జర్మనీలో నైపుణ్యం కలిగిన యువకులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని తిరుపతిలోని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి లోకనాథం వెల్లడించారు. కార్పెంటర్లు, స్టీల్ ఫిక్సర్లు, పేవింగ్ స్టోన్ వర్కర్లు, రోడ్డు వర్కర్లు వంటి పనుల్లో నైపుణ్యం ఉన్న వారికి ఈ అవకాశాలు ప్రత్యేకంగా అందుతున్నాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నియామకాలు జరగనున్నాయని ఆయన తెలిపారు. అభ్యర్థులు పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ అర్హత కలిగి ఉండాలి. అదనంగా, కనీసం రెండు సంవత్సరాల పని అనుభవం తప్పనిసరి. గరిష్ట వయస్సు 44 సంవత్సరాలు మాత్రమేనని పేర్కొన్నారు.
ఎన్నుకోబడిన వారికి నెలకు సుమారు రూ.2.57 లక్షల జీతం లభిస్తుందని, ఎనిమిది నెలల కాంట్రాక్టు ఆధారంగా నియామకాలు ఉంటాయని వివరించారు. వసతి, వీసా, ఫ్లైట్ ఛార్జీలు, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి సదుపాయాలు పూర్తిగా ఎంప్లాయర్ భరిస్తారని చెప్పారు. అయితే భోజనం మరియు రోజువారీ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు అభ్యర్థులే చూసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
దరఖాస్తు ప్రక్రియలో భాగంగా అభ్యర్థులు రూ.2 లక్షలు జీఎస్టీతో కూడిన ప్రాసెసింగ్ ఫీజును రెండు విడతల్లో చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పాస్పోర్ట్, రిలీవింగ్ లెటర్, విద్యార్హత సర్టిఫికెట్లు తప్పనిసరి పత్రాలని స్పష్టం చేశారు.
దరఖాస్తులను నవంబర్ 26వ తేదీ వరకు స్వీకరిస్తామని లోకనాథం తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు https://naipun-yam.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చని చెప్పారు. మరిన్ని వివరాల కోసం 91609 12690, 99888 53335 నంబర్లను సంప్రదించవచ్చని సూచించారు.