iBomma వ్యవస్థాపకుడు ఇమ్మడి రవి జీవితం బయటకు వస్తున్న కొద్దీ, అతని వ్యక్తిగత ప్రయాణంలో దాగి ఉన్న చేదు నిజాలు వెలుగుచూస్తున్నాయి. పైరసీ వెబ్‌సైట్‌ను నడిపి కోట్ల రూపాయలు సంపాదించిన రవి కథ వెనుక, ఇంట్లో ఎదురైన అవమానాలు, నిరాశలు, భావోద్వేగ కుంగుబాటు ఉన్నాయి. పోలీసులు చేసిన విచారణలో అతని వ్యక్తిగత జీవితం గురించి పలు షాకింగ్ అంశాలు బయటపడ్డాయి. ఉద్యోగం లేదా స్థిరమైన ఆదాయం లేకపోవడం వల్ల రవిని కుటుంబ సభ్యులు నిరంతరం హేళన చేస్తుండేవారని గుర్తించారు. ప్రత్యేకించి అతను ప్రేమించి పెళ్లాడిన భార్య, అత్త తరచూ ‘డబ్బు సంపాదించడం నీ వల్ల కాదు, ఏం చేస్తావు జీవితంలో?’ వంటి మాటలతో తక్కువ చేసి మాట్లాడేవారని సమాచారం. ఈ నిరంతర అవమానాలు, ఒత్తిళ్లు అతన్ని మానసికంగా బలహీనపర్చాయని పరిశోధనలో తేలింది.
అయితే రవికి చిన్ననాటి నుంచి కంప్యూటర్లపై ఆసక్తి ఉండేది. వెబ్‌డిజైన్‌పై మంచి పట్టు కూడా ఉండేది. ఇంట్లో అవమానాలు పెరుగుతున్న కొద్దీ, అతను తన నైపుణ్యాలను వేరే దారిలో ప్రయోగించాలని నిర్ణయించుకున్నాడు. ఇదే సమయంలో టాలీవుడ్లో పైరసీ ఉధృతి పెరుగుతున్న విషయం అతని దృష్టికి వచ్చింది. అప్పుడు వచ్చిన ఆలోచనపై పనిచేస్తూ iBomma అనే వెబ్‌సైట్‌ను డిజైన్ చేశాడు.
సులభంగా వాడుకునే యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్, తక్కువ యాడ్స్, HD ప్రింట్స్ ఇవన్నీ కలిసి iBommaను ప్రజల్లో ఒక్కసారిగా పాపులర్ చేశాయి. భారీగా ట్రాఫిక్ పెరిగిన కొద్దీ విదేశీ అడ్వర్టైజింగ్ నెట్‌వర్క్‌లు కూడా అతనితో సంప్రదించాయి. ఆ తర్వాత బప్పం వంటి మరిన్ని సైట్లు కూడా ప్రారంభించాడు. కొద్దికాలంలోనే కోట్ల రూపాయలు అతని ఖాతాలోకి ప్రవహించాయి. డబ్బుతో రవి జీవితం పూర్తిగా మారిపోయింది కానీ అవమానించిన భార్య మాత్రం తిరిగి రాలేదు. 2021లో కొత్త జీవితాన్ని ప్రారంభించాలనే నిర్ణయంతో రవి యూరప్‌కు వెళ్లిపోయాడు.
అయితే చట్టం చివరకు అతన్ని చేరుకుంది. బెట్టింగ్ యాప్‌ల నుంచి వచ్చిన కొన్ని అనుమానాస్పద ట్రాన్సాక్షన్లను పోలీసులు పరిశీలించగా, అక్కడి నుంచి iBomma నిర్వహణకు సంబంధించిన డిజిటల్ ఆధారాలు దొరికాయి. ఆ ఆధారాల ఆధారంగా అతని IP అడ్రస్ను ట్రేస్ చేసి, రెండు రోజుల క్రితం భారత్‌కు తిరిగి వచ్చిన వెంటనే అరెస్ట్ చేశారు.
ఇదిలా ఉంటే, iBomma వెబ్‌సైట్‌లో చివరి సందేశం దర్శనమిస్తోంది. ‘ఇటీవల మా గురించి వినే ఉంటారు. మొదటి నుంచి మా విశ్వసనీయ అభిమానిగా ఉన్నారు. ఏదేమైనా, మా సేవలను దేశంలో శాశ్వతంగా నిలిపేస్తున్నాం. అందుకు చింతిస్తూ క్షమాపణలు కోరుతున్నాం’ అని పేర్కొంది. సినిమాపై ప్రేమ ఉన్నప్పటికీ, పైరసీ ద్వారా దేశీయ సినీ పరిశ్రమకు కలిగే నష్టంపై జనాల్లో అవగాహన పెరిగిన సమయంలో, ఈ ప్రకటన సినీ వర్గాలను కొంత ఊరట కలిగించింది. భారత క్రైమ్ శాఖ రవిపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగిస్తోంది.