Kondapalli Srinivas: అంగరంగ వైభవంగా మలేషియా తెలుగు సంఘం 70వ వార్షికోత్సవం! హాజరైన ఎన్నారై మంత్రి కొండపల్లి మరియు మలేషియా రాష్ట్ర ముఖ్యమంత్రి! వివిధ దేశాల ప్రతినిధులు!!
Kondapalli Srinivas: ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్ర-2047గా తీర్చిదిద్దే లక్ష్యంలో ప్రవాసాంధ్రులు కీలక భాగస్వాములు కావాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. విదేశాల్లో సంపాదించిన అనుభవం, సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడులను రాష్ట్ర అభివృద్ధికి వినియోగించాలని కోరారు.
స్వర్ణాంధ్ర-2047 నిర్మాణంలో ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాలి: మంత్రి కొండపల్లి..
రూ.30 లక్షల కోట్ల పెట్టుబడులు.. 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం: మంత్రి కొండపల్లి..
పెనాంగ్: మలేషియా తెలుగు సంఘం (TAM) 70వ ప్లాటినం జూబ్లీ వేడుకలు శనివారం పెనాంగ్ వాటర్‌ఫ్రంట్ కన్వెన్షన్ సెంటర్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పెనాంగ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చౌ కోన్ యో (Chow Kon Yeow) ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని ప్రముఖులు వివరించారు. పినాంగ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు Chow Kon Yeow గారు, ఆంధ్రప్రదేశ్ ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల శాఖ మంత్రి గౌరవనీయులు కొండపల్లి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ఈ పురస్కారం శ్రీ కవుటూరు రత్న కుమార్ గారికి మరియు ప్రముఖ నటుడు, రచయిత శ్రీ తనికెళ్ల భరణి గారికి అందజేశారు.
ఈ వేడుకలకు సుమారు 8 దేశాల నుంచి అంతర్జాతీయ తెలుగు ప్రతినిధులు హాజరయ్యారు. మలేషియాలోని వివిధ ప్రాంతాల నుంచి తెలుగు భాషాభిమానులు, సాంస్కృతిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 600 మందికి పైగా ప్రతినిధులు, అతిథులు, తెలుగు అభిమానుల సమక్షంలో వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
1955లో చిన్న విత్తనంగా.. నేడు మహావృక్షంగా
మలేషియా తెలుగు సంఘం 1955లో చిన్న విత్తనంలా ప్రారంభమై 70 ఏళ్లలో మహావృక్షంగా ఎదిగిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కొనియాడారు. ప్రస్తుతం సుమారు 5 లక్షల మంది తెలుగు ప్రజలకు TAM అండగా నిలుస్తోందని అన్నారు.
TAM ప్రస్థానం ఒక సంస్థ విజయగాథ మాత్రమే కాదని.. ఏడు తరాల కృషికి, మలేషియా తెలుగు సమాజం ఐక్యతకు ప్రతీక అని పేర్కొన్నారు. మలేషియాలో ఉంటూనే ఆ దేశ అభివృద్ధిలో ప్రవాసాంధ్రులు కీలక పాత్ర పోషిస్తున్నారని, అదే సమయంలో తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారని మంత్రి ప్రశంసించారు.
స్వర్ణాంధ్ర-2047లో ప్రవాసాంధ్రుల భాగస్వామ్యం
ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్ర-2047గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్ధి, పెట్టుబడులు, పరిశ్రమలు, సాంకేతికత, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వంటి రంగాల్లో కొత్త అవకాశాలను సృష్టిస్తున్నామని చెప్పారు.
ఈ అభివృద్ధి ప్రయాణంలో ప్రవాసాంధ్రులు కీలక భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. విదేశాల్లో సంపాదించిన వ్యాపార అనుభవం, సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వినియోగించాలని కోరారు. “గడ్డ ఏదైనా.. మన రక్తం తెలుగు.. మన మూలాలు ఆంధ్రప్రదేశ్” అంటూ ప్రవాసాంధ్రుల మాతృభూమితో ఉన్న అనుబంధాన్ని మంత్రి గుర్తుచేశారు.
ఏపీలో పెట్టుబడులు పెట్టండి.. పూర్తి సహకారం
మలేషియాలోని తెలుగు పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కొండపల్లి శ్రీనివాస్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.
ఆహార ప్రాసెసింగ్, తయారీ రంగం, పర్యాటకం, డిజిటల్ సేవలు తదితర రంగాల్లో రాష్ట్రంలో విస్తృత అవకాశాలు ఉన్నాయని వివరించారు. మలేషియాలో సాధించిన వ్యాపార నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానం, అనుభవాన్ని ఏపీకి తీసుకువచ్చి రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
రూ.30 లక్షల కోట్ల పెట్టుబడులు.. 20 లక్షల ఉద్యోగాల లక్ష్యం
ఆంధ్రప్రదేశ్‌లో రూ.30 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ఆరు నూతన పారిశ్రామిక విధానాలను ప్రభుత్వం తీసుకొచ్చిందని మంత్రి తెలిపారు.
MSMEలు, స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు అమరావతితో పాటు విశాఖపట్నం, తిరుపతి, అనంతపురంలో ‘రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్లు’ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఈ కేంద్రాల ద్వారా కొత్త ఆలోచనలు, స్టార్టప్‌లు, చిన్న పరిశ్రమలకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని చెప్పారు.
ప్రవాసాంధ్రుల రక్షణకు ప్రత్యేక సేవలు
విదేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రుల రక్షణ, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. APNRTS ద్వారా రూ.10 లక్షల ఉచిత ప్రమాద బీమా (PBB), 24 గంటలూ పనిచేసే హెల్ప్‌లైన్, NRI సెల్, పెట్టుబడుల కోసం వన్-స్టాప్ సేవలను అందిస్తున్నామని తెలిపారు.
ప్రవాసాంధ్రుల రక్షణ, హక్కులు, సంక్షేమం, భాగస్వామ్యం కోసం ఎన్‌ఆర్‌టీ శాఖ మంత్రిగా తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవాసాంధ్రుల కోసం ఎప్పుడూ తలుపులు తెరిచి ఉంచుతుందని అన్నారు.
తెలుగు భాష, సంస్కృతిని మరింత విస్తరించాలి
వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు తెలుగు భాష గొప్పతనం, ప్రాధాన్యతను వివరించారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

మలేషియాలో తెలుగు సమాజం ఏడు తరాలుగా కొనసాగిస్తున్న సాంస్కృతిక వారసత్వం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. విదేశాల్లో పెరుగుతున్న కొత్త తరాలకు తెలుగు భాష, సంస్కృతి పట్ల అనుబంధాన్ని పెంచే కార్యక్రమాలు మరింత విస్తృతంగా చేపట్టాలని సూచించారు.

మాతృభూమి అభివృద్ధిలోనూ భాగస్వామ్యం కావాలి
మలేషియాలో తెలుగు ప్రజలు సాధించిన విజయాలు గర్వకారణమని మంత్రి అన్నారు. అక్కడి అభివృద్ధిలో భాగస్వాములవుతూనే మాతృభూమి అభివృద్ధికి కూడా తమ వంతు సహకారం అందించాలని కోరారు.

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా వ్యాపార అవకాశాలతో పాటు రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని తెలిపారు. ప్రవాసాంధ్రుల పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం, అంతర్జాతీయ అనుభవం రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

70 ఏళ్లుగా తెలుగు భాష, సంస్కృతికి బలమైన వేదికగా నిలిచిన మలేషియా తెలుగు సంఘం భవిష్యత్తులోనూ మరింత సేవ చేయాలని మంత్రి ఆకాంక్షించారు. TAM స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులు ఐక్యంగా ముందుకు సాగి స్వర్ణాంధ్ర-2047 నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
Tags
Be the first to react