తెలంగాణలో అరుదైన ఘటన.. 4.40 కిలోల శిశువుకు సహజ ప్రసవం చేసిన వైద్యులు!
4.40 kg Baby Delivered Naturally: ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉంటున్నాయనే విషయాన్ని చౌటుప్పల్లో జరిగిన ఓ అరుదైన ప్రసవం మరోసారి చాటిచెప్పింది. చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య బృందం 4.40 కిలోల బరువున్న మగ శిశువుకు సహజ ప్రసవం ద్వారా జన్మనిచ్చింది. సాధారణంగా అధిక బరువున్న శిశువుల ప్రసవం వైద్యపరంగా సవాలుగా మారే అవకాశం ఉన్నప్పటికీ, వైద్యుల పర్యవేక్షణలో ఈ ప్రసవం విజయవంతంగా జరిగింది.
చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రిలో అరుదైన సహజ ప్రసవం.. 4.40 కిలోల బరువుతో మగ శిశువు జననం..
చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల ఘనత.. 4.40 కిలోల బాబుకు నార్మల్ డెలివరీ..
ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉంటున్నాయనే విషయాన్ని చౌటుప్పల్లో జరిగిన ఓ అరుదైన ప్రసవం మరోసారి చాటిచెప్పింది. చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య బృందం 4.40 కిలోల బరువున్న మగ శిశువుకు సహజ ప్రసవం ద్వారా జన్మనిచ్చింది. సాధారణంగా అధిక బరువున్న శిశువుల ప్రసవం వైద్యపరంగా సవాలుగా మారే అవకాశం ఉన్నప్పటికీ, వైద్యుల పర్యవేక్షణలో ఈ ప్రసవం విజయవంతంగా జరిగింది.
జిల్లా ఆస్పత్రుల సమన్వయాధికారి డాక్టర్ సూర్యశ్రీరావు వెల్లడించిన వివరాల ప్రకారం.. కొయ్యలగూడెం గ్రామానికి చెందిన పల్రెడ్డి హేమ (25) గురువారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో పురిటి నొప్పులతో చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చారు. అక్కడ విధుల్లో ఉన్న వైద్యాధికారి డాక్టర్ అవినాశ్ పర్యవేక్షణలో వైద్య బృందం ఆమెకు అవసరమైన వైద్య సేవలు అందించింది. శుక్రవారం తెల్లవారుజామున 1.42 గంటలకు ఆమె 4.40 కిలోల బరువున్న మగ శిశువుకు సహజ ప్రసవం ద్వారా జన్మనిచ్చారు.
ఈ ప్రసవంలో పీడియాట్రీషియన్లు డాక్టర్ కావేరీ, డాక్టర్ అజీమా, నర్సింగ్ ఆఫీసర్లు శారద, ధనమ్మ, నాగవరదాయినులు కీలకంగా వ్యవహరించారు. వైద్యులు, నర్సింగ్ సిబ్బంది సమన్వయంతో తల్లికి అవసరమైన సహకారం అందించడంతో ప్రసవం సజావుగా పూర్తయిందని అధికారులు తెలిపారు.
హేమ గర్భధారణ సమయంలో క్రమం తప్పకుండా చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రిలోనే ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ఆస్పత్రిలోని గైనకాలజిస్టు, యోగా మాస్టర్, యునాని వైద్యురాలు, ఫిజియోథెరపిస్టులు ఇచ్చిన సూచనలను పాటించారు. వైద్యుల పర్యవేక్షణలో యోగాసనాలు, తగిన వ్యాయామాలు చేశారు. గర్భధారణ సమయంలో తీసుకున్న ఈ జాగ్రత్తలు ఆమె ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు తోడ్పడ్డాయని ఆస్పత్రి అధికారులు వివరించారు. అయితే శిశువు అధిక బరువుతో ఉన్నప్పటికీ సహజ ప్రసవం సాధ్యమవడానికి తల్లి ఆరోగ్య పరిస్థితి, ప్రసవ సమయంలోని వైద్యపరమైన పరిస్థితులు కూడా అనుకూలించాయని పేర్కొన్నారు.
హేమకు ఇది రెండో కాన్పు. గతంలో తొలి ప్రసవంలోనూ నాలుగు కిలోల బరువున్న శిశువుకు సహజ ప్రసవం జరిగినట్లు డాక్టర్ సూర్యశ్రీరావు తెలిపారు. ఈసారి కూడా వైద్యుల పర్యవేక్షణలో సహజ ప్రసవం జరగడం విశేషమని చెప్పారు.
చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భిణులకు అన్ని వేళలా వైద్య సేవలు అందిస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఈ నెలలో ఇప్పటివరకు మొత్తం 40 ప్రసవాలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న వైద్య సేవలను గర్భిణులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, వైద్యుల సలహాలు పాటించడం తల్లి, బిడ్డ ఆరోగ్యానికి ముఖ్యమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Tags
Be the first to react