అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లే విదేశీ విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది అనూహ్యంగా తగ్గుముఖం పట్టింది. ముఖ్యంగా భారత విద్యార్థుల అప్లికేషన్లు గణనీయంగా పడిపోవడం అంతర్జాతీయ విద్యా రంగంలో చర్చనీయాంశమైంది. సాధారణంగా ప్రతి సంవత్సరం భారీ సంఖ్యలో ఇండియా నుంచి విద్యార్థులు అమెరికాలోని యూనివర్సిటీలకు అప్లై చేస్తుంటారు. కానీ ఈసారి ట్రెండ్ పూర్తిగా మారింది.
నవంబర్ 1 వరకు నమోదు అయిన అప్లికేషన్ల ప్రకారం, మొత్తం విదేశీ అభ్యర్థుల దరఖాస్తులు 9 శాతం తగ్గాయి. అందులోనూ భారతీయ విద్యార్థుల అప్లికేషన్లు ఒక్కసారిగా 14 శాతం పడిపోయాయి. 2020 తర్వాత మొదటిసారి ఇంత పెద్ద తగ్గుదల నమోదు కావడం విద్యా నిపుణులను ఆశ్చర్యపరుస్తోంది.
ఇటీవలి నెలల్లో అమెరికా ప్రభుత్వం వీసా నిబంధనలు కఠినతరం చేయడం, ఇంటర్వ్యూలపై అదనపు పరిమితులు విధించడం, కొంతమంది విద్యార్థులను అరెస్ట్ చేయడం వంటి పరిణామాలు విదేశీ విద్యార్థుల్లో ఆందోళనను పెంచాయి. ట్రంప్ ప్రభుత్వ విధానాలు విశ్వవిద్యాలయాలపై ఒత్తిడి పెంచడంతో అనేక యూనివర్సిటీలు అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశాలపై జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
కొన్ని ప్రముఖ విశ్వవిద్యాలయాలపై ఫెడరల్ దర్యాప్తులు కూడా కొనసాగుతున్నాయి. ఈ కారణాలు విద్యార్థుల నిర్ణయాలపై స్పష్టమైన ప్రభావం చూపుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చైనా నుంచి అమెరికాకు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య కూడా స్వల్పంగా తగ్గింది. గతేడాది భారీగా పెరిగిన దరఖాస్తులు ఈసారి కేవలం 1 శాతం మాత్రమే తగ్గినా, మొత్తం అప్లికేషన్ ట్రెండ్ మాత్రం నెమ్మదించినట్టే కనిపిస్తోంది. ఆఫ్రికా, ఆసియా దేశాల నుంచీ వచ్చిన అప్లికేషన్లు కూడా గణనీయంగా పడిపోయాయి. మరోవైపు వియత్నాం, ఉజ్బెకిస్తాన్ వంటి కొన్ని దేశాలు మాత్రం స్వల్ప వృద్ధిని నమోదు చేశాయి.
అమెరికా యూనివర్సిటీల్లో అడ్మిషన్ ప్రాసెస్ మార్చి వరకు కొనసాగుతాయి. కానీ తొలి దశలోనే ఇలా దిగజారుతున్న సంఖ్యలు చూస్తుంటే, ఈ ఏడాది మొత్తం అప్లికేషన్ల సంఖ్య తగ్గే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఇదే సమయంలో స్టాండర్డైజ్డ్ టెస్ట్ స్కోర్లు సమర్పిస్తున్న విద్యార్థుల సంఖ్య 11 శాతం పెరగడం మరో ఆసక్తికర అంశం. కోవిడ్ సమయంలో అనేక యూనివర్సిటీలు SAT, ACT వంటి పరీక్షలను తప్పనిసరి నుంచి తొలగించగా, ఇప్పుడు వాటిని తిరిగి అమలు చేయించేందుకు వైట్ హౌస్ ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది.
అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య తగ్గడం అమెరికా విశ్వవిద్యాలయాలకు కూడా ఆర్థికపరంగా సమస్యలు తలెత్తించే ప్రమాదం ఉన్నదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే విదేశీ విద్యార్థులు సాధారణంగా పూర్తి ఫీజులు చెల్లించడం వల్ల యూనివర్సిటీలకు పెద్ద ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఆ సంఖ్య తగ్గితే ఆ ప్రభావం విద్యాసంస్థల నిధులపై పడే అవకాశం ఉంది.
మొత్తం మీద అమెరికాలో విదేశీ విద్యార్థుల దాఖలాలు తగ్గడంలో ప్రభుత్వ విధానాలు వీసా పరిమితులు, భద్రతా సంబంధిత చర్యలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా భారత విద్యార్థుల అప్లికేషన్లు ఇంత పెద్ద స్థాయిలో తగ్గడం విద్యా రంగానికి కొత్త సవాలుగా మారింది. ఈ పరిస్థితి రాబోయే నెలల్లో ఎలా మారుతుందో అన్ని దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.