చిల్డ్రన్స్ డేను మనం పిల్లల ఆనందం వారి భవిష్యత్తు వారి అమాయకత్వాన్ని జరుపుకునే రోజుగా ప్రతి ఏడాది ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటాం. అయితే ఈ వేడుకల మధ్య పిల్లల ఆరోగ్యం మరియు భద్రత గురించి తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలి. చిన్నపిల్లలకి ప్రమాదాలు ఎక్కువగా ఇంటి వంటి సురక్షితంగా కనిపించే ప్రదేశాల్లోనే జరుగుతాయి. అందుకే పిల్లలను రక్షించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ప్రతి తల్లిదండ్రి మొదటి బాధ్యతగా మారుతోంది.
చిన్నపిల్లలలో కనబడే ముఖ్యమైన ఆరోగ్య ప్రమాదాల్లో ముందుగా గుర్తించాల్సింది అనుకోకుండా విషపూరిత పదార్థాలు మింగడం. రంగురంగుల డిటర్జెంట్ బాటిల్లు, మందుల కవర్లు, కిచెన్‌లో ఉండే క్లీనింగ్ కెమికల్స్ ఇవి చిన్నపిల్లలకు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అందుకే ఇలాంటి పదార్థాలను ఎత్తుగా ఉండే అల్మైరాల్లో లేదా పూర్తిగా తాళం వేసిన క్యాబినెట్లలో ఉంచాలి. పిల్లలు తెరవలేని ప్యాకేజింగ్‌ను తప్పనిసరిగా వాడాలి.
తరువాతి ప్రమాదం గొంతులో ఏదైనా ఇరుక్కోవడం లేదా ఊపిరాడకపోవడం. మూడు సంవత్సరాల లోపు పిల్లలు చిన్న వస్తువులను నోటికి తీసుకెళ్లడం సహజం. బొమ్మల చిన్న భాగాలు, గింజలు, ద్రాక్షపళ్లూ, కఠినమైన మిఠాయిలు ఇవి ప్రమాదకరం. పిల్లలకు ఇచ్చే ఏ వస్తువు టిష్యూ రోల్ అంచులోంచి లోపలికి వెళ్తుందా అని పరీక్షిస్తే అది వారికి సురక్షితం కాదన్న విషయం తెలుస్తుంది. అలాగే పిల్లలు భోజనం చేసే సమయంలో వారిపై పూర్తిగా దృష్టి పెట్టాలి. మంచంపై పడుకునే చిన్నపిల్లల దగ్గర దిండులు, దుప్పట్లు, సాఫ్ట్ టాయ్‌లు పెట్టకూడదు.
ఇంట్లో జరిగే మరో ప్రమాదం కాలిన గాయాలు. స్టౌవ్‌పై బయటకి ఉంచిన పాత్రల హ్యాండిళ్లు, వేడిగా ఉన్న టీ కప్పు, బాత్‌రూమ్‌లో అధిక వేడి నీరు ఇవి పిల్లలకి తీవ్రమైన గాయాలు కలిగించగలవు. వంట చేసే సమయంలో పిల్లలు కిచెన్‌లోకి రాకుండా గేట్లు పెట్టడం, పాత్రలను స్టౌవ్ వెనుక భాగంలో పెట్టడం, వేడి నీటిని జాగ్రత్తగా వాడడం చాలా ముఖ్యం.
ఈ ప్రత్యక్ష ప్రమాదాల కంటే కూడా ముఖ్యమైన లోటు తల్లిదండ్రుల్లో CPR (Cardiopulmonary Resuscitation) మరియు ఫస్ట్ ఎయిడ్ జ్ఞానం లేకపోవడం. పిల్లల్లో ఏ ప్రమాదం జరిగినా మొదట స్పందించాల్సింది తల్లిదండ్రులే. చిన్నపిల్లల గొంతులో వస్తువు ఇరుక్కోవడం, నీటిలో మునిగే ఘటనలు, అకస్మాత్తుగా ఊపిరి ఆడకపోవడం వంటి అత్యవసర సమయాల్లో CPR ప్రాణాలను రక్షించగలదు. కానీ మన దేశంలో ఇలాంటి శిక్షణను కొత్త తల్లిదండ్రులు తీసుకునే సంఖ్య చాలా తక్కువ. పట్టణాల్లో కూడా ఈ అవగాహన లోపం స్పష్టంగా కనిపిస్తుంది.
పిల్లల్లో అత్యవసర పరిస్థితులలో గొంతులో ఏదైనా ఇరుక్కోవడం, నీటిలో మునిగిపోవడం, హృదయం అకస్మాత్తుగా ఆగిపోవడం CPR పరిజ్ఞానం వెంటనే ప్రాణరక్షక చర్యగా మారుతుంది. ఇలాంటి పరిజ్ఞానం ఉన్న తల్లిదండ్రులు అత్యవసర సమయాల్లో ధైర్యంగా, స్థిరంగా స్పందించగలరు.
ఈ చిల్డ్రన్స్ డే సందర్భంగా పిల్లలకు బహుమతులు ఇవ్వడం ఎంత ముఖ్యమో, వారి భద్రత కోసం సిద్ధంగా ఉండడం అంతకంటే ముఖ్యము. ఇంటిని సేఫ్ చేయడం మాత్రమే కాదు, తల్లిదండ్రులే ఎమర్జెన్సీ పరిస్థితులకు సిద్ధంగా మారాలి. చిన్నపిల్లల CPR మరియు ఫస్ట్ ఎయిడ్ శిక్షణ తీసుకోవడం ద్వారా కేవలం కొద్ది గంటల్లోనే తల్లిదండ్రులు పిల్లలకు తొలి రక్షకులుగా మారగలరు.ఈ ప్రత్యేక రోజున మీ పిల్లలకు ఇచ్చే నిజమైన బహుమతివారిని రక్షించేందుకు మీరు తీసుకున్న సిద్ధత.