గత ఐదేళ్ల పాటు కుదేలైన సాగునీటి రంగాన్ని కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు ప్రగతి పథంలో పయనింప చేస్తున్నారని సాగునీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సాగునీటి ప్రాజెక్టులను వేగంగా నిర్మిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పురోగమిస్తోంది. 17 నెలల కాలంలోనే సాగునీటి రంగాన్ని ప్రగతి పథంలో నిలబెట్టాం. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే సాగునీటి రంగ ఎన్నికలు నిర్వహించాం.
గత ప్రభుత్వంలో సాగునీటి ప్రాజెక్టులు, డ్యామ్‌లు, కాలువల మరమ్మతులు, రిపేయిర్లకు కూడా నిధులు కేటాయించలేదు. సాగునీరు సక్రమంగా పారక చివరి ఆయకట్టు నీరు అందలేదు. జగన్ పాలనలో ప్రతి నియోజకవర్గంలో 5 వేల ఎకరాల నుంచి 20 వేల ఎకరాల వరకు సాగు దిగుబడి తగ్గిపోయింది. వ్యవసాయం కుంటుపడి దిగుబడి తగ్గిపోయింది. రైతులు వలసబాట పట్టేలా జగన్ ప్రభుత్వం చేసింది.
గత ప్రభుత్వంలో ప్రాజెక్టులన్ని ధ్వంసం:
2014-19 మధ్య కాలంలో సాగునీటి ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేయాలనే సంకల్పంతో పనిచేస్తే... అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ పేరుతో పనులను రద్దు చేశాడు. ఇసుక మాఫియాకు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 42 మంది అమాయక ప్రజలు ప్రాణాలను బలిగొన్నాడు.
జగన్ హయాంలో పులిచింతల, పించా డ్యామ్, తుంగభద్ర, గుండ్లకమ్మ ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోయాయి. అలాంటి ప్రాజెక్టులకు రక్షణ ఇవ్వాలని మొదటి 17 నెలల్లోనే ప్రాధాన్యత ఇస్తున్నాం. శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు రూ.200 కోట్లు, ధవళేశ్వరం ప్రాజక్ట్ మరమ్మతులకు రూ.150 కోట్లు విడుదల చేశాం. ఇతర డ్రైయిన్లు, రిజర్వాయర్ల రిపేర్లకు రూ.344 కోట్లతో పనులు చేశాం.
గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి:
గోదావరి పుష్కరాల కంటే ముందే 2027 జులై నాటికి పోలవరం పూర్తి చేయడమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారు. నిర్వాసితులకు ఒక్క ఏడాదిలోనే రూ.1900 కోట్లు అందజేశాం. 2026 నాటికి నిర్వాసితుల పునరావాస కాలనీల నిర్మాణం పూర్తి చేస్తాం. పోలవరం ఎడమ కాలువ పనులు రూ.1,350 కోట్లతో మొదలుపెట్టాం. ఇప్పటివరకు రూ.800 కోట్లు పనులు పూర్తయ్యాయి.
పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్ర పరిశ్రమలకు 20 టీఎంసీలు, విశాఖ జిల్లాకు సాగునీటి అందిస్తాం. జగన్ హయాంలో పోలవరం ప్రాజెక్ట్ డయాఫ్రం వాల్ ధ్వంసం అయింది. 2020 లో ధ్వంసం అయితే 2022 వరకు జగన్ కు తెలియదు. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని జగన్ చేతులేత్తేశాడు. ఉత్తరాంధ్రకు ఉపయోగపడే ప్రాజెక్టు పనులను నిర్వీర్యం చేశాడు.
రాయలసీమకు జీవనాడి హంద్రీనీవా. జగన్ ఐదేళ్ల పాటు అప్పటివరకు జరుగుతున్న పనులను విస్తరణ పేరుతో రద్దు చేశాడు. కనీసం విద్యుత్ మోటర్లకు చెల్లించాల్సిన బిల్లులను కూడా జగన్ చెల్లించలేదు. రూ.3870 కోట్లుతో హంద్రీనీవా పనులు ఏడాదిలో చేసి చూపించి 738 కి.మీ. రాయలసీమలో కృష్ణా జలాలను పారించి రాయలసీమను రతనాల సీమగా చేస్తున్నాం. ఆనాడు శ్రీకృష్ణదేవరాయల పాలనలో ఇలాంటి జలకళ చూశాం.
మళ్లీ చంద్రబాబు పాలనలో చూస్తున్నామని రాయలసీమ రైతులు, ప్రజలు అంటున్నారు. వెలిగొండ ప్రాజెక్టుపై ప్రతి ప్రభుత్వం మాట్లాడుతునే ఉంది కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రమే చేతల్లో చేసి చూపిస్తుంది. మొదటి ఏడాదిలోనే 3 కి.మీ. లైనింగ్ పనులు చేశాం. 4.2 కి.మీ బ్యాలెన్స్ ఉంది. ప్రతి నెల 600 మీటర్ల లైనింగ్ పనులు చేస్తున్నాం. 2026 జూన్ నాటికి పూర్తిచేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం.
ఏ పనిచేయకుండానే వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేసి జగన్ నవ్వులపాలయ్యాడు. రూ.456 కోట్లతో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాం. నిర్వాసితులకు రూ.900 కోట్లు ఇవ్వాల్సి ఉంటే జగన్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. రూ.2,352 కోట్ల నిధులు కేటాయించి లిఫ్ట్ ప్రాజెక్టులకు మరమ్మతులు పర్యవేక్షణకు ఖర్చు చేస్తున్నాం. ఉత్తరాంధ్రలో వంశధార తోటపల్లి, హిరమండలం వంటి అనేక ప్రాజెక్టులను జగన్ నిర్వీర్యం అయ్యాయి. రూ.2000 వేల కోట్లతో రెండేళ్లలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల నిర్మాణానికి చర్యలు తీసుకున్నాం.
కృష్ణా జలాలపై చర్చకు కారణమే జగన్:
కృష్ణా జలాల పంపిణీపై జగన్ లేఖ చూస్తే దొంగే దొంగ దొంగ అన్నట్టు ఉంది. కృష్ణా నదీజలాలపై సమీక్ష చేసే అధికారం ఇచ్చిందే జగన్. తన అసమర్థత కారణంగా నేడు కృష్ణా జలాలపై చర్చ చేయాల్సి వస్తుంది. కృష్ణా జలాల్లో 512 టీఎంసీలు సాధించిన ఘనత చంద్రబాబుది. 2020 అక్టోబర్ లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ భేటీలో కేసీఆర్ కొత్త ప్రతిపాదన తీసుకొస్తే జగన్ మౌనంగా ఉన్నాడే కానీ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. నేడు కూటమి ప్రభుత్వం కృష్ణా జలాలపై బలమైన వాదన వినిపిస్తోంది.
ఆధారాలు లేవు కాబట్టే కేసుల విత్ డ్రా:
ప్రతి జిల్లాలో జగన్ కు ఆస్తులు ఉన్నాయి. తండ్రి పదవిని అడ్డంపెట్టుకొని జగన్ లూటీ చేశాడు. లక్ష కోట్లు సంపాదించాడు. రూ.43 వేల కోట్ల అక్రమ ఆస్తులపై జైలుకు వెళ్లాడు. ఆ డబ్బులతో రాజకీయాల్లోకి వచ్చాడు. చంద్రబాబు రాజకీయ ప్రస్థానం అదికాదు.
కడిగిన ఆణిముత్యం చంద్రబాబు. కావాలనే చంద్రబాబుపై బురద జల్లుతున్నారు. ప్రభుత్వం మద్యం అమ్ముతుందని చెప్పి తన గుప్పిట్లో పెట్టుకొని రూ.వేల కోట్లు మద్యం కుంభకోణం చేశాడు. ఉచిత ఇసుక విధానం ప్రభుత్వం వద్దు ఉన్నదాన్ని ప్రైవేట్ కు అప్పగించాడు, ప్రైవేట్ పరంగా అమ్మాల్సిన మద్యం ప్రభుత్వంలోకి తీసుకొని కోట్లు కొల్లగొట్టాడు. చంద్రబాబుపై ఉన్నవన్ని ఆధారాలు లేని కేసులు, అందుకే కోర్టులు కొట్టేస్తున్నాయి.