ఈ ఏడాది శీతాకాలం ప్రారంభం నుంచే తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చలి తీవ్రత ఊహించని విధంగా పెరిగింది. సాధారణంగా డిసెంబర్ నెలలో కనిపించే చలి ఇప్పుడు నవంబర్‌లోనే పలకరించింది. అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోతుండడంతో ప్రజలు ఉదయం, సాయంత్రం వేళల్లో గజగజ వణికిపోతున్నారు.
ఉదయం ఆలస్యంగా మంచు తెరలు వీడడం, రాత్రి వేళల్లో గడ్డకట్టే చలిగాలులు వీచడం సాధారణమైంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం, మరో నాలుగైదు రోజులు ఈ తీవ్రమైన చలి కొనసాగే అవకాశం ఉంది.
చలి తీవ్రత పెరుగుతున్న ఈ సమయంలో, వాతావరణ శాఖ మరో ముఖ్యమైన, ఆందోళన కలిగించే హెచ్చరిక జారీ చేసింది. రాబోయే రోజుల్లో ఈ చలిగాలులకు వర్షాలు కూడా తోడయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. వాతావరణంలో తేమ పెరిగి, చల్లని గాలికి వర్షపు జల్లులు తోడైతే, ప్రజలు మరింత ఇబ్బంది పడక తప్పదు. ఇది ఆరోగ్యపరంగానూ సవాళ్లను పెంచుతుంది.
నవంబర్ 17న అల్పపీడనం: వర్షాల మొదలు..
బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నవంబర్ 17వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడనుంది.
ఈ అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి. మొదట్లో చెదురుమదురు జల్లులే పడే అవకాశాలు ఉన్నప్పటికీ, ఈ వర్షాలకు చలిగాలులు తోడవడంతో వాతావరణం మరింత గంభీరంగా మారుతుంది.
ఈ అల్పపీడనం వేగంగా కదులుతూ బలపడి వాయుగుండంగా కూడా మారే సూచనలు ఉన్నాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. అదే జరిగితే, వర్షాలు మరింత జోరందుకునే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా నవంబర్ 17, 18 తేదీల్లో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఈ వాతావరణ మార్పుల కారణంగా దక్షిణ కోస్తాంధ్ర మరియు రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
నవంబర్ 17న మొదలయ్యే ఈ వాతావరణ మార్పులు అక్కడితో ఆగవని, రాబోయే రోజుల్లో మరో అల్పపీడనం కూడా ఏర్పడి వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అంచనా ప్రకారం, వర్షాలు నవంబర్ 17 నుండి డిసెంబర్ 7 వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
గతంలో 'మొంథా తుపాను' అనంతరం వర్షాలు ఆగి చలి పెరిగింది. ఇప్పుడు మళ్లీ వర్షాలు మొదలుకానుండడంతో రైతులు, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు అందుతున్నాయి.