దేశవ్యాప్తంగా రైల్వే ప్రయాణికులకు ఇకపై మరింత మెరుగైన ఆహార సేవలు అందే అవకాశం ఉంది. భారత రైల్వే స్టేషన్లలో ప్రముఖ అంతర్జాతీయ మరియు దేశీయ ఫుడ్ బ్రాండ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు చాయ్, సమోసా, చిన్న ఫుడ్ స్టాల్స్ వరకు మాత్రమే పరిమితమైన రైల్వే స్టేషన్లలో, త్వరలోనే మెక్‌డొనాల్డ్స్, కేఎఫ్‌సీ, బస్కిన్ రాబిన్స్ వంటి ప్రపంచ ప్రఖ్యాత రెస్టారెంట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నిర్ణయానికి సంబంధించి మార్గదర్శకాలు త్వరలో విడుదల కానున్నాయని రైల్వే వర్గాలు వెల్లడించాయి. దీంతో ప్రయాణికులు ఇప్పుడు రైల్వే స్టేషన్లలోనే బర్గర్, పిజ్జా, ఐస్‌క్రీమ్ వంటి ప్రీమియం ఆహారాలను సులభంగా ఆస్వాదించగలరు.
రైల్వే బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం ప్రీమియం బ్రాండ్ కేటరింగ్ సదుపాయాలను విస్తరించడమే లక్ష్యంగా ఉందని తెలుస్తోంది. ఈ కేటగిరీలో దేశవ్యాప్తంగా 1,200 రైల్వే స్టేషన్లలో అంతర్జాతీయ మరియు దేశీయ బ్రాండ్ ఔట్‌లెట్లను ఏర్పాటు చేసే అవకాశాన్ని కల్పించనుంది. ఇందులో మెక్‌డొనాల్డ్స్, కేఎఫ్‌సీ, బస్కిన్ రాబిన్స్ వంటి ఎంఎన్‌సీ బ్రాండ్లతో పాటు బికనీర్ వాలా, హల్దీరామ్స్ వంటి భారతీయ బ్రాండ్లకు కూడా అవకాశం ఇవ్వనున్నారు. ఇప్పటికే అమల్లో ఉన్న ఫుడ్ స్టాల్ నిబంధనలను ఈ కొత్త ఔట్‌లెట్లపైనా వర్తింపజేయాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. ఆక్షన్ పాలసీ ప్రకారం, ఈ ఔట్‌లెట్లను నేరుగా కంపెనీలు నిర్వహించవచ్చు లేదా ఫ్రాంచైజీలకు కూడా అవకాశం ఇవ్వవచ్చు.
ఈ ఆక్షన్ ప్రక్రియ పూర్తయ్యాక ఎంపికైన బ్రాండ్‌లు సంబంధిత రైల్వే స్టేషన్‌లో ఐదేళ్ల వరుకు ఔట్‌లెట్‌ను నిర్వహించేందుకు అనుమతులు పొందుతాయి. ఈ చర్య ద్వారా రైల్వే స్టేషన్లలో కేవలం చౌకభోజనాలే కాకుండా, ప్రపంచ స్థాయి ఆహార ఎంపికలు కూడా లభించనున్నాయి. ఇందువల్ల స్టేషన్లలో ఆహార నాణ్యత, పరిశుభ్రత, ప్రయాణికుల సేవల్లో మరింత మెరుగుదల సాద్యమవుతుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే అనేక స్టేషన్లలో ఫుడ్ జోన్‌లను ఆధునికీకరిస్తున్న రైల్వే శాఖ, ఇప్పుడు ఈ ప్రీమియం ఔట్‌లెట్లతో స్టేషన్ల వాతావరణాన్ని మరింత ఆధునికంగా మార్చనుంది.
ప్రత్యేకంగా నగరాల ప్రధాన రైల్వే స్టేషన్లలో ఈ ఔట్‌లెట్లను ఏర్పాటు చేయడం ద్వారా ప్రయాణికులకు వేగవంతమైన, శుభ్రమైన, ఉత్తమ నాణ్యత కలిగిన ఫుడ్ అందేలా రైల్వే శాఖ చర్యలు తీసుకుంటోంది. ఈ చర్య వల్ల రైల్వే ఆదాయాన్ని కూడా గణనీయంగా పెంచే అవకాశముందని నిపుణులు అంటున్నారు. ఫుడ్ బ్రాండ్ల ద్వారా వచ్చే రెవెన్యూ, రెంటల్ అమౌంట్, ఫ్రాంచైజీ ఫీజుల ద్వారా రైల్వే మరింత ఆర్థిక లాభం పొందనుంది. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా రైల్వే సేవలను ఆధునీకరించడంలో భాగంగా స్టేషన్లను ఫుడ్ కోర్టులు, రిటైల్ షాపులు, ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తోంది. ఈ నేపథ్యంలో మెక్‌డొనాల్డ్స్, కేఎఫ్‌సీ వంటి బ్రాండ్‌ల ప్రవేశం ప్రయాణికులకు మరింత మంచిని చేకూర్చనుంది.