రాజధాని అమరావతి భూసమీకరణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం వేగవంతం చేసింది.
ఇందులో భాగంగా రెండో విడత భూసమీకరణకు ప్రభుత్వం పూనుకుంది. ఇదివరకు జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, ఆమోదించిన ప్రతిపాదనలకు అనుగుణంగా మలిదశ సమీకరణ దిశగా ముందడుగు వేసింది. రెండో విడత భూసమీకరణకు సంబంధించిన ప్రకటన (నోటిఫికేషన్) కొద్దిసేపటి కిందటే విడుదలైంది.
రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ పరిధిలోకి వచ్చే ఏడు గ్రామాల్లో తాజా భూసమీకరణ చోటు చేసుకుంది. ఈ విడతలో మొత్తం 16,666.56 ఎకరాలను ప్రభుత్వం సమీకరించనుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఇదివరకే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. మంత్రివర్గం ఆమోదం తెలిపిన నాలుగంటే నాలుగు రోజుల్లోనే ప్రకటన వెలువడటం ప్రభుత్వం ఎంత పట్టుదలతో ఉందో తెలియజేస్తోంది.
మొదటి విడతలో 34,400 ఎకరాలు సేకరించిన ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ), తాజాగా 16,666.56 ఎకరాల సమీకరణతో ఈ సంఖ్య 50,000కు చేరినట్టయింది. రాజధాని నిర్మాణం కోసం మొదటి విడత భూసమీకరణలో మొత్తం 28,526 మంది రైతులు 34,400 ఎకరాలను ప్రాధికార సంస్థకు అప్పగించారు. సుమారు 16,000 ఎకరాల ప్రభుత్వ భూమితో కలుపుకొని మొత్తం 74,000 ఎకరాల్లో రాజధాని నిర్మాణం జరగనుంది.
రాజధాని ప్రాంతంలో రైలు నిలుపుదల స్థానం, రైలు మార్గం, క్రీడా నగరం (స్పోర్ట్స్ సిటీ), లోపలి వలయ రహదారి (ఇన్నర్ రింగ్ రోడ్డు) వంటి కీలక అవసరాల కోసం ఈ 16,666 ఎకరాల భూమిని ప్రభుత్వం సమీకరించనుంది. ఇందులో ప్రాధికార సంస్థ పరిధిలోకి వచ్చే వైకుంఠపురం, పెదమద్దూరు, యండ్రాయి, కర్లపూడిల్లో 7,562 ఎకరాలు ఉన్నాయి.
అలాగే వడ్డేమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమిలో 9,104.57 ఎకరాలను ప్రభుత్వం సమీకరిస్తుంది. ఆయా గ్రామాల్లో సుమారు 3,828 ఎకరాల మేర ప్రభుత్వ భూమి ఉంది. రెండో విడతలో భాగంగా ఈ భూమి మొత్తాన్నీ కూడా ప్రభుత్వం సమీకరిస్తుంది.
ఈ విడతలో భూములు ఇచ్చిన రైతులకు కూడా గతంలో అమలు చేసిన పరిహారాలే వర్తిస్తాయి. జరీబు (మాగాణి) భూమికి నివాస స్థలం 1,000 గజాలు, వాణిజ్య స్థలం 450 గజాలు ఇవ్వాలని గతంలోనే నిర్ణయించారు. మెట్ట భూములకు నివాస స్థలం 1,000 గజాలు, వాణిజ్య స్థలం 250 గజాలు పరిహారంగా ఇస్తుంది.