భారతీయ రైల్వే దేశంలోని రైలు సదుపాయాలను ఆధునికంగా మార్చడానికి పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోంది. వందే భారత్ రైళ్లు ప్రవేశపెట్టడం ద్వారా ఇప్పటికే వేగవంతమైన ప్రయాణానికి నాంది పలికింది. ఇప్పుడు ప్రపంచ స్థాయి వేగంతో పరిగెత్తే బుల్లెట్ రైళ్లను ప్రవేశపెట్టడానికి కీలకమైన పనులు ప్రారంభించింది. ఈ క్రమంలో కొత్తగా ప్రకటించిన హైదరాబాద్–చెన్నై, హైదరాబాద్–బెంగళూరు బుల్లెట్ రైలు కారిడార్లను వేగవంతం చేస్తోంది.
ప్రస్తుతం రైల్వే హైదరాబాద్–బెంగళూరు బుల్లెట్ రైలు కారిడార్‌పై దృష్టి సారించింది. ఈ రెండు బుల్లెట్ ప్రాజెక్టులకు మొత్తం సుమారు 5.5 లక్షల కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా. ఇందులో భాగంగా హైదరాబాద్–బెంగళూరు మార్గానికి సంబంధించిన ప్రాథమిక సర్వే మొదలైంది. ముంబై–అహ్మదాబాద్ కారిడార్లో ఇప్పటికే పనులు వేగంగా జరుగుతుండగా, దక్షిణ భారత బుల్లెట్ నెట్వర్క్ కూడా అదే దిశగా ముందుకెళ్తోంది.
ఈ కారిడార్ మొత్తం దూరంలో 263 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి కర్నూలు జిల్లాలో గుండా వెళ్తాయి. ట్రాక్ నిర్మాణం జరిగే ప్రాంతాల్లో మట్టిని సేకరించి పరీక్షలు చేస్తున్నారు. ఈ మట్టి బుల్లెట్ రైలు వేగాన్ని తట్టుకునేలా ఉందా, బలమైన ట్రాక్ నిర్మాణానికి అనుకూలంగా ఉందా అనే అంశాలను నిపుణులు పరిశీలిస్తున్నారు. మట్టి నమూనాలు ఈ ప్రాజెక్టులో కీలకపాత్ర పోషిస్తున్నాయి.
జియోటెక్నికల్ మరియు జియోఫిజికల్ పరీక్షల కోసం నిర్మాణ స్థలాల్లో డ్రిల్లింగ్ చేసి మట్టి, రాళ్ల నమూనాలను సేకరిస్తున్నారు. గంటకు 350 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తే బుల్లెట్ రైళ్లకు అవసరమైన ట్రాక్ నిర్మాణం ఎలా ఉండాలి? ఎక్కడ సొరంగాలు లేదా ఎలివేటెడ్ మార్గాలు కావాలి? అన్న విషయాలను ఈ పరీక్షల ద్వారానే నిర్ణయిస్తారు. ఈ దశ పూర్తైతే అసలు నిర్మాణ పనులకు మార్గం సుగమం అవుతుంది.
ఈ మట్టి సర్వేలు పూర్తికావడం హైదరాబాద్–బెంగళూరు బుల్లెట్ రైలు ప్రాజెక్టు అమలులో చాలా ముఖ్యమైన ముందడుగు. ఈ కారిడార్ ద్వారా ప్రయాణ సమయం భారీగా తగ్గడమే కాకుండా, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ప్రాంతాలకు అభివృద్ధి అవకాశాలు పెరుగుతాయి. మొత్తంగా, ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టు దక్షిణ భారత రవాణా వ్యవస్థను కొత్త దిశగా తీసుకెళ్లనుంది.