Tourism: ఏఐతో పర్యాటక రంగంలో కొత్త అధ్యాయం.. దేశంలో తొలి ‘ఏఐ పవర్డ్ టూరిజం’ రాష్ట్రంగా ఏపీ!
Tourism: ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని అత్యాధునిక సాంకేతికతతో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే మొట్టమొదటి ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత పర్యాటక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దే దిశగా చారిత్రాత్మక అడుగు పడింది.
100కు పైగా పర్యాటక ప్రాంతాల్లో ‘నివు ఏఐ’ సేవలు.. మంత్రి దుర్గేష్ ప్రకటన..
ఏఐతో పర్యాటకులకు బహుభాషా సేవలు.. ఏపీ కొత్త చరిత్ర..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని అత్యాధునిక సాంకేతికతతో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే మొట్టమొదటి ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత పర్యాటక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దే దిశగా చారిత్రాత్మక అడుగు పడింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (APTA) మరియు ప్రముఖ ట్రావెల్ టెక్నాలజీ సంస్థ ఎక్స్ప్లర్జర్ (Explurger) మధ్య మూడేళ్ల వ్యూహాత్మక అవగాహన ఒప్పందం కుదిరింది.
వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, ఏపీటీఏ ఎండీ అమ్రపాలి కాట, సీఈఓ ఏఏఎల్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ, ‘నివు ఏఐ’ (NiVU AI - Neural Intelligence Vernacular Unified Model) అనే ఆధునిక ప్లాట్ఫారమ్ను రాష్ట్రవ్యాప్తంగా 100కు పైగా పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాల్లో అందుబాటులోకి తీసుకురానున్నామని తెలిపారు. తొలి ఏడాదిలో 30 ప్రధాన ప్రాంతాల్లో సేవలు ప్రారంభించి, మూడు సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో విస్తరించనున్నట్లు వెల్లడించారు.
ఈ సేవను వినియోగించేందుకు పర్యాటకులు ఎలాంటి ప్రత్యేక యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని, కేవలం ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసే QR కోడ్ను స్కాన్ చేస్తే చాలని మంత్రి చెప్పారు. అనంతరం పర్యాటకులు వాయిస్ లేదా టెక్స్ట్ ద్వారా ‘నివు ఏఐ’తో నేరుగా సంభాషించవచ్చు. 130కు పైగా భాషల్లో చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మిక విశేషాలు, స్థానిక సమాచారం తెలుసుకునే అవకాశం కల్పించనున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యక్ష ప్రదర్శనలో ‘ASK AI’ పేరుతో రూపొందించిన QR కోడ్ను ఆవిష్కరించారు. మంత్రి దుర్గేష్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ స్వయంగా ఏఐతో సంభాషించి పర్యాటక ప్రాంతాల గురించి వివరాలు తెలుసుకున్నారు.
మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టును రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడానికి ముందు మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాల్లో పైలట్ ప్రాజెక్ట్ను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. ప్రతిరోజూ వందలాది మంది భక్తులు తమకు నచ్చిన భాషలో ఆలయ చరిత్ర, విశిష్టత, పూజా విధానాల గురించి తెలుసుకుని మంచి స్పందన ఇచ్చారని పేర్కొన్నారు.
ఈ సాంకేతికత స్థానిక తెలుగు భక్తుల నుంచి విదేశీ పర్యాటకుల వరకు అందరికీ ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు. ముఖ్యంగా గోదావరి పుష్కరాల సమయంలో ఈ సేవ భక్తులకు ఎంతో సహాయకారిగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో అమలవుతున్న ‘స్వర్ణాంధ్ర విజన్-2047’ లక్ష్య సాధనలో ఇది ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు.
పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ మాట్లాడుతూ, ఈ సాంకేతికత ద్వారా ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. ఏఐ టెక్నాలజీని సాధారణ పర్యాటకుడికి సైతం సులభంగా అర్థమయ్యేలా రూపొందించారని వివరించారు.
ఏపీటీఏ సీఈఓ ఏఏఎల్ పద్మావతి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ గొప్ప వారసత్వ సంపదను ప్రపంచ స్థాయి భారతీయ సాంకేతికతతో కలిపే అరుదైన భాగస్వామ్యం ఇదని అన్నారు. రాబోయే మూడు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని సందర్శించే ప్రతి పర్యాటకుడికి కొత్త అనుభూతిని అందించడమే లక్ష్యమని చెప్పారు.
ఎక్స్ప్లర్జర్ వ్యవస్థాపకుడు, సీఈఓ జితిన్ భాటియా మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యం కావడం తమకు గౌరవంగా భావిస్తున్నామని తెలిపారు. ప్రపంచంలోనే ప్రతి ప్రధాన పర్యాటక ప్రాంతం సందర్శకులతో వారి మాతృభాషలో మాట్లాడే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవబోతోందన్నారు. రాష్ట్ర వారసత్వం, చరిత్ర, ఆధ్యాత్మిక సంప్రదాయాలపై ‘నివు ఏఐ’కు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని వెల్లడించారు.
ప్రస్తుతం ఎక్స్ప్లర్జర్ ప్లాట్ఫారమ్కు 75 దేశాల్లో 2.2 కోట్లకు పైగా వినియోగదారులు ఉన్నారని, జీ-20 సమావేశాల సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తమ ప్లాట్ఫారమ్ను ప్రదర్శించే అవకాశం కూడా లభించిందని జితిన్ భాటియా తెలిపారు.
ఇదిలా ఉండగా, ప్రముఖ సినీనటుడు, సామాజిక సేవకుడు Sonu Sood ఎక్స్ప్లర్జర్ సంస్థలో భాగస్వామి, వాటాదారుగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఒప్పందంతో ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం సాంకేతికంగా కొత్త దశలోకి అడుగుపెడుతుండగా, దేశంలోనే తొలి ‘ఏఐ పవర్డ్ టూరిజం స్టేట్’గా నిలిచే దిశగా రాష్ట్రం ముందుకు సాగుతోంది.
Tags
Be the first to react