జేఎన్‌టీయూలో రివర్స్ బోర్వెల్! 14 ఏళ్లుగా! నీటి సంక్షోభానికి అసలైన పరిష్కారం!

Hyderabad Water Crisis: హైదరాబాద్‌లో పెరుగుతున్న నీటి ఎద్దడికి పరిష్కారంగా కూకట్‌పల్లి జేఎన్‌టీయూహెచ్ (JNTUH) అమలు చేస్తున్న 'రివర్స్ బోర్వెల్' టెక్నాలజీ ఆదర్శంగా నిలుస్తోంది. 2010లో రూ.40 లక్షలతో 11 ప్రాంతాల్లో 22 రీచార్జ్ బోర్లను ఏర్పాటు చేసి, 100 ఎకరాల క్యాంపస్‌లో పడే వర్షపు నీటిని జియో టెక్స్‌టైల్, సాండ్ ఫిల్టర్ల ద్వారా 200 అడుగుల లోతుకు పంపుతున్నారు. ఫలితంగా 14 ఏళ్లుగా క్యాంపస్‌కు ఒక్క వాటర్ ట్యాంకర్ కూడా అవసరం రాలేదని, 10 నుంచి 40 అడుగుల లోతులోనే సమృద్ధిగా నీళ్లు లభిస్తున్నాయని ప్రొఫెసర్ గిరిధర్ తెలిపారు. ఈ సాంకేతికతకు రెండు పేటెంట్లు రాగా, టీటీడీ, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లోనూ ఇది అమలవుతోంది.

జేఎన్‌టీయూలో రివర్స్ బోర్వెల్
జేఎన్‌టీయూలో రివర్స్ బోర్వెల్
  • దక్కన్ రాతి నేలల్లోనూ నీటి గండం దాటించిన రివర్స్ బోర్వెల్స్!

  • వర్సిటీ పరిధిలో 10 అడుగులకే నీళ్లు!.. కేపీహెచ్‌బీ కాలనీలకూ మేలు!

  • వాటర్ ప్రాజెక్టుకు రెండు పేటెంట్లు సొంతం!.. టీటీడీలోనూ ఇదే మోడల్ అమలు!

Telangana: హైదరాబాద్ నగరంలో భూగర్భ జలాలు అడుగంటిపోతూ, ఐటీ కారిడార్‌లో ట్యాంకర్ల కోసం కటకటలాడుతున్న ప్రస్తుత తరుణంలో కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూ క్యాంపస్ సరికొత్త మార్గాన్ని చూపించింది. సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న క్యాంపస్‌లో పడే వర్షపు నీరు చుక్క కూడా బయటకు పోకుండా భూమిలోకి ఇంకేలా 2010లోనే శాస్త్రీయ ప్రణాళిక రూపొందించారు. అప్పట్లో వర్షం పడితే క్యాంపస్ నీరంతా బయటకు వెళ్లి సమీపంలోని రైతు బజార్ వద్ద రెండు నుంచి మూడు అడుగుల మేర వరద నిలిచేది. దీన్ని నివారించి, భూగర్భ జల నిల్వలను పెంచేందుకు ‘రివర్స్ బోర్వెల్’ ప్రాజెక్టును అమలు చేశారు.

దక్కన్ రాతి పొరలను ఛేదించే రివర్స్ బోర్వెల్ కాన్సెప్ట్

హైదరాబాద్ దక్కన్ పీఠభూమిలో ఆరు నుంచి ఎనిమిది అడుగుల లోతులోనే గట్టి రాతి పొరలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరంలోని ఒండ్రు మట్టిలా ఇక్కడ నీరు సహజంగా భూమిలోకి ఇంకదు. దీనికి పరిష్కారంగా సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్, స్టేట్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ సహకారంతో దాదాపు రూ.40 లక్షల వ్యయంతో 11 ప్రధాన ప్రదేశాలలో 22 రీచార్జ్ బోర్వెల్స్‌ను ఏర్పాటు చేశారు. క్యాంపస్ వాలు (Slope), వర్షపు నీటి ప్రవాహ దిశను అధ్యయనం చేసి 100 నుంచి 200 అడుగుల లోతు వరకు బోర్లను డ్రిల్ చేసి, భూగర్భంలోని సహజ రిజర్వాయర్లకు (Aquifers) వర్షపు నీటిని నేరుగా చేరేలా చేశారు.

అత్యాధునిక 4 దశల ఫిల్ట్రేషన్ వ్యవస్థ

వర్షపు నీటితో పాటు వచ్చే ఆకులు, చెత్తాచెదారం, సూక్ష్మ ధూళి కణాలు భూమి లోపలికి వెళ్లి కలుషితం కాకుండా 15 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు, 10 అడుగుల లోతుతో ఇంకుడు గుంత తరహా నిర్మాణాలను చేపట్టారు.

  • జియో టెక్స్‌టైల్ మెంబ్రేన్: అతి సన్నని మట్టి కణాలు, ప్లాస్టిక్, ఆకులను అడ్డుకునే జల్లెడ.

  • కోర్స్ సాండ్ (3 అడుగులు): బ్యాక్టీరియా మరియు చిన్న మలినాలను నిరోధించే ఇసుక పొర.

  • కంకర/చిప్స్ (5 మి.మీ & 20 మి.మీ): 4 అడుగుల మేర కంకర పొరలతో నీటిని సహజంగా శుద్ధి చేయడం.

  • కేసింగ్ పైపుకు 1 అంగుళం రంధ్రాలు: వడపోసిన స్వచ్ఛమైన నీటిని క్షణాల్లో వర్టికల్ పైప్‌లైన్ ద్వారా నేరుగా భూగర్భ పొరల్లోకి పంపించడం.

2010 నుంచి వాటర్ ట్యాంకర్ వాడని వర్సిటీ

ఈ ప్రాజెక్ట్‌ను నిరంతరం పర్యవేక్షిస్తున్న వాటర్ రిసోర్సెస్ విభాగ ప్రొఫెసర్ ఎం.వి.ఎస్.ఎస్. గిరిధర్ మాట్లాడుతూ.. 2010 నుంచి ఇప్పటివరకు క్యాంపస్ అవసరాల కోసం ఒక్క వాటర్ ట్యాంకర్‌ను కూడా కొనుగోలు చేయాల్సిన అవసరం రాలేదని స్పష్టం చేశారు. సాధారణ వర్షాకాలంలో ఇక్కడ భూగర్భ జలాలు కేవలం 10 అడుగుల (3 మీటర్ల) లోతులోనే లభ్యమవుతాయి. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గినప్పటికీ 40 నుంచి 45 అడుగుల లోతులోనే పుష్కలంగా నీరు అందుబాటులో ఉంది. జేఎన్‌టీయూ భూగర్భ జల మట్టం పెరగడం వల్ల కేపీహెచ్‌బీ 4వ, 6వ ఫేజ్ కాలనీలలోని స్థానిక బోర్లలోనూ నీటి లభ్యత గణనీయంగా పెరిగింది.

రెండు జాతీయ పేటెంట్లు – ఇతర సంస్థలకు స్ఫూర్తి

ఈ వినూత్న రీచార్జ్ టెక్నాలజీకి గుర్తింపుగా జేఎన్‌టీయూహెచ్‌కు రెండు ప్రతిష్టాత్మక జాతీయ పేటెంట్లు లభించాయి. ఇదే నమూనాను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD), ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ఈపీటీఆర్‌ఐHyderabadWaterCrisis మరియు పలు గేటెడ్ కమ్యూనిటీలు విజయవంతంగా అమలు చేశాయి. తోటల పెంపకానికి శుద్ధి చేసిన మురుగునీటిని (STP వాటర్) వాడుతూ, వాషింగ్ మెషీన్ నుంచి వచ్చే నీటిని ఫ్లోర్ క్లీనింగ్‌కు ఉపయోగిస్తున్నారు. ప్రతి ఒక్కరూ లీకేజీలు అరికట్టి, రన్నింగ్ ట్యాప్‌లు ఆపి రోజుకు కనీసం 5 లీటర్ల నీటిని ఆదా చేయాలని ప్రొఫెసర్ గిరిధర్ పిలుపునిచ్చారు.

Tags

Be the first to react

Latest