కొన్ని దేశాలకు వీసా అవసరం లేదనుకొని డైరెక్ట్ గా వెళ్ళకండి! విదేశాంగ శాఖ హెచ్చరిక!

Visa-Free Does Not Mean Guaranteed Entry: విదేశీ పర్యటనకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? ముందుగా చాలామంది గూగుల్‌లో వెతికే ప్రశ్న.. భారతీయ పాస్‌పోర్టుతో ఏయే దేశాలకు వీసా లేకుండా వెళ్లవచ్చు? వీసా కోసం దరఖాస్తు చేసుకోవడం, పత్రాలు సమర్పించడం, అనుమతి కోసం ఎదురుచూడడం వంటి ఇబ్బందులు లేకుండా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటే ఎవరికి మాత్రం నచ్చదు? అయితే వీసా లేకుండా ప్రయాణించవచ్చనే విషయం తెలుసుకున్నంత మాత్రాన ప్రయాణానికి పూర్తిగా అనుమతి లభించినట్లు కాదు. వీసా ఫ్రీ ఎంట్రీకి కూడా కొన్ని నిబంధనలు, పరిమితులు ఉంటాయి. వాటిని పాటించకపోతే విమానం ఎక్కకముందే ఇబ్బందులు ఎదురుకావచ్చు. విదేశాలకు చేరుకున్న తర్వాత ఇమ్మిగ్రేషన్‌ అధికారులు ప్రవేశాన్ని నిరాకరించే అవకాశం కూడా ఉంటుంది.

Visa Free Does Not Mean Guaranteed Entry
Visa Free Does Not Mean Guaranteed Entry

వీసా లేకుండానే విదేశీ ప్రయాణమా? భారతీయులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలివే...

వీసా లేకుండానే విదేశాలకు వెళ్లొచ్చు.. కానీ విమానాశ్రయంలోనే వెనక్కి పంపే ప్రమాదం..

విదేశీ పర్యటనకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? ముందుగా చాలామంది గూగుల్‌లో వెతికే ప్రశ్న.. భారతీయ పాస్‌పోర్టుతో ఏయే దేశాలకు వీసా లేకుండా వెళ్లవచ్చు? వీసా కోసం దరఖాస్తు చేసుకోవడం, డాక్యుమెంట్ లు సమర్పించడం, అనుమతి కోసం ఎదురుచూడడం వంటి ఇబ్బందులు లేకుండా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటే ఎవరికి మాత్రం నచ్చదు? అయితే వీసా లేకుండా ప్రయాణించవచ్చనే విషయం తెలుసుకున్నంత మాత్రాన ప్రయాణానికి పూర్తిగా అనుమతి లభించినట్లు కాదు. వీసా ఫ్రీ ఎంట్రీకి కూడా కొన్ని నిబంధనలు, పరిమితులు ఉంటాయి. వాటిని పాటించకపోతే విమానం ఎక్కకముందే ఇబ్బందులు ఎదురుకావచ్చు. విదేశాలకు చేరుకున్న తర్వాత ఇమ్మిగ్రేషన్‌ అధికారులు ప్రవేశాన్ని నిరాకరించే అవకాశం కూడా ఉంటుంది.

2026 అక్టోబర్‌ నాటికి భారతీయ పాస్‌పోర్టు కలిగినవారు 25 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చని సమాచారం. అయితే, వీసా ఫ్రీ ప్రయాణం అంటే ఎలాంటి తనిఖీలు లేకుండా ఆ దేశంలోకి ప్రవేశించవచ్చని అర్థం కాదు. ఇటీవల దక్షిణ కొరియాలోని జెజు ద్వీపానికి వీసా లేకుండా వెళ్లేందుకు అర్హత ఉన్నప్పటికీ, అక్కడికి చేరుకున్న భారతీయ దంపతులను అధికారులు అడ్డుకుని తిరిగి భారత్‌కు పంపించిన ఘటన ఈ అంశంపై చర్చకు దారితీసింది. వీసా ఫ్రీ సదుపాయం ఉన్నప్పుడు కూడా ప్రవేశాన్ని ఎందుకు నిరాకరిస్తారు? విదేశీ ప్రయాణానికి వెళ్లేవారు ఎలాంటి పత్రాలు సిద్ధం చేసుకోవాలి? అనే ప్రశ్నలు చాలామందిలో తలెత్తుతున్నాయి.

వీసా ఫ్రీ అంటే అసలు ఏమిటి?

గ్రీన్‌వ్యూ ట్రావెల్స్‌ అండ్‌ సర్వీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సారికా మల్హోత్రా వివరించిన ప్రకారం.. వీసా ఫ్రీ యాక్సెస్‌ అంటే నిర్దిష్ట ప్రయోజనం, నిర్ణీత కాలపరిమితి కోసం ముందుగానే వీసా తీసుకోకుండానే ఒక దేశానికి వెళ్లేందుకు అనుమతి ఉండటం. అయితే, అది ఆ దేశంలోకి ప్రవేశించేందుకు లభించే పూర్తి హక్కు కాదు. ప్రయాణికుడి డాక్యుమెంట్ లు, పర్యటన ఉద్దేశం, అర్హతలను పరిశీలించిన తర్వాతే అక్కడి సరిహద్దు, ఇమ్మిగ్రేషన్‌ అధికారులు ప్రవేశానికి అనుమతి ఇస్తారు.

విమానయాన సంస్థలు కూడా ప్రయాణికుల డాక్యుమెంట్లను తనిఖీ చేస్తాయి. అవసరమైన డాక్యుమెంట్లు లేకపోతే విమానం ఎక్కేందుకు అనుమతించకపోవచ్చు. అంతేకాదు, వీసా ఫ్రీ సదుపాయం సాధారణంగా పర్యాటకం, స్వల్పకాలిక సందర్శన వంటి నిర్దిష్ట ప్రయోజనాలకే వర్తిస్తుంది. ఆ అనుమతితో ఉద్యోగం చేయడం, దీర్ఘకాలికంగా చదువుకోవడం లేదా అక్కడే నివాసం ఏర్పరచుకోవడం సాధ్యం కాదు. అలాంటి అవసరాల కోసం సంబంధిత దేశం నిర్దేశించిన ప్రత్యేక వీసా లేదా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

ప్రయాణానికి ముందు నిబంధనలు తప్పనిసరిగా తెలుసుకోండి

ఒక దేశానికి వీసా అవసరం లేదని తెలుసుకున్న వెంటనే విమాన టికెట్లు బుక్‌ చేసుకోవడం మంచిది కాదు. భారతీయ పాస్‌పోర్టుదారులకు వర్తించే తాజా నిబంధనలను ముందుగా పరిశీలించాలి. ఇందుకోసం సంబంధిత దేశ ప్రభుత్వ ఇమ్మిగ్రేషన్‌ వెబ్‌సైట్‌ను చూడాలని సారికా మల్హోత్రా సూచిస్తున్నారు. అలాగే భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) అందించే దేశాల వారీ వీసా సమాచారాన్ని కూడా పరిశీలించాలి.

ప్రతి దేశంలో వీసా ఫ్రీగా ఉండే గరిష్ఠ బస కాలం ఒకేలా ఉండదు. కొన్ని దేశాలు నిర్దిష్ట రోజులపాటు మాత్రమే ఉండేందుకు అనుమతిస్తాయి. మరికొన్ని దేశాలు పర్యటన ఉద్దేశాన్ని బట్టి నిబంధనలు విధిస్తాయి. కాబట్టి ఎన్ని రోజులు ఉండవచ్చు, ఏయే పనులు చేయవచ్చు, పాస్‌పోర్టుకు ఎంతకాలం చెల్లుబాటు ఉండాలి అనే విషయాలను ముందుగానే తెలుసుకోవాలి. కొన్ని దేశాలకు వీసా అవసరం లేకపోయినా ఎలక్ట్రానిక్‌ ట్రావెల్‌ ఆథరైజేషన్‌ (ETA), ముందస్తు రిజిస్ట్రేషన్‌ లేదా ప్రత్యేక ప్రవేశ అనుమతి అవసరం కావచ్చు. ప్రయాణంలో మరో దేశం మీదుగా వెళ్లాల్సి వస్తే ట్రాన్సిట్‌ వీసా అవసరమా అనే విషయాన్ని కూడా తనిఖీ చేయాలి.

ఇమ్మిగ్రేషన్‌ తనిఖీల కోసం ఈ పత్రాలు సిద్ధంగా ఉంచుకోండి

విదేశీ ప్రయాణానికి బయలుదేరే ముందు అవసరమైన పత్రాలను ప్రింట్‌ రూపంలోనూ, ఫోన్‌లో ఇంటర్నెట్‌ లేకున్నా తెరిచే విధంగా ఆఫ్‌లైన్‌లోనూ భద్రపరచుకోవాలి. మొదటగా పాస్‌పోర్టు చెల్లుబాటు గడువును పరిశీలించాలి. కొన్ని దేశాలు ప్రయాణం ముగిసిన తర్వాత కూడా పాస్‌పోర్టుకు కనీసం కొన్ని నెలల చెల్లుబాటు ఉండాలని కోరుతాయి. మరికొన్ని దేశాల్లో వేర్వేరు నిబంధనలు ఉంటాయి. అందువల్ల గమ్యస్థాన దేశానికి వర్తించే పాస్‌పోర్టు నిబంధనలను ముందుగానే తెలుసుకోవాలి.

తిరుగు ప్రయాణం లేదా తదుపరి దేశానికి వెళ్లేందుకు బుక్‌ చేసుకున్న టికెట్‌ కూడా తప్పనిసరిగా సిద్ధంగా ఉంచుకోవాలి. అనుమతించిన బస కాలం ముగియకముందే ఆ దేశం నుంచి బయటకు వస్తారని నిరూపించేందుకు ఈ టికెట్‌ ఉపయోగపడుతుంది. వేర్వేరు విమానయాన సంస్థలతో కనెక్టింగ్‌ టికెట్లు బుక్‌ చేసుకున్నవారు ట్రాన్సిట్‌ నిబంధనలు, మధ్యలో విమానాశ్రయంలో బ్యాగేజీని తిరిగి తీసుకోవాల్సిన అవసరం ఉందా అనే విషయాలను కూడా పరిశీలించాలి.

విదేశాల్లో ఎక్కడ బస చేయబోతున్నారో తెలిపే ఆధారాలు కూడా ముఖ్యం. పర్యటనలోని ప్రతి రోజు రాత్రికి సంబంధించిన హోటల్‌ బుకింగ్‌ వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలి. బంధువులు లేదా స్నేహితుల ఇంట్లో ఉండాలనుకుంటే వారి పూర్తి చిరునామా, సంప్రదింపు వివరాలు, అవసరమైతే ఆహ్వాన లేఖను వెంట తీసుకెళ్లాలి. ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అడిగినప్పుడు ఎక్కడ ఉంటారో స్పష్టంగా వివరించగలగాలి.

ప్రయాణ ఖర్చులను భరించేందుకు తగినంత ఆర్థిక సామర్థ్యం ఉందని నిరూపించే డాక్యుమెంట్లు కూడా అవసరం కావచ్చు. ఇటీవలి బ్యాంక్‌ స్టేట్‌మెంట్లు, అంతర్జాతీయంగా ఉపయోగించగలిగే కార్డు లేదా స్పాన్సర్‌ ఖర్చులు భరిస్తుంటే వారి మద్దతు లేఖ, ఆర్థిక ఆధారాలను సిద్ధంగా ఉంచుకోవాలి. పర్యటనకు అయ్యే ఖర్చులను ఎవరు భరిస్తున్నారు? అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం చెప్పగలగాలి.

అలాగే పర్యటనకు సంబంధించిన ప్రణాళికను సంక్షిప్తంగా సిద్ధం చేసుకోవాలి. ఎక్కడెక్కడికి వెళ్లాలనుకుంటున్నారు? ఎన్ని రోజులు ఉంటారు? ఏయే కార్యక్రమాల్లో పాల్గొంటారు? అనే వివరాలు స్పష్టంగా ఉండాలి. వ్యాపార సమావేశాల కోసం వెళ్తున్నవారు ఆహ్వాన లేఖను, సదస్సులకు హాజరవుతున్నవారు రిజిస్ట్రేషన్‌ వివరాలను వెంట తీసుకెళ్లాలి. కుటుంబ సభ్యులను కలవడానికి వెళ్తుంటే వారితో సంబంధం, సందర్శన ఉద్దేశాన్ని వివరించే సమాచారం సిద్ధంగా ఉంచుకోవడం మంచిది.

ప్రయాణ బీమా, వైద్యుల ప్రిస్క్రిప్షన్లు, ఆరోగ్యానికి సంబంధించిన అవసరమైన డాక్యుమెంట్లు, కస్టమ్స్‌ నిబంధనలకు సంబంధించిన వివరాలు కూడా ముందుగానే పరిశీలించాలి. కొన్ని దేశాల్లో రాకకు ముందు ప్రత్యేక ఆరోగ్య లేదా ఆగమన ఫారాలు నింపాల్సి ఉంటుంది. మందులు తీసుకెళ్తున్నవారు వాటిని సాధ్యమైనంత వరకు అసలు ప్యాకింగ్‌లోనే ఉంచాలి. ఆయా మందులను ఆ దేశంలోకి తీసుకెళ్లేందుకు అనుమతి ఉందా లేదా అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి. నిషేధిత లేదా నియంత్రిత మందుల విషయంలో నిర్లక్ష్యం చేస్తే విమానాశ్రయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

పిల్లలతో విదేశాలకు వెళ్లేవారు మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నారులు తల్లిదండ్రుల్లో ఒక్కరితో మాత్రమే ప్రయాణిస్తున్నా, లేదా ఇతర పెద్దవారితో వెళ్తున్నా వారి పాస్‌పోర్టుతో పాటు జనన ధ్రువీకరణ పత్రం, కుటుంబ సంబంధాన్ని తెలిపే ఆధారాలు, అవసరమైతే తల్లిదండ్రుల సమ్మతి పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి. ఈ నిబంధనలు దేశాన్ని బట్టి మారవచ్చు కాబట్టి ముందుగానే తనిఖీ చేయడం అవసరం.

ఇమ్మిగ్రేషన్‌ అధికారుల ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలి?

విదేశీ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్‌ తనిఖీలు జరిగేటప్పుడు ప్రయాణికులు ప్రశాంతంగా, నిజాయతీగా సమాధానాలు ఇవ్వాలి. ఎక్కడ బస చేస్తారు? ఎంతకాలం ఉంటారు? అక్కడికి ఎందుకు వచ్చారు? పర్యటన ఖర్చులు ఎలా భరిస్తారు? వంటి ప్రశ్నలు అడగవచ్చు. వీటికి స్పష్టంగా సమాధానం చెప్పాలి. బుకింగ్‌ వివరాలు, ప్రయాణ ప్రణాళిక, ఇచ్చే సమాధానాల మధ్య పొంతన ఉండాలి.

రద్దు చేసిన హోటల్‌ బుకింగ్‌లను లేదా ఇంకా ఖరారు కాని రిజర్వేషన్లను ఖరారైనవిగా చూపించడం మంచిది కాదు. అలాగే ముఖ్యమైన పత్రాలను ఇంటర్నెట్‌ ద్వారా మాత్రమే పొందేలా ఆధారపడకూడదు. విమానాశ్రయంలో నెట్‌వర్క్‌ సమస్యలు ఎదురైతే అవసరమైన డాక్యుమెంట్లను చూపించలేని పరిస్థితి రావచ్చు. అందుకే ముఖ్యమైన డాక్యుమెంట్ల ప్రింట్‌ కాపీలు, ఆఫ్‌లైన్‌ డిజిటల్‌ కాపీలు వెంట ఉంచుకోవడం ఉత్తమం.

కనెక్టింగ్‌ దేశాల నిబంధనలూ మర్చిపోవద్దు

ఒక దేశానికి వీసా లేకుండా వెళ్లేందుకు అర్హత ఉన్నప్పటికీ, ప్రయాణ మార్గంలో ఆగే ఇతర దేశాలకు కూడా అదే నిబంధనలు వర్తిస్తాయని భావించకూడదు. విమాన మార్పిడి కోసం మధ్యలో దిగే దేశం, ట్రాన్సిట్‌ విమానాశ్రయం, తదుపరి గమ్యస్థానం.. ఇలా ప్రయాణంలో భాగమైన ప్రతి దేశానికి సంబంధించిన వీసా, ప్రవేశ నిబంధనలను పరిశీలించాలి. గమ్యస్థాన దేశం అనుమతించిన కాలపరిమితిని మించకుండా ఉండటంతో పాటు, వీసా ఫ్రీ ప్రయాణంలో అనుమతించిన కార్యకలాపాలకే పరిమితం కావాలి.

మొత్తంగా చూస్తే వీసా ఫ్రీ ప్రయాణం విదేశీ పర్యటనను సులభతరం చేస్తుంది. అయితే, వీసా లేకుండా వెళ్లవచ్చనే కారణంతో పత్రాలు లేకుండా ప్రయాణించడం లేదా ఇమ్మిగ్రేషన్‌ తనిఖీలను తేలిగ్గా తీసుకోవడం సరైంది కాదు. అన్ని డాక్యుమెంట్లు సిద్ధంగా ఉన్నంత మాత్రాన ప్రవేశానికి హామీ లభించదు. కానీ పర్యటన నిజమైనదని, తాత్కాలికమని, ఆ దేశ నిబంధనలకు అనుగుణంగా ఉందని నిరూపించేందుకు అవి ఎంతగానో సహాయపడతాయి. విదేశీ ప్రయాణానికి ముందు అధికారిక నిబంధనలు పరిశీలించి, అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకుంటే చివరి నిమిషంలో ఎదురయ్యే ఇబ్బందులను చాలావరకు నివారించవచ్చు.

Tags

Be the first to react

Latest