Indian Railways: రైలు ప్రయాణికులకు బిగ్ షాక్: ఇంటి నుంచి ఫుడ్ తెచ్చుకుంటున్నారా.. అయితే జాగ్రత్త!
రైలు ప్రయాణంలో ఇంటి భోజనం తినడం తప్పు కాదు కానీ, తిన్న తర్వాత వ్యర్థాలను, ప్లాస్టిక్ ప్లేట్లను సీట్ల కింద పడేసి రైళ్లను అపరిశుభ్రం చేస్తే రైల్వే శాఖ కఠిన చర్యలు తీసుకుంటుంది. ఈస్ట్ రైల్వే జోన్ పరిధిలో జరిగిన ఆకస్మిక తనిఖీల్లో ఒక్క రోజులోనే 1447 కేసులు నమోదై, ప్రయాణికుల నుంచి రూ.2.89 లక్షల జరిమానా వసూలు చేశారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి మెరుపు దాడులు కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు.
రైళ్లలో ఇంటి భోజనం తింటున్నారా? ఒక్క రోజే 1450 కేసులు.. రూ.3 లక్షల ఫైన్!
ఆహారం తెచ్చుకోవడం తప్పు కాదు.. కానీ అలా చేస్తే మాత్రం రైల్వే శాఖ ఊరుకోదు!
రైల్వే అధికారుల మెరుపు దాడులు: భోగీలను గలీజు చేస్తే భారీ జరిమానా తప్పదు
Indian Railways: సాధారణంగా మన దేశంలో కుటుంబంతో కలిసి సుదూర ప్రాంతాలకు రైలు ప్రయాణం చేసేటప్పుడు చాలామంది ఇంటి నుంచే భోజనం లేదా టిఫిన్లు తీసుకెళ్లడానికి ఇష్టపడుతుంటారు. ప్రయాణ ఖర్చులు తగ్గించుకోవడానికో లేక బయటి ఆహారం తింటే ఆరోగ్యం పాడవుతుందనే నమ్మకంతోనో ఇడ్లీ, దోశ, చపాతీ, పులిహోర వంటి పదార్థాలను బాక్సుల్లో సర్దుకుని వెళ్తుంటారు. వాస్తవానికి ఇలా రైళ్లలో ప్రయాణించేటప్పుడు సొంత ఆహారాన్ని తీసుకెళ్లడంపై రైల్వే శాఖ ఎలాంటి నిషేధం విధించలేదు. ఎవరికి నచ్చిన ఫుడ్ వారు నిరభ్యంతరంగా తెచ్చుకుని రైల్లో తినవచ్చు. అయితే తాజాగా ఇంటి నుంచి ఆహారం తెచ్చుకునే ప్రయాణికులకు రైల్వే శాఖ ఒక ఊహించని పెద్ద ట్విస్ట్ ఇచ్చింది.
భోజనం తెచ్చుకోవడం తప్పు కానప్పటికీ, తిన్న తర్వాత ప్రయాణికులు ప్రవర్తిస్తున్న తీరుపై రైల్వే అధికారులు సీరియస్ అయ్యారు. రైలు భోగీలను అత్యంత పరిశుభ్రంగా, అందంగా ఉంచాలనే సంకల్పంతో రైల్వే శాఖ ప్రత్యేక నిబంధనలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఈస్ట్ రైల్వే జోన్ పరిధిలోని వివిధ రైళ్లు, స్టేషన్లలో అధికారులు ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికులు తిన్న తర్వాత మిగిలిపోయిన వ్యర్థాలను, ప్లాస్టిక్ కవర్లను ఎక్కడపడితే అక్కడ పడేస్తూ రైళ్లను అపరిశుభ్రం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇలా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేవలం ఒక్క రోజులోనే సుమారు 1,450 కేసులు నమోదు చేసి, దాదాపు మూడు లక్షల రూపాయల వరకు జరిమానా విధించారు.
రైల్వే అధికారులు జరిపిన ఈ మెరుపు దాడుల్లో ప్రయాణికులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన దృశ్యాలు వెలుగుచూశాయి. చాలామంది భోగీల్లోని సీట్ల కింద, డోర్ల దగ్గర, బాత్రూమ్ల వద్ద తిన్న ఆహార పదార్థాల వ్యర్థాలను పడేసినట్లు అధికారులు నిర్ధారించారు. ముఖ్యంగా ప్లాస్టిక్ ప్లేట్లు, వాటర్ బాటిళ్లు, కవర్లను డస్ట్బిన్లలో వేయకుండా ఇష్టానుసారంగా పడేయడం వల్ల రైళ్లు కంపు కొడుతున్నాయని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా రైళ్ల పరిశుభ్రతకు విఘాతం కలిగిస్తూ ప్రజా ఆస్తికి నష్టం చేకూరుస్తున్న 1,447 మంది ప్రయాణికులపై కేసులు నమోదు చేసి, వారి నుంచి మొత్తం రూ. 2,89,400 జరిమానా కింద వసూలు చేసి గట్టి బుద్ధి చెప్పారు.
ఈస్ట్ రైల్వే జోన్ పరిధిలోని వివిధ డివిజన్ల వారీగా చూసుకుంటే, ఈ తనిఖీల్లో అత్యధికంగా సీల్దా డివిజన్లోనే ఎక్కువ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఒక్క డివిజన్ పరిధిలోనే నియమాలను పాటించని 615 మంది ప్రయాణికులను పట్టుకుని, వారి నుంచి రూ. 1,23,000 జరిమానా వసూలు చేశారు. ఆ తర్వాతి స్థానంలో ఉన్న హౌరా డివిజన్లో మొత్తం 457 మంది ప్రయాణికులపై కేసులు నమోదు చేసి రూ. 91,400 ఫైన్ వేశారు. అలాగే అసన్సోల్ డివిజన్లో రైలు భోగీలను చెత్తతో నింపేసిన 217 మంది నుంచి రూ. 43,400, మాల్డా డివిజన్లో 158 కేసులకు గాను రూ. 31,600 జరిమానా విధించినట్లు రైల్వే శాఖ గణాంకాలను విడుదల చేసింది.
చివరగా రైల్వే అధికారులు ప్రయాణికులకు ఒక కఠినమైన హెచ్చరిక కూడా జారీ చేశారు. ఇప్పటివరకు జరిగిన తనిఖీలు మరియు జరిమానాలు కేవలం ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో కూడా రైళ్లలో ఇలాంటి ఆకస్మిక రైడ్స్ చాలా ముమ్మరంగా జరుగుతూనే ఉంటాయని వారు స్పష్టం చేశారు. రైల్వే శాఖ రూల్స్ బ్రేక్ చేసి రైళ్లను గలీజు చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని కరాఖండిగా చెప్పారు. కాబట్టి రైలు ప్రయాణం చేసే ప్రయాణికులంతా తమ వెంట తెచ్చుకున్న ఆహారాన్ని తిన్న తర్వాత, ఆ వ్యర్థాలను మరియు ప్లాస్టిక్ వస్తువులను భోగీలలో ఉన్న డస్ట్ బిన్లలో మాత్రమే వేసి రైళ్ల పరిశుభ్రతకు పూర్తి స్థాయిలో సహకరించాలని అధికారులు కోరుతున్నారు.
Tags
Be the first to react