Technology: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన డేటా ఎక్కడ?
ఆఫ్రికా, యూరప్ దేశాల్లోనూ చుక్కలే..
భారత్ ఎందుకు ఆదర్శంగా నిలుస్తోంది?
Internet Prices 2026: నేటి కాలంలో అన్నం లేకపోయినా ఉండగలరేమో కానీ, చేతిలో ఫోన్.. అందులో ఇంటర్నెట్ లేకపోతే క్షణం గడవని పరిస్థితి. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి చిన్న పనికి డిజిటల్ డేటాపైనే ఆధారపడుతున్నాం. అయితే మన దేశంలో అతి తక్కువ ధరకే లభిస్తున్న ఇంటర్నెట్ ప్రపంచమంతా అలాగే ఉంటుందని అనుకుంటే పొరపాటే. కొన్ని దేశాల్లో నెట్ వాడాలంటే సామాన్యుల జేబులు ఖాళీ అవ్వాల్సిందే ఆ దేశాలు ఇప్పుడు చూద్దాం.
మనం ఇక్కడ నెలకు రూ. 300 లేదా రూ. 400 లతో అన్‌లిమిటెడ్ డేటా వాడుతుంటే, సోలమన్ ఐలాండ్స్ వంటి ద్వీప దేశాల్లో పరిస్థితి భయంకరంగా ఉంది. అక్కడ నెలవారీ ఇంటర్నెట్ బిల్లు సగటున 457 డాలర్లు.. అంటే మన భారత కరెన్సీలో దాదాపు రూ. 38,000. ఆ దేశం సముద్రం మధ్యలో ఉండటం వల్ల అండర్ వాటర్ కేబుల్స్ వేయడం కష్టమవ్వడమే ఈ అధిక ధరలకు ప్రధాన కారణం. అలాగే దుబాయ్ (UAE) లో కూడా డేటా చాలా ఖరీదు. అక్కడ కేవలం 1 Mbps స్పీడ్ కోసం మనం రూ. 360 వరకు చెల్లించాల్సి ఉంటుంది.
ఆఫ్రికా ఖండంలోని జింబాబ్వే, ఘనా వంటి దేశాల్లో ఇంటర్నెట్ ధరలు చుక్కలను తాకుతున్నాయి. అక్కడ ఒక్క GB డేటా ధర సుమారు రూ. 3,600 వరకు ఉంటుంది. ఇక సంపన్న దేశమైన స్విట్జర్లాండ్‌లో కూడా నెట్ ధరలు ఎక్కువే. అక్కడ పర్వత ప్రాంతాలు ఎక్కువగా ఉండటం వల్ల ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ వేయడానికి అయ్యే మౌలిక సదుపాయాల ఖర్చు వినియోగదారుల నెత్తిన పడుతోంది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న పొరుగు దేశం పాకిస్థాన్ కూడా ఈ జాబితాలో మొదటి పది స్థానాల్లోనే ఉంది.
ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇంటర్నెట్ విప్లవంలో భారత్ దూసుకుపోతోంది. మన దేశంలో 1 Mbps వేగానికి అయ్యే ఖర్చు సగటున రూ. 7 లోపే. దీనివల్ల సామాన్యుడు కూడా హై-స్పీడ్ డేటాను సులువుగా పొందగలుగుతున్నాడు. ప్రస్తుతం మన దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 90 కోట్లు దాటడానికి ప్రధాన కారణం టెలికాం కంపెనీల మధ్య ఉన్న ఆరోగ్యకరమైన పోటీయే. జియో, ఎయిర్‌టెల్ వంటి సంస్థలు తక్కువ ధరకే ప్లాన్లను ఆఫర్ చేస్తుండటంతో డిజిటల్ ఇండియా వేగంగా అభివృద్ధి చెందుతోంది.
ధరలు ఎందుకు మారుతుంటాయి
ప్రతి దేశంలో నెట్ ధరలు ఒకేలా ఉండవు. దీనికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తాయి:
భౌగోళిక పరిస్థితులు: ద్వీప దేశాలు లేదా కొండ ప్రాంతాల్లో నెట్‌వర్క్ ఏర్పాటు చేయడం కష్టం.
మౌలిక సదుపాయాలు: ఫైబర్ కేబుల్స్, శాటిలైట్ లింక్స్ ఏర్పాటుకు అయ్యే ఖర్చు.
పోటీ: మార్కెట్‌లో ఎక్కువ కంపెనీలు ఉంటే పోటీ వల్ల ధరలు తగ్గుతాయి, లేదంటే గుత్తాధిపత్యం పెరిగి రేట్లు పెరుగుతాయి.
ఇంటర్నెట్ అనేది కేవలం విలాసం మాత్రమే కాదు, అది ప్రాథమిక హక్కుగా మారుతోంది. భౌగోళిక అడ్డంకులు పోటీ లేకపోవడం వల్ల కొన్ని దేశాల్లో ధరలు భారంగా ఉన్నప్పటికీ, భారత్ మాత్రం ఈ విషయంలో ప్రపంచానికి దిక్సూచిలా నిలుస్తోంది.