మానవుడి అద్భుత సృష్టి! సముద్రంపై 5 ప్రముఖ విమానాశ్రయాలు!

Airports Built on Artificial Islands: ప్రపంచంలో విమానాశ్రయాల నిర్మాణం కోసం వేల ఎకరాల భూమిని సేకరించడం సాధారణమే. కానీ కొన్ని దేశాలు మాత్రం భూమి కొరతను అధిగమించేందుకు ఏకంగా సముద్రాన్నే భూమిగా మార్చేశాయి. సముద్రపు నీటిని వెనక్కి నెట్టి, రాళ్లు, ఇసుక, మట్టి వంటి పదార్థాలతో కృత్రిమ ద్వీపాలను నిర్మించి వాటిపై అంతర్జాతీయ విమానాశ్రయాలను ఏర్పాటు చేశాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఈ విమానాశ్రయాలు నేడు ప్రపంచ విమానయాన రంగంలో కీలక కేంద్రాలుగా కొనసాగుతున్నాయి. ప్రయాణికుల రద్దీ పెరగడం, నగరాల్లో భూమి అందుబాటులో లేకపోవడం, భౌగోళిక పరిస్థితులు అనుకూలించకపోవడం వంటి సమస్యలకు ఇంజినీర్లు కనుగొన్న అద్భుత పరిష్కారాలే ఈ నిర్మాణాలు.

Airports Built on Artificial Islands
Airports Built on Artificial Islands

సముద్రం మధ్యలో అద్భుత విమానాశ్రయాలు.. కృత్రిమ ద్వీపాలపై నిర్మించిన 5 ఎయిర్‌పోర్టుల వెనుక అసాధారణ ఇంజినీరింగ్..

ప్రపంచంలోనే వింతైన 5 ఎయిర్‌పోర్టులు.. సముద్రం మధ్యలో రన్‌వేలు ఎలా నిర్మించారంటే..

ప్రపంచంలో విమానాశ్రయాల నిర్మాణం కోసం వేల ఎకరాల భూమిని సేకరించడం సాధారణమే. కానీ కొన్ని దేశాలు మాత్రం భూమి కొరతను అధిగమించేందుకు ఏకంగా సముద్రాన్నే భూమిగా మార్చేశాయి. సముద్రపు నీటిని వెనక్కి నెట్టి, రాళ్లు, ఇసుక, మట్టి వంటి పదార్థాలతో కృత్రిమ ద్వీపాలను నిర్మించి వాటిపై అంతర్జాతీయ విమానాశ్రయాలను ఏర్పాటు చేశాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఈ విమానాశ్రయాలు నేడు ప్రపంచ విమానయాన రంగంలో కీలక కేంద్రాలుగా కొనసాగుతున్నాయి. ప్రయాణికుల రద్దీ పెరగడం, నగరాల్లో భూమి అందుబాటులో లేకపోవడం, భౌగోళిక పరిస్థితులు అనుకూలించకపోవడం వంటి సమస్యలకు ఇంజినీర్లు కనుగొన్న అద్భుత పరిష్కారాలే ఈ నిర్మాణాలు.

జపాన్, చైనా ప్రాంతాల్లో సముద్రంపై నిర్మించిన విమానాశ్రయాలు ప్రత్యేక గుర్తింపు పొందాయి. వీటిలో కొన్ని పూర్తిగా కృత్రిమ ద్వీపాలపై నిర్మించగా, మరికొన్ని విమానాల రన్‌వేల కోసం మాత్రమే సముద్రంలో భూమిని సృష్టించాయి. భూకంపాలు, తుఫానులు, సముద్రపు అలలు, నేల కుంగిపోవడం వంటి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఈ విమానాశ్రయాలు పనిచేస్తున్నాయి. ప్రపంచంలో ఇలాంటి ప్రత్యేకత కలిగిన ఐదు విమానాశ్రయాల నిర్మాణ విశేషాలు తెలుసుకుందాం.

మకావు అంతర్జాతీయ విమానాశ్రయం.. రన్‌వే కోసం సముద్రంలోనే భూమి!

చైనాలోని మకావు అంతర్జాతీయ విమానాశ్రయం (Macau International Airport) 1995లో ప్రారంభమైంది. సముద్రంపై నిర్మించిన విమానాశ్రయాల్లో ఇది ప్రత్యేకమైనది. సుమారు 319 ఎకరాల విస్తీర్ణంలో ఈ విమానాశ్రయానికి అవసరమైన కృత్రిమ భూమిని అభివృద్ధి చేశారు. అయితే మిగిలిన విమానాశ్రయాలతో పోలిస్తే మకావు ఇంజినీర్లు భిన్నమైన ఆలోచన చేశారు. మొత్తం విమానాశ్రయాన్ని సముద్రంలో నిర్మించకుండా, విమానాల రన్‌వేకు మాత్రమే సముద్రంలో భూమిని సృష్టించారు.

విమానాశ్రయ ప్రయాణికుల టెర్మినల్, ఇతర సహాయక భవనాలను తైపా ద్వీపంలోనే నిర్మించారు. దీంతో నిర్మాణ వ్యయాన్ని గణనీయంగా తగ్గించగలిగారు. పెర్ల్ రివర్ ఎస్ట్యూరీ జలాల్లో సుమారు 11,024 అడుగుల (3,360 మీటర్లు) పొడవైన రన్‌వేకు సరిపడా భూమిని మాత్రమే సముద్రాన్ని పూడ్చి ఏర్పాటు చేశారు. తక్కువ స్థలంలో ఎక్కువ ప్రయోజనం పొందేందుకు రూపొందించిన ఈ విధానం అప్పట్లో ఇంజినీరింగ్ రంగంలో ప్రత్యేకంగా నిలిచింది.

అయితే ఈ నిర్మాణానికి కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. విమానాల పార్కింగ్‌కు తగినంత స్థలం లేకపోవడం, రద్దీ సమయాల్లో విమానాల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవడం వంటి సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో విమానాశ్రయ విస్తరణకు అధికారులు శ్రీకారం చుట్టారు. మకావు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కంపెనీ సుమారు 129 హెక్టార్ల (319 ఎకరాల) కొత్త భూమిని సముద్రంలో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.

ఈ విస్తరణ పనులు 2026 నుంచి 2028 వరకు కొనసాగనున్నాయి. 2030 నాటికి భూసేకరణ, రిక్లమేషన్ పనులు పూర్తయితే విమానాశ్రయం మొత్తం వినియోగించుకోగల విస్తీర్ణం 325 హెక్టార్లకు చేరుతుంది. ప్రస్తుతం ఏడాదికి సుమారు కోటి మంది ప్రయాణికులకు సేవలు అందించే సామర్థ్యం ఉండగా, విస్తరణ తర్వాత ఈ సంఖ్య 1.3 కోట్లకు పెరగనుంది.

కన్సాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం.. సముద్రంలో మునిగిపోతున్న ద్వీపంపై అద్భుత నిర్మాణం!

జపాన్‌లోని ఒసాకా నగరానికి సేవలందించే కన్సాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (Kansai International Airport) ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఇంజినీరింగ్ ప్రాజెక్టుల్లో ఒకటి. ప్రముఖ ఆర్కిటెక్ట్ రెంజో పియానో రూపకల్పనలో 1994లో ప్రారంభమైన ఈ విమానాశ్రయాన్ని ఒసాకా బే సముద్రంలో పూర్తిగా కృత్రిమ ద్వీపంపై నిర్మించారు. నగరంలోని పాత విమానాశ్రయంలో పెరుగుతున్న రద్దీని తగ్గించడంతోపాటు, పట్టణ ప్రాంతాల్లో స్థలం కొరతను అధిగమించేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టారు. సుమారు 2,607 ఎకరాల విస్తీర్ణంలో ఈ ద్వీపాన్ని అభివృద్ధి చేశారు.

అయితే ఈ విమానాశ్రయ నిర్మాణంలో ఇంజినీర్లకు ఎదురైన అతిపెద్ద సమస్య సముద్రగర్భంలోని మెత్తటి మట్టి. విమానాశ్రయం, రన్‌వేలు, భవనాల భారీ బరువుతో సముద్రగర్భంలోని మట్టి క్రమంగా కుంగిపోవడం ప్రారంభమైంది. ఈ సమస్యను అధిగమించేందుకు ఇంజినీర్లు సముద్రపు అడుగుభాగంలో దాదాపు 10 లక్షల ఇసుక స్తంభాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా మట్టిలో చిక్కుకున్న నీరు బయటకు వెళ్లేలా చేసి, నేల త్వరగా గట్టిపడేలా చర్యలు తీసుకున్నారు.

అయినప్పటికీ విమానాశ్రయ ద్వీపం ఊహించిన దానికంటే ఎక్కువగా కుంగిపోయింది. మొత్తం నిర్మాణ చరిత్రలో ద్వీపం సుమారు 45 అడుగులు (13.66 మీటర్లు) దిగజారినట్లు అంచనా. అయితే ఇందులో ఎక్కువ భాగం విమానాశ్రయం ప్రారంభానికి ముందే నిర్మాణ దశలో జరిగింది. విమానాశ్రయం ప్రారంభమైన తర్వాత భవనాలు, ఇతర నిర్మాణాలు సుమారు 13 అడుగుల మేర దిగజారినట్లు అంచనా. ప్రస్తుతం ఈ కుంగిపోయే ప్రక్రియ చాలా నెమ్మదించింది. 2024లో కేవలం రెండు అంగుళాలు (5 సెంటీమీటర్లు) మాత్రమే నేల దిగజారినట్లు సమాచారం.

ఈ విమానాశ్రయానికి మరో పెద్ద సవాలు ప్రకృతి వైపరీత్యం. 2018 సెప్టెంబర్ 4న జపాన్‌ను అతలాకుతలం చేసిన జెబి తుఫాను కారణంగా విమానాశ్రయంలోని ప్రధాన రన్‌వే, టెర్మినల్ భవనం నీట మునిగాయి. గంటకు సుమారు 110 మైళ్ల వేగంతో వీచిన గాలులకు నియంత్రణ కోల్పోయిన ఓ ఇంధన ట్యాంకర్ నౌక విమానాశ్రయాన్ని ప్రధాన భూభాగంతో కలిపే వంతెనను బలంగా ఢీకొట్టింది. దీంతో రోడ్డు, రైలు మార్గాలు తెగిపోయాయి. విమానాశ్రయంలో ఉన్న సుమారు 8 వేల మంది ప్రయాణికులు, సిబ్బంది అక్కడే చిక్కుకుపోయారు. పూర్తిస్థాయిలో ప్రయాణికుల విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం కావడానికి మూడు వారాలు పట్టింది. సముద్ర మట్టం పెరగడం, నేల కుంగిపోవడం వంటి సమస్యల నేపథ్యంలో ఎత్తైన రక్షణ గోడలు ఎంతవరకు భద్రత కల్పిస్తాయన్నది ఇప్పటికీ కీలక అంశంగా ఉంది.

ఒర్డు-గిరెసన్ విమానాశ్రయం.. నల్ల సముద్రంలో రాళ్లతో నిర్మించిన ఎయిర్‌పోర్టు!

టర్కీలోని ఒర్డు-గిరెసన్ విమానాశ్రయం (Ordu-Giresun Airport) మరో అద్భుతమైన నిర్మాణం. 2015లో ప్రారంభమైన ఈ విమానాశ్రయం యూరప్‌లో సముద్రంపై నిర్మించిన తొలి విమానాశ్రయంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. టర్కీలోని నల్ల సముద్ర తీర ప్రాంతంలో ఉన్న పొంటిక్ పర్వతాల కారణంగా విమానాశ్రయం నిర్మించేందుకు అవసరమైన సమతల భూమి అందుబాటులో లేదు. ఒకవైపు ఎత్తైన పర్వతాలు, మరోవైపు సముద్రం ఉండటంతో ఇంజినీర్లు సముద్రంలోనే కృత్రిమ ద్వీపాన్ని నిర్మించాలని నిర్ణయించారు.

ఈ ప్రాజెక్టు కోసం భారీ స్థాయిలో రాళ్లను సముద్రంలోకి తరలించారు. సుమారు 30 నుంచి 36 మిలియన్ టన్నుల రాళ్లను సముద్రగర్భంలో వేసి భూమిని అభివృద్ధి చేశారు. ఇందుకోసం భారీ ట్రక్కులు దాదాపు 9.5 లక్షల సార్లు రాళ్లను తరలించినట్లు అంచనా. సుమారు 445 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ విమానాశ్రయంలో 3,000 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పుతో ఒక రన్‌వే నిర్మించారు.

సాధారణంగా సముద్రంలో నిర్మించే విమానాశ్రయాలకు అలల తీవ్రత, నేల కుంగిపోవడం ప్రధాన సమస్యలుగా ఉంటాయి. అయితే ఒర్డు-గిరెసన్ విమానాశ్రయం విషయంలో ఇంజినీర్లు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. గట్టిగా కుదించిన రాళ్లతో నిర్మాణ పునాదిని ఏర్పాటు చేయడంతో నేల కుంగిపోవడానికి సంబంధించిన సమస్యలు లేవని విమానాశ్రయ నిర్వహణ సంస్థ వెల్లడించింది. అంతేకాకుండా నల్ల సముద్రంలో వచ్చే భారీ అలల నుంచి విమానాశ్రయాన్ని రక్షించేందుకు చుట్టూ 7,435 మీటర్ల పొడవైన రక్షణ కట్టను నిర్మించారు. ఇది సుమారు 4.6 మైళ్ల పొడవు ఉంటుంది.

విమానాశ్రయం ప్రారంభమైన 2015లో సుమారు 2.21 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ఆ తర్వాతి ఏడాది అంటే 2016లోనే ప్రయాణికుల సంఖ్య 250 శాతానికి పైగా పెరిగి సుమారు 7.77 లక్షలకు చేరింది. ప్రస్తుతం ఈ విమానాశ్రయం ఏడాదికి 11 లక్షల మందికి పైగా ప్రయాణికులకు సేవలు అందిస్తోంది. తీవ్రమైన సముద్ర తుఫానుల కారణంగా విమానాశ్రయం కార్యకలాపాలు నిలిచిపోయిన ఘటనలు ఇప్పటివరకు నమోదు కాలేదని అందుబాటులో ఉన్న సమాచారం చెబుతోంది.

చుబు సెంట్రెయిర్ అంతర్జాతీయ విమానాశ్రయం.. ప్రకృతికి నష్టం కలగకుండా నిర్మాణం!

జపాన్‌లోని మరో అద్భుతమైన కృత్రిమ ద్వీప విమానాశ్రయం చుబు సెంట్రెయిర్ అంతర్జాతీయ విమానాశ్రయం (Chubu Centrair International Airport). కన్సాయ్ విమానాశ్రయం తర్వాత జపాన్‌లో సముద్రంపై నిర్మించిన రెండో ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయంగా దీనికి గుర్తింపు ఉంది. 2005 ఫిబ్రవరి 17న ప్రారంభమైన ఈ విమానాశ్రయం నగోయా నగరంతోపాటు జపాన్ పారిశ్రామిక ప్రాంతాలకు అంతర్జాతీయ ప్రయాణ ద్వారంగా పనిచేస్తోంది. ఐసే బే సముద్రంలో సుమారు 1,433 ఎకరాల విస్తీర్ణంలో ఈ కృత్రిమ ద్వీపాన్ని నిర్మించారు.

ఈ విమానాశ్రయ నిర్మాణంలో మరో ప్రత్యేకత ఉంది. సాధారణంగా కృత్రిమ ద్వీపాలను చతురస్రాకారంలో నిర్మిస్తుంటారు. కానీ చుబు విమానాశ్రయాన్ని ప్రత్యేకమైన వంపు ఆకారంలో, డి (D) ఆకృతిలో రూపొందించారు. సముద్రంలోని నీటి ప్రవాహాలు ఎలాంటి ఆటంకం లేకుండా ద్వీపం చుట్టూ వెళ్లేలా గుండ్రని అంచులతో నిర్మాణాన్ని రూపొందించారు. దీనివల్ల సముద్రపు ప్రవాహాలపై ప్రభావాన్ని తగ్గించవచ్చని ఇంజినీర్లు భావించారు.

నిర్మాణ సమయంలో సముద్ర జీవులకు హాని కలగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. అంతరించిపోయే ప్రమాదం ఉన్న లిటిల్ టెర్న్ అనే చిన్న సముద్ర పక్షుల గూళ్లను కాపాడేందుకు ద్వీపం పరిధిలోనే ప్రత్యేక వన్యప్రాణుల సంరక్షణ ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు. అలాగే సముద్ర తీరంలో భారీ కాంక్రీట్ గోడలు నిర్మించకుండా, సహజమైన రాళ్లతో వాలుగా ఉండే తీర ప్రాంతాన్ని రూపొందించారు. ఈ రాళ్లపై సముద్రపు నాచు పెరగడంతోపాటు చేపలు, పీతలకు నివాసం, సంతానోత్పత్తికి అనువైన వాతావరణం ఏర్పడేలా చర్యలు తీసుకున్నారు.

ఈ విమానాశ్రయం నిర్మాణానికి మరో ప్రధాన కారణం అంతర్జాతీయ ప్రయాణికుల ఇబ్బందులు. చుబు ప్రాంతం నుంచి అమెరికా, యూరప్ వంటి ప్రధాన అంతర్జాతీయ గమ్యస్థానాలకు వెళ్లే ప్రయాణికుల్లో సుమారు సగం మంది గతంలో ముందుగా దేశీయ విమానాలు లేదా బుల్లెట్ రైళ్ల ద్వారా టోక్యోలోని నరిటా విమానాశ్రయానికి చేరుకోవాల్సి వచ్చేది. అక్కడి నుంచి అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణించేవారు. ఈ ఇబ్బందులను తొలగించడంతోపాటు 2005 ఐచి వరల్డ్ ఎక్స్‌పోజిషన్‌కు వచ్చే అంతర్జాతీయ పర్యాటకులు, ప్రముఖులకు నేరుగా సేవలందించేందుకు ఈ విమానాశ్రయ నిర్మాణాన్ని వేగవంతం చేశారు. ప్రారంభమైన తర్వాత ఈ ప్రాంతానికి అంతర్జాతీయ విమాన ప్రయాణాలు మరింత సులభమయ్యాయి.

హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం.. పర్వతాన్ని తొలగించి సముద్రంలో మెగా ద్వీపం!

ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన కృత్రిమ ద్వీప విమానాశ్రయాల్లో హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం (Hong Kong International Airport) ఒకటి. చెక్ లాప్ కోక్ (Chek Lap Kok) ప్రాంతంలో నిర్మించిన ఈ విమానాశ్రయం 1998 జూలైలో ప్రారంభమైంది. హాంకాంగ్ చరిత్రలోనే అతిపెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టుగా నిలిచిన ఎయిర్‌పోర్ట్ కోర్ ప్రోగ్రామ్‌లో ఇది ప్రధాన భాగం. గతంలో నగరంలోని కై టాక్ విమానాశ్రయంలో పెరుగుతున్న రద్దీ, పరిమిత స్థలం, విమానాల రాకపోకలకు సంబంధించిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని కొత్త విమానాశ్రయాన్ని నిర్మించారు. సుమారు 3,084 ఎకరాల విస్తీర్ణంలో ఈ కృత్రిమ ద్వీపాన్ని అభివృద్ధి చేశారు.

ఈ విమానాశ్రయ నిర్మాణంలో ఇంజినీర్లు అనుసరించిన విధానం అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. చెక్ లాప్ కోక్ ప్రాంతంలో ఉన్న కొండలు, రాతి పర్వతాలను భారీ పేలుళ్ల ద్వారా తొలగించారు. అలా తొలగించిన రాళ్లనే సముద్రంలోని లోతట్టు ప్రాంతాలను పూడ్చేందుకు ఉపయోగించారు. రెండు ద్వీపాల మధ్య ఉన్న సముద్ర ప్రాంతాలను రాళ్లతో నింపి వాటిని ఒకే భారీ భూభాగంగా మార్చారు. ఈ ప్రాజెక్టులో సుమారు 9.5 చదరపు కిలోమీటర్ల సముద్ర ప్రాంతాన్ని పూడ్చి కొత్త భూమిని సృష్టించారు. దీనివల్ల హాంకాంగ్ మొత్తం భూభాగం దాదాపు ఒక శాతం పెరిగింది.

చెక్ లాప్ కోక్‌లోని పర్వత శిఖరం ఒకప్పుడు సముద్ర మట్టానికి 328 అడుగుల ఎత్తులో ఉండేది. విమానాశ్రయ నిర్మాణం కోసం దాన్ని పూర్తిగా తొలగించి, ఆ ప్రాంతాన్ని సముద్ర మట్టానికి సుమారు 23 అడుగుల ఎత్తులో ఉండేలా చదును చేశారు. 1997లో బ్రిటిష్ పాలన నుంచి చైనాకు హాంకాంగ్ బదిలీ అయ్యేలోపే విమానాశ్రయాన్ని ప్రారంభించాలని తొలుత ప్రణాళిక రూపొందించారు. అయితే భారీ ఇంజినీరింగ్ పనులు, నిర్మాణ సవాళ్ల కారణంగా ప్రారంభం ఆలస్యమైంది.

చివరకు 1998 జూలై 5 రాత్రి విమానాశ్రయ చరిత్రలోనే కీలకమైన మార్పు చోటుచేసుకుంది. కౌలూన్ ప్రాంతంలోని ప్రధాన రహదారులను తాత్కాలికంగా మూసివేసి, వేలాది విమానాశ్రయ వాహనాలు, సామగ్రి, లగేజీ లోడర్లు, ఇతర పరికరాలను కొత్త విమానాశ్రయానికి తరలించారు. అదే సమయంలో కై టాక్ పాత విమానాశ్రయం నుంచి సుమారు 30 వాణిజ్య విమానాలు వరుసగా బయలుదేరి కొత్త విమానాశ్రయానికి చేరుకున్నాయి. ఈ విమానాలన్నీ తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ కొత్త విమానాశ్రయానికి మారాయి.

పాత కై టాక్ విమానాశ్రయం నుంచి చివరి విమానం బయలుదేరిన వెంటనే అక్కడి రన్‌వే లైట్లను శాశ్వతంగా ఆర్పేశారు. 1998 జూలై 6న ఉదయం 6.27 గంటలకు క్యాథే పసిఫిక్‌కు చెందిన సీ ఎక్స్ 887 (CX887) విమానం కొత్త చెక్ లాప్ కోక్ విమానాశ్రయంలో విజయవంతంగా ల్యాండ్ అయింది. దీంతో హాంకాంగ్ విమానయాన చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది.

కాలక్రమంలో ఈ విమానాశ్రయం మరింత విస్తరించింది. పెరుగుతున్న అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మూడో రన్‌వేను నిర్మించారు. 2022లో ఇది ప్రారంభమైంది. 2030 నాటికి కొత్త టెర్మినల్ విస్తరణ పనులు కూడా చేపట్టాలనే ప్రణాళికలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ విమానాశ్రయం అంతర్జాతీయ విమానయాన రంగంలో అత్యంత కీలకమైన రవాణా కేంద్రాల్లో ఒకటిగా కొనసాగుతోంది.

సముద్రంపై విమానాశ్రయాల నిర్మాణం.. ఇంజినీరింగ్‌కు నిలువెత్తు నిదర్శనం!

ఈ ఐదు విమానాశ్రయాల నిర్మాణాలను పరిశీలిస్తే ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన సవాళ్లను ఇంజినీర్లు ఎలా అధిగమించారో అర్థమవుతుంది. మకావులో రన్‌వే కోసం మాత్రమే సముద్రంలో భూమిని సృష్టించడం, కన్సాయ్‌లో నేల కుంగిపోకుండా ఇసుక స్తంభాలను ఏర్పాటు చేయడం, టర్కీలో రాళ్లతోనే కృత్రిమ ద్వీపాన్ని నిర్మించడం, చుబులో సముద్ర జీవులకు అనుకూలంగా నిర్మాణం చేపట్టడం, హాంకాంగ్‌లో పర్వతాలను తొలగించి సముద్రాన్ని పూడ్చడం.. ఇవన్నీ ఆధునిక ఇంజినీరింగ్ ప్రతిభకు నిదర్శనాలు.

సాధారణంగా విమానాశ్రయ నిర్మాణానికి అనువైన భూమి కోసం దేశాలు భారీగా ఖర్చు చేస్తుంటాయి. కానీ భూమి అందుబాటులో లేని ప్రాంతాల్లో సముద్రాన్నే భూమిగా మార్చి విమానాశ్రయాలను నిర్మించడం ద్వారా కొత్త అవకాశాలను సృష్టించవచ్చని ఈ ప్రాజెక్టులు నిరూపించాయి. భవిష్యత్తులో ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండటంతో ఇటువంటి నిర్మాణాలకు ప్రాధాన్యం పెరగవచ్చు. ప్రకృతిలోని సవాళ్లను అధిగమిస్తూ సముద్రం మధ్యలో అంతర్జాతీయ విమానాశ్రయాలను నిర్మించడం నిజంగా మానవ మేధస్సు, సాంకేతిక పరిజ్ఞానానికి అద్భుతమైన ఉదాహరణ.

Tags

Be the first to react

Latest