కేంద్ర ప్రభుత్వం, టెలికాం సంస్థలు వేగంగా డిజిటల్ ఇండియాకి దూసుకుపోతున్నప్పటికీ… దేశంలో ఇంకా వేలాది గ్రామాలు మొబైల్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నాయంటే ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. తాజా గణాంకాల ప్రకారం 2024 సెప్టెంబర్ నాటికి భారత్‌లో 21,000కి పైగా గ్రామాలకు ఇప్పటికీ మొబైల్ కనెక్టివిటీ అందలేదు. అంటే ఆ గ్రామాల్లో కాల్స్ చేయడం, ఇంటర్నెట్ వాడటం, అత్యవసర పరిస్థితుల్లో సమాచారం ఇవ్వడం వంటి ప్రాథమిక సౌకర్యాలన్నీ కూడా అందుబాటులో లేవన్న మాట. ఈ పరిస్థితి డిజిటల్ యుగంలో ఎంత పెద్ద లోటో అర్థం చేసుకోవచ్చు.
ఇటీవల లద్దాఖ్‌లోని మారుమూల గ్రామాలైన మాన్, మెరాక్ ప్రాంతాల్లో ఎయిర్‌టెల్ మొబైల్ సేవలను ప్రారంభించిన విషయం ప్రస్తావనీయమే. ఈ గ్రామాలు పర్వతాల మధ్య, వాతావరణ పరిస్థితులు తీవ్రంగా ఉండే ప్రాంతాల్లో ఉన్నాయి. ఇలాంటి ప్రాంతాల్లో నెట్‌వర్క్ టవర్లు నిర్మించడం చాలా క్లిష్టమైన పని. ప్రత్యేక పరికరాలు, సాంకేతిక నైపుణ్యం, భారీ వ్యయం అవసరం. అయినప్పటికీ అక్కడివాళ్లకు కనెక్టివిటీ అందించేందుకు ఆపరేటర్లు ముందుకు రావడం మంచి అభివృద్ధి సంకేతం. లడ్డాఖ్ పర్యాటక ప్రాంతం కావడంతో అక్కడ మొబైల్ సేవల కొరత పర్యాటకులకు కూడా ఇబ్బందులు కలిగించేది. కొత్తగా వచ్చిన సేవలతో కొంత ఉపశమనం లభించింది.
అయితే దేశంలో మొబైల్ నెట్‌వర్క్ అత్యల్పంగా ఉన్న రాష్ట్రాల్లో ఒడిశా అగ్రస్థానంలో ఉంది. అక్కడే దాదాపు 6,000 గ్రామాల్లో ఇప్పటికీ మొబైల్ సేవలు పనిచేయడం లేదు. దానికి ప్రధాన కారణాలు దట్టమైన అడవులు, పర్వతాలు, లోతైన లోయలు. ఇలాంటి ప్రాంతాల్లో టవర్లు ఏర్పాటు చేయడమే కాక, వాటికి అవసరమైన విద్యుత్, ఫైబర్ కనెక్షన్, భద్రత వంటి అంశాలు కూడా పెద్ద సవాల్ అవుతున్నాయి.
ఇక మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, నార్త్-ఈస్ట్రన్ స్టేట్స్‌లోనూ పరిస్థితి అంతే. ఎన్నో గ్రామాలు ఇప్పటికీ టెక్నాలజీకి దూరంగానే ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికే ‘యూనివర్సల్ సర్వీస్ అబ్లిగేషన్ ఫండ్’ (USOF) ద్వారా వేలాది టవర్లు ఏర్పాటు చేసే పనిలో ఉన్నప్పటికీ, భౌగోళిక పరిస్థితులు, అటవీ ప్రాంతాల చట్ట పరిమితులు, మావోయిస్టు ప్రభావం వంటి కారణాలతో కొన్ని ప్రాజెక్టులు స్లోగానే సాగుతున్నాయి.
మొబైల్ కనెక్టివిటీ లేకపోవడం వల్ల ఆ గ్రామాల ప్రజలు విద్య, ఆరోగ్యం, అత్యవసర సేవలు, డిజిటల్ పేమెంట్లు, ఆన్‌లైన్ గవర్నమెంట్ సేవలన్నింటినీ కోల్పోతున్నారు. ఈ డిజిటల్ గ్యాప్ తొలగకపోతే దేశం మొత్తం సమానంగా అభివృద్ధి చెందడం కష్టం.
భారతదేశం 5జీ, 6జీ వైపు సాగుతున్నా… ఈ 21 వేల గ్రామాలకు కనీస మొబైల్ సిగ్నల్ అందించే వరకు నిజమైన డిజిటల్ ఇండియా పూర్తి కాదు. ప్రభుత్వం, టెలికాం కంపెనీలు, స్థానిక పరిపాలన కలిసి పనిచేస్తేనే ఈ లోటు నిండుతుంది. ఇలాంటి పరిస్థితిలో లద్దాఖ్ గ్రామాల్లో ప్రారంభమైన సేవలు ఒక ఆశాజనక అడుగు మాత్రమే… ఇంకా దేశం మొత్తం కనెక్ట్ కావాలంటే పెద్ద ప్రయాణం మిగిలే ఉంది.