వైసీపీ నేతలను చొక్కాలు పట్టుకొని నిలదీయండి! అక్కడ అభివృద్ధి పనుల జోరు.. ప్రజల హుషారు!
Minister Nimmala: ప్రతి ఇంటికి వెలుగునిచ్చేది మహిళలేనని, వారి గౌరవాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. మహిళల సాధికారత, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.
పాలకొల్లులో రూ.3.76 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. మహిళల గౌరవాన్ని కాపాడాలి..
మహిళలను అవమానించే వైసీపీ నేతలను నిలదీయాలి: మంత్రి నిమ్మల రామానాయుడు..
పాలకొల్లు: ప్రతి ఇంటికి వెలుగునిచ్చేది మహిళలేనని, వారి గౌరవాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. మహిళల సాధికారత, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.
పాలకొల్లు పట్టణంలో ఒకేరోజు రూ.3.76 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు కూటమి నాయకులతో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా బ్రాడీపేట బైపాస్ రోడ్డు, కొత్త కుళాయి చెరువు ప్రాంతంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు.
మహిళలను అవమానించే పోస్టులు పెట్టడం దారుణం:
సోషల్ మీడియా వేదికగా మహిళలను అవమానించేలా కొందరు వైసీపీ నాయకులు పోస్టులు పెడుతున్నారని మంత్రి నిమ్మల ఆరోపించారు. రాజకీయాల్లో చురుకుగా పనిచేసే మహిళలతో పాటు, భర్తలు రాజకీయాల్లో ఉన్న కారణంగా కుటుంబానికే పరిమితమైన మహిళలను కూడా లక్ష్యంగా చేసుకుని అసభ్యకర, అవహేళనాత్మక పోస్టులు పెడుతున్నారని అన్నారు.
ఇలాంటి చర్యలు మహిళలను మానసికంగా వేధించడమే కాకుండా, వారి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉన్నాయని పేర్కొన్నారు. కొందరిని తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తున్నారని, ఇది అత్యంత దురదృష్టకరమని అన్నారు.
సమాజంలో మహిళల పట్ల ఇలాంటి నీచమైన వైఖరిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించకూడదని మంత్రి పిలుపునిచ్చారు. మహిళలను అవమానించే వైసీపీ నాయకులు పార్టీ కండువాలతో ప్రజల వద్దకు వచ్చినప్పుడు వారిని నిలదీయాలని కోరారు.
మహిళల అభ్యున్నతే రాష్ట్ర అభివృద్ధికి పునాది:
మహిళల అభ్యున్నతే రాష్ట్ర అభివృద్ధికి పునాది అని నిమ్మల రామానాయుడు అన్నారు. మహిళల భద్రత, గౌరవం, సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు.
తాను నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్నానంటే తన భార్య సహకారం కూడా అందులో ముఖ్యమైన భాగమని మంత్రి పేర్కొన్నారు. కుటుంబంలో మహిళల సహకారం, ప్రోత్సాహం ఎంతో విలువైనదని చెప్పారు.
రెండేళ్లలో పాలకొల్లుకు రూ.1,300 కోట్ల నిధులు:
పాలకొల్లు నియోజకవర్గాన్ని అభివృద్ధి, సంక్షేమంలో ఆదర్శంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లలో నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం రూ.1,300 కోట్ల నిధులు తీసుకొచ్చినట్లు చెప్పారు. గత వైసీపీ పాలనలో విధ్వంసం జరిగిందని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అభివృద్ధి వైపు ముందుకు సాగుతోందని మంత్రి విమర్శించారు.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 70 నుంచి 90 శాతం వరకు పూర్తయిన టిడ్కో ఇళ్లకు వైసీపీ ఐదేళ్ల పాలనలో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు. కనీసం తట్ట మట్టి పని కూడా చేపట్టలేదని విమర్శించారు.
టీడీపీ ప్రభుత్వ కాలంలో పూర్తయిన ఇళ్లకు పార్టీ రంగులు వేసి, వాటిని లబ్ధిదారుల పేరుతో బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారని, ఆ మొత్తాన్ని వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించిందని నిమ్మల ఆరోపించారు.
ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణంపైనా విమర్శలు:
పాలకొల్లు వంద పడకల ప్రభుత్వాసుపత్రి నూతన భవనం కోసం గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.12.60 కోట్ల నిధులు తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. అయితే వైసీపీ ఐదేళ్ల పాలనలో ఆ భవన నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు.
అధికారంలో ఉన్న సమయంలో పదవులు అనుభవించిన వైసీపీ నాయకులు అభివృద్ధిని పట్టించుకోలేదని ఆరోపించారు. అభివృద్ధి, సంక్షేమం గురించి మాట్లాడే నైతిక అర్హత వారికి లేదని మంత్రి వ్యాఖ్యానించారు.
కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలు:
కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాలను మంత్రి వివరించారు. పెన్షన్లు, తల్లికి వందనం కింద కుటుంబంలో చదువుతున్న ప్రతి పిల్లవాడికి రూ.15,000, మూడు ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.5కే అన్న క్యాంటీన్లలో భోజనం వంటి పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
రూ.3.76 కోట్లతో పలు అభివృద్ధి పనులు:
పాలకొల్లు పట్టణంలో ఒకేరోజు మొత్తం రూ.3.76 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
రూ.1.20 కోట్లతో 30, 10, 9, 1వ వార్డుల్లో మంచినీటి సరఫరా పైపులైన్ పనులు.
రూ.1 కోటితో శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయంలో నిత్య అన్నదాన భవనం.
రూ.50 లక్షలతో మున్సిపల్ కార్యాలయంలో పాత శిథిల భవనం స్థానంలో కొత్త భవనం.
పశువుల ఆసుపత్రి ప్రాంగణంలో రూ.6.20 లక్షలతో ప్రహరీ గోడ.
రూ.40 లక్షలతో మంచినీటి సరఫరా వాటర్ వర్క్స్ అభివృద్ధి పనులు.
బ్రాడీపేట బైపాస్ రోడ్డు, కొత్త కుళాయి చెరువు వద్ద రూ.60 లక్షలతో బ్యూటిఫికేషన్ పనులు.
ఈ పనులు పూర్తయితే పట్టణంలో మౌలిక వసతులు మరింత మెరుగుపడతాయని మంత్రి తెలిపారు.
మంత్రికి ఘన స్వాగతం:
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు ఆయా ప్రాంతాలకు చేరుకున్న మంత్రి నిమ్మల రామానాయుడికి స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతులు ఇచ్చి పూల వర్షం కురిపించారు.
కొందరు స్థానికులు కృతజ్ఞతగా శాలువాలు కప్పి మంత్రిని సత్కరించారు. కూరగాయలను కూడా అందజేశారు. మంత్రి నిమ్మల కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి మోటార్‌సైకిల్‌పై వివిధ ప్రాంతాల్లో పర్యటించారు.
ఈ కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. పాలకొల్లు పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రజల అవసరాలకు అనుగుణంగా కొనసాగిస్తామని మంత్రి నిమ్మల తెలిపారు.
Tags
Be the first to react