచ్చారు. కేంద్రం త్వరలో సెమీకండక్టర్ మిషన్ పాలసీ కింద ప్రోత్సాహకాలను ప్రకటిస్తుందని ఆయన తెలిపారు. అలాగే తైవాన్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఏపీలో ఏర్పాటు చేయాలని కోరారు. ఏపీ ప్రభుత్వం పరిశ్రమలకు అందిస్తున్న సహకారం అత్యంత సంతృప్తికరమని తైవాన్ ప్రతినిధి బృందం ప్రశంసించింది.
ఇక, విశాఖలో జరిగిన పెట్టుబడి సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటలీ రాయబారి ఆంటోనియో ఎన్రికో బార్టోలీతో కూడా సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఆటోమోటివ్, యంత్రాల తయారీ, ఫ్యాషన్, ఆహార శుద్ధి, పునరుత్పాదక విద్యుత్ రంగాల్లో పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు. ఏపీలో ఇటాలియన్ ఇండస్ట్రీయల్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు ఇద్దరూ అంగీకరించారు. ఇటాలియన్ కంపెనీలు వ్యవసాయ యంత్రాలు, నౌకా నిర్మాణం, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులు పెట్టేలా సీఎం ఆహ్వానించారు.
ఆంధ్రప్రదేశ్‌ను దక్షిణ భారత పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దడంలో సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. తైవాన్, ఇటలీ వంటి దేశాలు ఏపీతో భాగస్వామ్యం చేయడం, భవిష్యత్తులో రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కొత్త దశను ప్రారంభించనుంది.