AI News 2026: సాంకేతిక దిగ్గజం గూగుల్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలలో కీలక మార్పులు చేస్తోంది. ఇప్పటివరకు కేవలం డబ్బులు చెల్లించి సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వారికి మాత్రమే పరిమితమైన 'పర్సనల్ ఇంటెలిజెన్స్' ఫీచర్‌ను ఇప్పుడు ఉచిత వినియోగదారులకు కూడా అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతానికి అమెరికాలోని యూజర్లకు ఈ సేవలు అందుబాటులోకి రాగా, త్వరలోనే మిగిలిన దేశాలకు కూడా విస్తరించే అవకాశం ఉంది. జెమిని యాప్, క్రోమ్ బ్రౌజర్ గూగుల్ సెర్చ్‌లలో ఈ కొత్త ఫీచర్ పనిచేస్తుంది.
సాధారణంగా మనం AIని ఏదైనా అడిగితే అది ఇంటర్నెట్‌లో ఉన్న సమాచారాన్ని వెతికి చెబుతుంది. కానీ ఈ 'పర్సనల్ ఇంటెలిజెన్స్' అలా కాదు. ఇది మీ గూగుల్ ఖాతాలో ఉన్న జీమెయిల్ (Gmail), గూగుల్ డ్రైవ్ ఫొటోస్ వంటి యాప్స్‌తో అనుసంధానమై ఉంటుంది. ఉదాహరణకు, మీరు మీ కారు సర్వీసింగ్ ఎప్పుడు చేయించాలో అడిగితే, ఇది మీ మెయిల్స్‌ని వెతికి మీ కారు మోడల్ ఏంటి, గతంలో ఎప్పుడు సర్వీసింగ్ చేయించారు అనే వివరాల ఆధారంగా కచ్చితమైన సమాధానం ఇస్తుంది. అంటే ఇది మీ వ్యక్తిగత అసిస్టెంట్‌లా పనిచేస్తుందన్నమాట.
ఈ ఫీచర్ కేవలం పాత డేటాను వెతకడమే కాకుండా, సందర్భాన్ని బట్టి సలహాలు కూడా ఇస్తుంది. మీరు ఏదైనా వంటకం గురించి అడిగారనుకోండి, మీ మెడికల్ రికార్డ్స్‌లో మీకు 'లాక్టోస్ ఇంటాలరెన్స్' పాల పదార్థాలు పడకపోవడం ఉన్నట్లు గమనిస్తే.. వెంటనే ఆ వంటకంలో పాలకు బదులుగా వాడగలిగే ప్రత్యామ్నాయాలను ఇది సూచిస్తుంది. ఇలా ప్రతి విషయాన్ని యూజర్ అవసరాలకు తగ్గట్టుగా మలిచి చెప్పడం దీని ప్రత్యేకత.
వినియోగదారుల వ్యక్తిగత డేటాను ఉపయోగిస్తుండటంతో ప్రైవసీ గురించి ఆందోళనలు రావడం సహజం. అయితే గూగుల్ దీనిపై స్పష్టత ఇచ్చింది. ఈ ఫీచర్ పూర్తిగా 'ఆప్ట్-ఇన్' (Opt-in) పద్ధతిలో పనిచేస్తుంది. అంటే యూజర్ స్వయంగా అనుమతి ఇస్తేనే ఇది ఆన్ అవుతుంది. అంతేకాకుండా, మీ వ్యక్తిగత డేటాను గూగుల్ తన AI మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి వాడబోమని కంపెనీ హామీ ఇచ్చింది. ఆరోగ్యం వంటి సున్నితమైన విషయాల్లో యూజర్ అడగనిదే ప్రోయాక్టివ్‌గా సమాచారం సేకరించబోమని స్పష్టం చేసింది.
గూగుల్ తీసుకున్న ఈ నిర్ణయం టెక్ రంగంలో కొత్త చర్చకు దారితీసింది. శామ్సంగ్ వంటి దిగ్గజ కంపెనీలు కూడా తమ కొత్త గెలాక్సీ S26 సిరీస్ ఫోన్లలో జెమిని ఆధారిత ఆటోమేషన్ టూల్స్‌ను ప్రవేశపెడుతున్నాయి. సెర్చ్ ఇంజన్ స్థాయి నుంచి పర్సనల్ అసిస్టెంట్ స్థాయికి గూగుల్ ఎదుగుతున్న క్రమంలో ఈ 'పర్సనల్ ఇంటెలిజెన్స్' మైలురాయిగా నిలవనుంది. టెక్నాలజీ మన అవసరాలను ముందే పసిగట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఈ అప్‌డేట్ నిరూపిస్తోంది.