Strait Of Hormuz: హోర్ముజ్ జలసంధిలో ఆరు నౌకలపై ఇరాన్ దాడులు! మళ్లీ చమురు కోరతలు రానున్నాయా...

ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లపై అమెరికా సైనిక దాడులు జరిపిన వెంటనే, ప్రతీకారంగా హోర్ముజ్ జలసంధిలో యూఎస్‌కు సంబంధించిన ఆరు నౌకలపై ఇరాన్ విరుచుకుపడింది. ఇందులో మూడు ట్యాంకర్లు ధ్వంసమయ్యాయి. అమెరికా మాటలు నమ్మి అనధికార మార్గాల్లో వస్తే దాడులు తప్పవని ఐఆర్‌జీసీ హెచ్చరించింది. కీలక సముద్ర మార్గంలో సైనిక చర్యలు పెరగడంతో అంతర్జాతీయంగా ముడి చమురు రవాణాపై తీవ్ర ప్రభావం పడే పరిస్థితి ఏర్పడింది.

ఆరు నౌకలపై డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ దాడులు
ఆరు నౌకలపై డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ దాడులు
  • చమురు మార్కెట్లలో మళ్లీ గుబులు: హోర్ముజ్ సంక్షోభంతో క్రూడాయిల్ ధరలు భగ్గుమనే ప్రమాదం!

  • అమెరికా మాటలు నమ్మి రావొద్దు: గల్ఫ్ దేశాలు, విదేశీ నౌకలకు ఐఆర్‌జీసీ అల్టిమేటం!

  • ఆయిల్ ట్యాంకర్లలో ఎగసిపడ్డ మంటలు: లైఫ్‌బోట్ల ద్వారా సిబ్బంది సురక్షిత తరలింపు!

Middel East: అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన ముడి చమురు రవాణా మార్గం 'హోర్ముజ్ జలసంధి' వేదికగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. తమ దేశానికి చెందిన ఆయిల్ ట్యాంకర్లపై అమెరికా సైనిక దళాలు జరిపిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) నావికాదళం విరుచుకుపడింది. హోర్ముజ్ జలసంధి గుండా అనుమతి లేకుండా ప్రయాణిస్తున్న మూడు ఆయిల్ ట్యాంకర్లతో పాటు, ఇతర ప్రాంతాల్లో అమెరికాకు సంబంధం ఉన్న మరో మూడు నౌకలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడినట్లు అధికారికంగా ప్రకటించింది.

అమెరికా దాడులకు నేరుగా కౌంటర్

యూఎస్ సెంట్రల్ కమాండ్ దళాలు అంతకుముందు ఇరాన్‌తో సంబంధం ఉన్న మూడు చమురు నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించాయి. ఇందులో ఖార్గ్ దీవి సమీపంలో ఉన్న నౌకతో పాటు మరొకటి పూర్తిగా నిరుపయోగంగా మారాయని, ఒమన్ గల్ఫ్‌లో ఉన్న మూడో ట్యాంకర్ పూర్తిగా నాశనమైందని యూఎస్ వర్గాలు వెల్లడించాయి. దీనికి బదులుగానే తాము అమెరికా నౌకలపై ప్రత్యక్ష దాడులు జరిపి మూడు నౌకలను ధ్వంసం చేశామని, తమ గగనతలం, ప్రాదేశిక జలాల్లోకి చొరబడే ఏ శక్తినైనా వదిలిపెట్టేది లేదని ఐఆర్‌జీసీ స్పష్టం చేసింది.

అనధికార మార్గాలపై ఐఆర్‌జీసీ తీవ్ర హెచ్చరికలు

హోర్ముజ్ జలసంధి, పర్షియన్ గల్ఫ్ సముద్ర ప్రాంతాల్లో రాకపోకలు సాగించే వాణిజ్య నౌకలను ఐఆర్‌జీసీ గట్టిగా హెచ్చరించింది. అమెరికా సైన్యం ఇచ్చే హామీలను నమ్మి ట్రాకింగ్ సిస్టమ్‌లను నిలిపివేసి, అనధికార లేదా ప్రమాదకరమైన మార్గాల్లో నౌకలను నడిపించవద్దని తేల్చిచెప్పింది. అలా ఏదైనా అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వాటిని శత్రు నౌకలుగానే భావించి గురిచూసి దాడి చేస్తామని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తీవ్రస్థాయిలో అల్టిమేటం జారీ చేసింది.

సిబ్బంది తరలింపు – భద్రతా చర్యలు

దాడులకు గురైన నౌకల్లోని సిబ్బందిని రక్షించేందుకు సమీప రెస్క్యూ విభాగాలు చర్యలు చేపట్టాయి. ఒమన్ గల్ఫ్‌లో దాడికి గురైన ట్యాంకర్లలో ఒకదానిలో ముడి చమురు ఉండగా, మరొకటి ఖాళీగా ఉన్నట్లు సమాచారం. మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన సిబ్బంది లైఫ్‌బోట్ల సహాయంతో సురక్షితంగా తీరానికి చేరుకున్నారని, ప్రాణనష్టం జరగలేదని ఇరాన్ మీడియా వెల్లడించింది. అయితే సముద్రంలో నౌకలు దెబ్బతినడం వల్ల ఆ మార్గంలో రవాణా చేస్తున్న ఇతర అంతర్జాతీయ కార్గో షిప్పులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నాయి.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం

ప్రపంచవ్యాప్తంగా రవాణా అయ్యే ముడి చమురులో దాదాపు ఇరవై శాతం వాటా ఈ హోర్ముజ్ జలసంధి గుండానే సాగుతుంది. ఇప్పటికే ఇరు దేశాల మధ్య ఘర్షణల వల్ల ఈ మార్గంలో ప్రతిరోజూ తిరిగే వందలాది నౌకల సంఖ్య భారీగా పడిపోయింది. తాజాగా ఇరువైపులా ట్యాంకర్లు ధ్వంసం కావడం, సైనిక దాడులు తీవ్రతరం కావడంతో గల్ఫ్ దేశాల నుంచి ఆసియా, ఐరోపా దేశాలకు జరిగే సరఫరా గొలుసు దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు మళ్లీ ఆకాశాన్ని తాకే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Tags

Be the first to react

Latest