దేశంలో Employees Pension Scheme (EPS-95) కింద పెన్షన్ పొందుతున్నవారు చాలాకాలంగా కనీస పెన్షన్‌ను రూ.1,000 నుంచి రూ.7,500కు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పెన్షన్ పెంపుపై ప్రభుత్వం చివరకు కీలక ప్రకటన చేసింది. అయితే, డిమాండ్ చేసినట్లుగా వెంటనే పెన్షన్ పెరగబోదని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే లోక్‌సభలో స్పష్టంచేశారు. పెన్షన్ పెంపుపై ఆశగా ఎదురు చూస్తున్న లక్షలాది ఉద్యోగులకు ఈ సమాధానం కొంత నిరాశపరిచేలా మారింది.
మంత్రి చెప్పిన వివరాల ప్రకారం, 2019 మార్చి 31 నాటికి EPS ఫండ్‌లో భారీ ఆర్థిక లోటు (Actuarial Deficit) ఉన్నట్లు తేలింది. అంటే, ఈపీఎస్ ఫండ్ ప్రస్తుతం ఉన్న పెన్షనర్లకు చెల్లించాల్సిన మొత్తాన్ని కూడా పూర్తిగా సమకూర్చలేకపోతున్నదన్న మాట. ఫండ్‌లో రాబడి తక్కువగా ఉండటం, బాధ్యతలు ఎక్కువగా ఉండటం వల్ల పెన్షన్ మొత్తాన్ని ఇప్పుడు పెంచడం సాధ్యం కాదని మంత్రి పరోక్షంగా సూచించారు. ఈ నేపథ్యంలో రూ.7,500 పెన్షన్ పెంపు డిమాండ్ త్వరలో నెరవేరే అవకాశం లేదని స్పష్టం అయింది.
లోక్‌సభ సభ్యుడు మ్హాత్రే అడిగిన ప్రశ్నలకు సమాధానంగా, EPS-95 స్కీమ్ స్వభావం "నిర్వచించిన సహకారం – నిర్వచించిన ప్రయోజనం" (Defined Contribution – Defined Benefit) ఆధారంగా నడుస్తుందని మంత్రి తెలిపారు. ఉద్యోగి జీతంలో 8.33% కంపెనీ పెన్షన్ ఫండ్‌లో వేస్తుంది, అదనంగా 1.16% ను కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ మద్దతుగా అందిస్తుందని చెప్పారు. EPS-95లోని అన్ని ప్రయోజనాలు ఈ నిధుల ద్వారా చెల్లించబడతాయి. ఫండ్‌లో ఇప్పటికే లోటు ఉన్నందున, DA ఇవ్వడం, పెన్షన్ పెంచడం వంటి అదనపు ప్రయోజనాలు ఇవ్వడం ప్రస్తుతం సాధ్యం కాదని స్పష్టం చేశారు.
EPS-95 పెన్షన్ కింద ఉన్నవారి అనేక సమస్యలను కూడా లోక్‌సభలో లేవనెత్తారు — పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ప్రస్తుత పెన్షన్ జీవనానికి సరిపోకపోవడం, DA ఇవ్వకపోవడం, పెన్షనర్ల డిమాండ్లపై ప్రభుత్వ చర్యలు ఏమిటి వంటి అంశాలను ప్రస్తావించారు. దీనికి స్పందించిన శోభా కరంద్లాజే, ఇప్పటికే ప్రభుత్వం కనీస పెన్షన్‌గా నెలకు రూ.1,000 అందిస్తోందని, EPS ఫండ్ ఆరోగ్యంగా ఉండేలా చూసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఫండ్ ప్రస్తుతం సరిపడా ఆదాయం అందించలేకపోవడంతో ప్రభుత్వం ఇప్పటికే అదనపు నిధులు సమకూర్చాల్సి వస్తోందని చెప్పారు.
EPS-95 పథకం సామాజిక భద్రత కోసం రూపొందించబడింది. ఈ స్కీమ్ కింద ఉద్యోగులు 58 ఏళ్ల తర్వాత సాధారణ పెన్షన్ పొందవచ్చు. 50 ఏళ్ల వయస్సు నుండి ముందస్తు పెన్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. సభ్యుడు మరణించినప్పుడు వితంతువు పెన్షన్, రెండు పిల్లలకు 25 ఏళ్ల వరకు చైల్డ్ పెన్షన్, అంగవైకల్యంపై ప్రత్యేక పెన్షన్ వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అయితే, ఫండ్‌లో కొనసాగుతున్న ఆర్థిక లోటు కారణంగా కనీస పెన్షన్ పెంపు ప్రస్తుతం సాధ్యం కాదని కేంద్రం ఇచ్చిన సమాధానం స్పష్టంగా చెబుతోంది.