సాంకేతికత (టెక్నాలజీ) మరియు అభివృద్ధి విషయాల్లో అమెరికా భారతదేశం కంటే ఎంతో ముందంజలో ఉందనే విషయం వాస్తవమే అయినప్పటికీ, ఒక కీలకమైన అంశంలో మాత్రం అమెరికా మన దేశానికి దరిదాపుల్లో కూడా లేదని ఒక అమెరికా మహిళా వ్యాపారవేత్త స్వయంగా అంగీకరించారు. వినియోగదారులకు వస్తువులను చేర్చడంలో (డెలివరీ సిస్టమ్) భారత్ చాలా చాలా ముందు ఉందని, ఈ విషయంలో భారత్ ఇప్పుడున్న స్థితి అమెరికాకు 2030 నాటికి మాత్రమే సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలు చేసినవారు అమెరికాలోని ప్రముఖ హెల్త్ కేర్ కంపెనీ 'ట్రైఫెచ్' (TryFect) సీఈవో వారుణి సర్వాల్. ఆమె మాటల్లో చెప్పాలంటే, శాన్ ఫ్రాన్సిస్కో వంటి నగరాల్లో సెల్ఫ్-డ్రైవింగ్ కార్లు ఉన్నప్పటికీ, భారత్‌లో మాత్రం ఏదైనా వస్తువును ఆర్డర్ చేస్తే కేవలం 10 నిమిషాల్లో చేతికి అందుకునే అవకాశం ఉందని, ఇది అద్భుతమని ఆమె కొనియాడారు.
తాజాగా భారత పర్యటనకు వచ్చిన వారుణి, మూడు వారాల పాటు దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమెకు ఎదురైన ఒక అనుభవం, భారత్ డెలివరీ వ్యవస్థ సామర్థ్యాన్ని ఆమెకు కళ్ళకు కట్టింది. ఝార్ఖండ్‌లోని రాంచీలో జరిగిన ఒక వివాహ వేడుకకు ఆమె హాజరయ్యారు. పెళ్లి వేడుకల్లో భాగంగా నిర్వహించిన 'హల్దీ' కార్యక్రమానికి హాజరయ్యేందుకు చివరి నిమిషంలో తమ వద్ద సరైన దుస్తులు లేవని గుర్తించారు.
ఆ సమయంలో, వారుణి తన హోటల్ గదిలో ఒకవైపు సిద్ధమవుతూనే, ప్రముఖ క్విక్-కామర్స్ యాప్ అయిన బ్లింకిట్ (Blinkit) లో దుస్తులకు ఆర్డర్ పెట్టారు. ఆర్డర్ పెట్టిన తర్వాత కేవలం పదిహేను నిమిషాల్లోనే తమకు దుస్తులు చేతికి అందడం ఆమెను తీవ్రంగా ఆశ్చర్యపరిచింది.
ఇదే పరిస్థితి అమెరికాలో ఎదురై ఉంటే, తక్షణం దుస్తులు కొనడం సాధ్యమయ్యేది కాదని వారుణి వివరించారు. అమెరికాలో ఇలాంటి అత్యవసర పరిస్థితి వస్తే, కారు బుక్ చేసుకుని దగ్గర్లోని మాల్‌కు వెళ్లాల్సి వచ్చేది. ఒకవేళ అమెజాన్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో ఆర్డర్ చేసినా, ఆ వస్తువు చేతికి అందడానికి కనీసం రెండు రోజులు పడుతుందని ఆమె తెలిపారు. అత్యంత వేగంగా వస్తువులను డెలివరీ చేసే విషయంలో భారత్ సాధించిన ఈ పురోగతి అసాధారణమైనదని, ఇది వినియోగదారుల జీవితాన్ని సులభతరం చేస్తుందని వారుణి సర్వాల్ ప్రశంసించారు.