కృత్రిమ మేధస్సు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలపై ప్రభావం చూపుతుందన్న ఆందోళనలు పెరుగుతున్నాయి. అయితే గార్ట్నర్ తాజాగా విడుదల చేసిన నివేదిక ఈ భయాలకు భిన్నమైన దృక్కోణం చూపించింది. Kochiలో జరిగిన Gartner IT Symposium/Xpo–2025లో వెల్లడించిన వివరాల ప్రకారం, 2027 నాటికి AI ఉద్యోగాలను తగ్గించడం కంటే మరింతగా కొత్త అవకాశాలను సృష్టించే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు.
ఈ రిపోర్ట్ ప్రకారం తక్కువ క్లిష్టత గల, పునరావృత పనులను AI వేగంగా స్వీకరించినప్పటికీ, అదే సమయంలో కొత్త రోల్స్, కొత్త నైపుణ్యాల అవసరాలను ప్రపంచ మార్కెట్లో పెంచబోతోంది. ముఖ్యంగా IT రంగంలో 2030 నాటికి ఏ పని పూర్తిగా మనుషుల చేత జరుగదని, 75 శాతం పనులు AI–మనుషుల కలయికలో జరిగి, మిగిలిన 25 శాతం AI పూర్తిగా నిర్వహించబోతుందని గార్ట్నర్ సమీక్షలో వెల్లడైంది.
గార్ట్నర్ విశ్లేషకులు పేర్కొన్న మరో కీలక అంశం “హ్యూమన్ రెడీనెస్”. AI ఎంత వేగంగా అభివృద్ధి చెందినా, దానితో కలిసి పనిచేసే పనివర్గం సరిగ్గా సిద్ధపడకపోతే కంపెనీలకు నష్టాలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. సాధారణ డేటా ప్రాసెసింగ్, టెక్స్ట్ సారాంశాలు వంటి పనులు AI చేతుల్లోకి వెళ్లిపోతుండగా, క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లం సాల్వింగ్, AI మోడల్ గైడెన్స్ వంటి నైపుణ్యాలు భవిష్యత్తులో అత్యంత కీలకమవుతాయని తెలిపారు.
అయితే AI వల్ల ఉద్యోగాలు కోతకు గురవుతాయన్న భయం కంపెనీలు వెంటనే అంగీకరించాల్సిన అవసరం లేదని గార్ట్నర్ నిపుణులు సూచిస్తున్నారు. తొలగింపుల బదులు రొటీన్ రోల్స్‌లో కొత్త నియామకాలను తగ్గించి, ఉన్న ఉద్యోగులను AI ఆధారిత కొత్త విభాగాల్లో రీ-స్కిల్లింగ్ చేసి మార్చడం మరింత మేలనని వారు సిఫారసు చేశారు. ఈ విధానం కంపెనీల ఉత్పాదకతను పెంచడమే కాకుండా, AI వల్ల వచ్చే దీర్ఘకాలిక లాభాలను అందుకోవడంలో సహాయపడుతుందని అభిప్రాయపడ్డారు.
ఇక పెట్టుబడుల విషయానికి వస్తే, ప్రస్తుతం 74 శాతం CIOలు AI ప్రాజెక్టులు లాభాల కంటే ఎక్కువ ఖర్చులు తెస్తున్నాయని అంగీకరించారు. ముఖ్యంగా మోడల్‌ల ట్రైనింగ్, ఉద్యోగుల నైపుణ్యాభివృద్ధి, డేటా నిర్వహణ వంటి అంశాలు అధిక వ్యయాలకు దారితీస్తున్నాయని తెలిపారు. అయినప్పటికీ AIలో పెట్టుబడులు తగ్గకూడదని, దీన్ని భవిష్యత్తు ఉద్యోగ మార్కెట్‌ను మార్చే పెద్ద శక్తిగా తీసుకోవాలని రిపోర్ట్ సూచిస్తోంది.