Railways: భారతీయ రైల్వేల్లో టికెట్ బుకింగ్ నిబంధనల్లో మార్పు.. అడ్వాన్స్ బుకింగ్ కాలం 60 రోజులకు తగ్గింపు!
Railways: భారతీయ రైల్వేలు ప్రయాణికులకు సంబంధించిన అడ్వాన్స్ టికెట్ బుకింగ్ నిబంధనల్లో కీలక మార్పులు ప్రకటించాయి. ఇప్పటివరకు 120 రోజుల ముందుగా టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉండగా, ఇకపై ఆ కాలాన్ని 60 రోజులకు తగ్గిస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.
భారతీయ రైల్వే కీలక నిర్ణయం.. 120 రోజుల బుకింగ్కు బై బై..
నవంబర్ 1 నుంచి కొత్త రైల్వే టికెట్ బుకింగ్ నిబంధనలు..
భారతీయ రైల్వేలు ప్రయాణికులకు సంబంధించిన అడ్వాన్స్ టికెట్ బుకింగ్ నిబంధనల్లో కీలక మార్పులు ప్రకటించాయి. ఇప్పటివరకు 120 రోజుల ముందుగా టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉండగా, ఇకపై ఆ కాలాన్ని 60 రోజులకు తగ్గిస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.
ఈ కొత్త నిబంధన నవంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. అయితే అక్టోబర్ 31 వరకు మాత్రం పాత విధానం ప్రకారం 120 రోజుల ముందుగా బుకింగ్ చేసుకునే అవకాశం కొనసాగుతుంది అని రైల్వేలు స్పష్టం చేశాయి.
కొత్త నిబంధన ప్రకారం, 60 రోజుల అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్కు మించిన తేదీలకు చేసిన బుకింగ్లను కూడా రద్దు చేసుకునే (క్యాన్సిల్) అవకాశం మాత్రం యథావిధిగా కొనసాగుతుందని రైల్వే శాఖ తెలిపింది.
అయితే కొన్ని ప్రత్యేక డే-టైమ్ ఎక్స్ప్రెస్ రైళ్లకు ఈ మార్పు వర్తించదని రైల్వేలు వెల్లడించాయి. ముఖ్యంగా తాజ్ ఎక్స్ప్రెస్, గోమతి ఎక్స్ప్రెస్ వంటి రైళ్లకు ఇప్పటికే తక్కువ అడ్వాన్స్ బుకింగ్ వ్యవధి ఉండటంతో వాటిలో ఎలాంటి మార్పు ఉండదని పేర్కొన్నారు.
అలాగే విదేశీ పర్యాటకుల కోసం మాత్రం ప్రస్తుత నిబంధనలే కొనసాగుతాయి. అంటే వారు 365 రోజుల ముందుగానే టికెట్లు బుక్ చేసుకునే అవకాశం యథావిధిగా ఉంటుందని రైల్వేలు తెలిపాయి. ఈ మార్పు ప్రయాణికుల బుకింగ్ విధానాన్ని మరింత సమర్థవంతంగా మార్చడమే లక్ష్యంగా తీసుకున్న చర్యగా రైల్వే శాఖ పేర్కొంది.
Tags
Be the first to react