ఆంధ్రప్రదేశ్‌లో వోల్ట్‌సన్ ల్యాబ్స్‌పై జరుగుతున్న ప్రచారం నేపథ్యంగా, రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న “భూములు, ప్రోత్సాహకాలు దక్కించుకోవడానికే వోల్ట్‌సన్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేశారు” అనే ఆరోపణలన్నీ నిజం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. వోల్ట్‌సన్ ల్యాబ్స్ ప్రముఖ ఆర్‌జే కార్ప్ గ్రూప్‌కు చెందిన సంస్థేనని, ఇది అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ట కలిగిన వ్యాపార సమూహమని ప్రభుత్వం వివరించింది. రాష్ట్రాన్ని పునర్నిర్మించే ప్రయత్నాలు జరుగుతుండగా, కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసమే తప్పుడు ప్రచారాలు చేస్తూ పెట్టుబడులను అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ కూడా స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది.
విశాఖపట్నంలో జరిగిన CII భాగస్వామ్య సదస్సు రాష్ట్రానికి చారిత్రకమైన పెట్టుబడులను తీసుకువచ్చిందని ప్రభుత్వం గుర్తుచేసింది. మొత్తం రూ. 13.25 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఒప్పందాలు కుదరడం దేశంలోనే తొలిసారి జరిగిందని పేర్కొంది. ఈ మహాసమ్మేళనం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నప్పటికీ, ఒక రాజకీయ పార్టీ మాత్రం తప్పుడు ప్రచారాలతో ప్రజల్లో గందరగోళం సృష్టిస్తోందని ప్రభుత్వం మండిపడింది. ముఖ్యంగా వోల్ట్‌సన్ ల్యాబ్స్‌పై తప్పుదారి పట్టించే సమాచారం పంచుకోవడం ద్వారా కంపెనీలలో, పెట్టుబడిదారుల్లో అపోహలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించింది. దీనిపై RJ Corp గ్రూప్ ప్రతిష్టను ప్రస్తావిస్తూ, ఇది భారత్ సహా UAE, థాయ్‌లాండ్, మొరాకో వంటి దేశాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థ అని స్పష్టం చేసింది.
ఆర్‌జే కార్ప్ గ్రూప్ ఆహార ప్రాసెసింగ్, హాస్పిటాలిటీ, విద్య, ఆరోగ్యం, రియల్ ఎస్టేట్, పెప్సీకో బాట్లింగ్ భాగస్వామ్యం, అలాగే కేఎఫ్‌సీ, పిజ్జాహట్, కాస్టా కాఫీ వంటి ప్రముఖ క్విక్ సర్వీస్ రెస్టారెంట్ బ్రాండ్లను నిర్వహించే రంగాల్లో విశ్వసనీయత కలిగిన సంస్థ అని ప్రభుత్వం వివరించింది. వరుణ్ బెవరేజెస్ లిమిటెడ్, దేవయాని ఇంటర్నేషనల్ లిమిటెడ్‌ల వంటి ప్రధాన కంపెనీలు కూడా ఇదే గ్రూప్‌కు చెందినవేనని గుర్తు చేసింది. అటువంటి క్రెడిబుల్ సంస్థ పునరుత్పాదక శక్తి రంగంలో అడుగుపెట్టడం రాష్ట్రానికి పెద్ద అవకాశమని ప్రభుత్వం వెల్లడించింది. తిరుపతి జిల్లాలోని నాయుడుపేటలో వోల్ట్‌సన్ ల్యాబ్స్ రూ.1,743 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ సౌర సెల్, మాడ్యూల్ తయారీ యూనిట్ స్థాపించడానికి సిద్ధమైంది.
ఈ మేరకు నవంబర్ 2025లో జారీ చేసిన G.O. Ms. No. 222 ప్రకారం సంస్థకు 37 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. 2 GW సమగ్ర సౌర తయారీ ఎకోసిస్టమ్‌ను రెండు దశల్లో అభివృద్ధి చేయనుంది. ప్రతి దశలో 1 GW సౌర సెల్ సామర్థ్యం, 1 GW మాడ్యూల్ సామర్థ్యంతో, అత్యాధునిక TOPCon మోనోక్రిస్టలైన్, బైఫేషియల్ టెక్నాలజీని వినియోగించనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యక్షంగా 415 ఉద్యోగాలు వస్తాయి. 40 MW విద్యుత్ సరఫరా, 3 MLD నీరు, అలాగే క్యాప్టివ్ సౌర ప్లాంట్‌కు అవసరమైన మౌలిక సదుపాయాలను కూడా ప్రభుత్వం అందించనుంది. పునరుత్పాదక శక్తి రంగం దేశానికి భవిష్యత్తు అయిన ఈ సమయంలో అబద్ధపు ప్రచారాలతో అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలను ప్రజలు నమ్మవద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.