కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) నూతన ప్రధాన సమాచార కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజ్‌కుమార్ గోయల్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనతో పాటు మరో ఎనిమిది మందిని సమాచార కమిషనర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ చేసిన సిఫారసుల ఆధారంగా ఈ నియామకాలు జరిగినట్లు కేంద్ర వర్గాలు వెల్లడించాయి. ఈ నియామకాలతో సీఐసీలో చీఫ్ కమిషనర్ సహా మొత్తం తొమ్మిది పోస్టులు ఒకేసారి భర్తీ అయ్యాయి. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత కమిషన్ పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేయనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
కొత్తగా నియమితులైన కమిషనర్ల జాబితాలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఉండటం గమనార్హం. సీనియర్ జర్నలిస్టులు పీఆర్ రమేశ్, అశుతోష్ చతుర్వేది, రైల్వే బోర్డు మాజీ చైర్‌పర్సన్ జయవర్మ సిన్హా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుధారాణి రేలంగి వంటి వారు ఈ జాబితాలో ఉన్నారు. సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రాజ్‌కుమార్ గోయల్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో అప్పటి చీఫ్ కమిషనర్ హీరాలాల్ సమరియా పదవీ విరమణ చేయగా, మిగిలిన కమిషనర్ల పోస్టులు 2023 నవంబర్ నుంచే ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన నియామకాలు సీఐసీ పనితీరుకు ఊతమివ్వనున్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
అయితే, ఈ నియామకాల ఎంపిక ప్రక్రియపై విపక్షాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ ఎంపికలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించలేదని ఆరోపిస్తూ కమిటీ సమావేశంలో అసమ్మతి నోట్‌ను ఆయన సమర్పించినట్లు సమాచారం. సమాచార హక్కు చట్టం అమలులో కీలక పాత్ర పోషించే సీఐసీలో సామాజిక సమతుల్యత తప్పనిసరి అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి.
కమిషనర్‌గా ఎంపికైన సుధారాణి రేలంగి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళ కావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమె ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీఎస్సీ పూర్తి చేసి, న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. న్యాయరంగంలో 35 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె గతంలో సీబీఐలో ప్రాసిక్యూషన్ డైరెక్టర్‌గా, కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆమె పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు (పీఎన్‌జీఆర్‌బీ)లో సభ్యురాలిగా కొనసాగుతున్నారు. ఆమె ఎంపికతో సీఐసీలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం లభించడం విశేషంగా భావిస్తున్నారు.