బెంగళూరు నుంచి గోవాకు వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. రూట్, టైమింగ్స్, స్టాపేజీల పూర్తి వివరాలు!
Bengaluru-Goa Vande Bharat Express: దక్షిణ భారతదేశం నుంచి పర్యాటక ప్రాంతమైన గోవాకు రైలు ప్రయాణం మరింత వేగంగా, సౌకర్యవంతంగా మారనుంది. కర్ణాటక రాజధాని బెంగళూరును గోవాలోని మడగావ్‌తో అనుసంధానిస్తూ కొత్త వందేభారత్ ఎక్స్‌ప్రెస్ పట్టాలెక్కనుంది. యశ్వంత్‌పూర్–మంగళూరు–మడగావ్–యశ్వంత్‌పూర్ మార్గంలో నడిచే ఈ రైలును నవంబర్ 13న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వేర్వేరు ప్రాంతాల నుంచి ఒకేసారి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. బెంగళూరులో ప్రధాని మోదీ, మంగళూరు జంక్షన్‌లో రైల్వే మంత్రి జెండా ఊపి ఈ కొత్త సేవను ప్రారంభించనున్నారు. నవంబర్ 15 నుంచి ఈ రైలు సాధారణ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.
బెంగళూరు నుంచి గోవాకు కొత్త వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. నవంబర్ 13న ప్రధాని మోదీ ప్రారంభం.. పూర్తి వివరాలివే..
దేశంలోనే అత్యంత నెమ్మదైన వందేభారత్ రైలు ఇదేనా? బెంగళూరు-గోవా రైలు ప్రత్యేకతలు ఇవే..
దక్షిణ భారతదేశం నుంచి పర్యాటక ప్రాంతమైన గోవాకు రైలు ప్రయాణం మరింత వేగంగా, సౌకర్యవంతంగా మారనుంది. కర్ణాటక రాజధాని బెంగళూరును గోవాలోని మడగావ్‌తో అనుసంధానిస్తూ కొత్త వందేభారత్ ఎక్స్‌ప్రెస్ పట్టాలెక్కనుంది. యశ్వంత్‌పూర్–మంగళూరు–మడగావ్–యశ్వంత్‌పూర్ మార్గంలో నడిచే ఈ రైలును నవంబర్ 13న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వేర్వేరు ప్రాంతాల నుంచి ఒకేసారి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. బెంగళూరులో ప్రధాని మోదీ, మంగళూరు జంక్షన్‌లో రైల్వే మంత్రి జెండా ఊపి ఈ కొత్త సేవను ప్రారంభించనున్నారు. నవంబర్ 15 నుంచి ఈ రైలు సాధారణ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.
ఈ కొత్త వందేభారత్ ఎక్స్‌ప్రెస్ కోసం రైల్వే బోర్డు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మొత్తం 16 కోచ్‌లతో కూడిన రెండు సరికొత్త వందేభారత్ రేక్‌లను సిద్ధం చేసింది. ఇవి ఆకర్షణీయమైన నారింజ రంగు (ఆరెంజ్ లివరీ)లో ఉండనున్నాయి. ప్రారంభోత్సవంతో పాటు సాధారణ రైలు సేవల కోసం ఒక రేక్‌ను బెంగళూరులో, మరొకదాన్ని మంగళూరులో సిద్ధంగా ఉంచారు. ఈ రైలు సేవలు 26655/26656 నంబర్లతో కొనసాగనున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 13న బెంగళూరు పర్యటనలో భాగంగా మరో కీలక కార్యక్రమంలో పాల్గొననున్నారు. బన్నెరఘట్ట రోడ్డులోని కలేణ అగ్రహార నుంచి తవారెకెరె వరకు నిర్మించిన 7.5 కిలోమీటర్ల నమ్మ మెట్రో పింక్ లైన్‌ను జాతికి అంకితం చేయనున్నారు. ఇదే కార్యక్రమంలో భాగంగా బెంగళూరు నుంచి గోవాకు వెళ్లే కొత్త వందేభారత్ రైలును కూడా రిమోట్ ద్వారా ప్రారంభించనున్నారు. అయితే ఈ రైలు సాధారణ సర్వీసులు మాత్రం బెంగళూరులోని సర్ ఎం. విశ్వేశ్వరయ్య టెర్మినల్ నుంచి కాకుండా యశ్వంత్‌పూర్ స్టేషన్ నుంచి ప్రారంభమవుతాయి. మరోవైపు మంగళూరు జంక్షన్‌లో కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ రైలును ప్రారంభిస్తారు.
ప్రారంభోత్సవం సందర్భంగా రెండు దిశల్లోనూ ప్రత్యేక రైళ్లను ఒకేసారి నడపనున్నారు. యశ్వంత్‌పూర్ నుంచి మడగావ్ వెళ్లే ప్రారంభ ప్రత్యేక రైలు రాత్రి 9 గంటలకు మంగళూరు జంక్షన్‌కు చేరుకుంటుంది. అనంతరం రాత్రి 9.30 గంటలకు ఉడుపికి చేరుకుని, తెల్లవారుజామున 1.22 గంటలకు కార్వార్‌కు చేరుతుంది. అక్కడి నుంచి ప్రయాణం కొనసాగించి తెల్లవారుజామున 2.55 గంటలకు మడగావ్ చేరుకుంటుంది. మరోవైపు మంగళూరు నుంచి యశ్వంత్‌పూర్‌కు బయలుదేరే ప్రారంభ ప్రత్యేక రైలు రాత్రి 9 గంటలకు యశ్వంత్‌పూర్‌కు చేరుకునేలా షెడ్యూల్ రూపొందించారు.
ఈ కొత్త రైలు ఏర్పాటుకు సంబంధించి కేంద్ర రైల్వే శాఖ సెప్టెంబర్ 29న కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం మంగళూరు సెంట్రల్–మడగావ్–మంగళూరు సెంట్రల్ మధ్య నడుస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (20646/20645) సేవలను యశ్వంత్‌పూర్ వరకు పొడిగిస్తూ కొత్త రైలు ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ మార్పులో భాగంగా ప్రస్తుతం నడుస్తున్న మంగళూరు సెంట్రల్–మడగావ్ వందేభారత్ సేవలను నవంబర్ 15 నుంచి నిలిపివేయనున్నారు. వాటి స్థానంలో యశ్వంత్‌పూర్ నుంచి ప్రారంభమయ్యే కొత్త సర్వీసులు అందుబాటులోకి వస్తాయి.
బెంగళూరు నుంచి గోవా వెళ్లే ఈ వందేభారత్ రైలుకు మార్గమధ్యంలో మొత్తం 12 స్టాపులు ఉంటాయి. శ్రావణబెళగొళ, హాసన్, సకలేశ్‌పూర్, సుబ్రహ్మణ్య రోడ్, కబక పుత్తూరు, మంగళూరు జంక్షన్, ఉడుపి, కుందాపుర, బిందూర్, మురుడేశ్వర్, గోకర్ణ రోడ్, కార్వార్ స్టేషన్లలో ఆగుతుంది. కర్ణాటకలోని పలు ముఖ్య పట్టణాలు, పర్యాటక ప్రాంతాలను కలుపుతూ ఈ రైలు ప్రయాణికులకు ఉపయోగపడనుంది. ముఖ్యంగా ఉడుపి, మురుడేశ్వర్, గోకర్ణ, కార్వార్ వంటి తీరప్రాంత పర్యాటక ప్రాంతాలకు వెళ్లేవారికి మెరుగైన రవాణా సౌకర్యం లభించనుంది.
రైలు సమయాల విషయానికి వస్తే.. యశ్వంత్‌పూర్ నుంచి మడగావ్‌కు వెళ్లే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 7.35 గంటలకు బయలుదేరి రాత్రి 8.55 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఈ ప్రయాణానికి 12 గంటల 20 నిమిషాల సమయం పడుతుంది. అయితే ప్రతి బుధవారం ఈ సర్వీసు ఉండదు. తిరుగు ప్రయాణంలో మడగావ్ నుంచి ఉదయం 8.20 గంటలకు బయలుదేరే రైలు రాత్రి 9.15 గంటలకు యశ్వంత్‌పూర్‌కు చేరుకుంటుంది. ఈ దిశలో ప్రయాణ సమయం 13 గంటలు. ప్రతి గురువారం ఈ రైలు నడవదు. ప్రయాణికులు తమ ప్రయాణ తేదీని బట్టి రైల్వే షెడ్యూల్‌ను ముందుగానే పరిశీలించుకోవడం మంచిది.
ఈ వందేభారత్ రైలు మరో ప్రత్యేకతను కూడా సొంతం చేసుకోనుంది. దేశంలో ప్రస్తుతం నడుస్తున్న 82 జతల వందేభారత్ చైర్‌కార్ సర్వీసుల్లో అత్యధిక ప్రయాణ సమయం కలిగిన రైలుగా ఇది నిలవనుంది. అంతేకాదు, వేగం పరంగా కూడా దేశంలోనే అత్యంత నెమ్మదిగా నడిచే వందేభారత్ సర్వీసుగా గుర్తింపు పొందనుంది. యశ్వంత్‌పూర్ నుంచి మడగావ్ వెళ్లే దిశలో గంటకు సగటున 54 కిలోమీటర్లు, తిరుగు ప్రయాణంలో గంటకు 53 కిలోమీటర్ల సగటు వేగంతో నడుస్తుంది.
సాధారణంగా వందేభారత్ రైళ్లు వేగవంతమైన ప్రయాణానికి గుర్తింపుపొందాయి. అయితే ఈ మార్గంలో అనేక స్టేషన్లలో ఆగడం, ప్రయాణించే ప్రాంతాల భౌగోళిక పరిస్థితులు వంటి అంశాల కారణంగా ప్రయాణ సమయం ఎక్కువగా ఉండనుంది. అయినప్పటికీ బెంగళూరు, మంగళూరు, ఉడుపి, కార్వార్ మీదుగా గోవాకు నేరుగా వందేభారత్ సౌకర్యం అందుబాటులోకి రావడం ప్రయాణికులకు ప్రయోజనకరంగా మారనుంది. ముఖ్యంగా కర్ణాటక, గోవా మధ్య ప్రయాణించే ఉద్యోగులు, పర్యాటకులు, వ్యాపారవర్గాలకు ఈ కొత్త రైలు సేవలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.